Begin typing your search above and press return to search.

మళ్లీ ‘బూమ్.. బూమ్..’ ఈసారి ‘టాప్’ గేర్ లో..

2016 నుంచి భారత పేస్ బౌలింగ్ లో అత్యంత ప్రధాన ఆటగాడిగా నిలిచాడు జస్ ప్రీత్ బుమ్రా.

By:  Tupaki Desk   |   2 Oct 2024 9:30 PM GMT
మళ్లీ ‘బూమ్.. బూమ్..’ ఈసారి ‘టాప్’ గేర్ లో..
X

హెడింగ్ చూసి.. ఇదేదో మద్యం బ్రాండ్ తిరిగొస్తుందని అనుకోకండి.. విషయం అంతా క్రికెట్ కు సంబంధించినది.. ప్రపంచ క్రికెట్ లో భారత ఆటగాళ్ల ప్రతిభకు సంబంధించినది.. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. చెన్నై, కాన్పూర్ లో జరిగిన రెండు టెస్టుల్లోనూ మన జట్టు గెలిచేసింది. చెన్నై టెస్టును మూడు రోజుల్లో ముగించింది. కాన్పూర్ లో అయితే మరీ చెలరేగింది. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట రద్దయినా టీమ్ ఇండియా దుమ్మరేపింది. బంగ్లాను పసి కూన కంటే దారుణంగా మార్చేసి ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో బలంగా నిలిచింది. కాగా, భారత జట్టు ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే మూడు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. ఆపై ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

అతడే కీలకం..

2016 నుంచి భారత పేస్ బౌలింగ్ లో అత్యంత ప్రధాన ఆటగాడిగా నిలిచాడు జస్ ప్రీత్ బుమ్రా. మధ్యలో గాయం కారణంగా ఏడాదిపైగా జట్టుకు దూరమైన అతడు ప్రపంచ బౌలింగ్ ర్యాంకింగ్స్ లోనూ పడిపోయాడు. వన్డే ప్రపంచ కప్ నకు ముందు కోలుకుని వచ్చిన బుమ్రా మరింత ప్రమాదకరంగా మారాడు. టి20 ప్రపంచ కప్ లో సూపర్ గా రాణించాడు. తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ లో రెండు టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో నూ మూడేసి వికెట్ల చొప్పున తీశాడు. అసలు పేస్ కు సహకరించని పిచ్ ల పైనా బుమ్రా ప్రతాపం చూపుతుంటాడు. ఈ క్రమంలోనే వచ్చే ఆస్ట్రేలియా సిరీస్ లో బుమ్రా అత్యంత కీలకం కానున్నాడు. కాగా, బుమ్రా తాజాగా 870 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ లో మళ్లీ అగ్రస్థానానికి వచ్చాడు. ఆశ్చర్యకరంగా అతడు భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ (869)ను వెనక్కునెట్టి నంబర్‌ వన్‌ గా నిలిచాడు. బంగ్లా టెస్టు సిరీస్ లో వీరిద్దరూ చెరో 11 వికెట్ల పడగొట్టారు. అశ్విన్ ఒక సెంచరీ కూడా చేయడంతో అతడికే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. ఇద్దరిలో బుమ్రానే పొదుపుగా బౌలింగ్ చేశాడు. కాగా, ఆస్ట్రేలియా పేసర్లు హేజిల్‌వుడ్, కెప్టెన్ పాట్ కమిన్స్‌, దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ రబాడ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. టీమ్ ఇండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ ఏడాది బుమ్రాదే..

ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌ తో టెస్టు సిరీస్‌ జరుగుతున్న సమయంలోనూ జస్ప్రీత్ బుమ్రా టాప్ లో నిలిచాడు. అప్పుడూ అశ్విన్‌ నే వెనక్కునెట్టాడు. టెస్టుల్లో టాప్ ర్యాంక్ సాధించిన భారత పేసర్ గా రికార్డు సృష్టించాడు. కాగా, 2024లో టెస్టుల్లో అత్యధిక తీసిన బౌలర్‌ బ్రుమానే. మొత్తం 7 మ్యాచ్‌ లు ఆడి 38 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక స్పిన్నర్‌ ప్రభాత్ జయసూర్య 7 మ్యాచ్‌ లలో 38 వికెట్లు తీసినా.. యావరేజ్‌ లో బుమ్రాదే పైచేయి. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ లో టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ రెండు స్థానాలు దూసుకెళ్లి మూడో స్థానానికి చేరాడు. బంగ్లా సిరీస్ లో మూడు అర్ధ సెంచరీలు సాధించడంతో అతడి ర్యాంక్ మెరుగైంది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 6 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మూడు స్థానాలు పడిపోయి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు టాప్‌-10లో చోటు దక్కలేదు. 10వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ కు చేరాడు. బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ జో రూట్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ వరుసగా మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు.