Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ 3 నెలలు ఔట్

అనుకున్నంతా అయింది.. టీమ్ ఇండియాకు బిగ్ బిగ్ షాక్ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వెన్నుగాయానికి గురయ్యాడు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 8:30 PM GMT
టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ 3 నెలలు ఔట్
X

అతడు మామూలు ఆటగాడు కాదు.. మొన్నటి బోర్డర్–గావస్కర్ సిరీస్ లో జట్టంతా ఒక ఎత్తు అతడు ఒక ఎత్తు.. ప్రత్యర్థిని ఒంటిచేత్తో ఓడించాడని చెప్పొచ్చు.. అతడు లేకుంటే బాగు అనుకున్నారు బ్యాట్స్ మెన్. అలాంటి బౌలర్ భారత్ కు దొరకడం లక్ గా పేర్కొన్నారు క్రీడా విశ్లేషకులు. కానీ, అరుదైన ఆ ఆణిముత్యం గాయపడింది. అది కూడా మామూలుగా కాదు.. తీవ్రంగా.

అనుకున్నంతా అయింది.. టీమ్ ఇండియాకు బిగ్ బిగ్ షాక్ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వెన్నుగాయానికి గురయ్యాడు. ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ మధ్యలో గాయంతో మైదానాన్ని వీడిన అతడు మళ్లీ బౌలింగ్ కు దిగలేదు. దీని ఫలితంగా రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు గెలుపు సులువైంది. జట్టు గెలుపునకు చాలా కీలకమైన సందర్భంలోనూ బుమ్రా బంతిని పట్టుకోకపోవడంతోనే చాలామంది అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అతడి గాయం ఎంత తీవ్రమైనదో? అని భయపడ్డారు.

గ్రేడ్-1 అంటే ఎన్ని రోజుల్లో?

బుమ్రాకు వెన్ను గాయం గతంలోనే ఉంది. దీనికారణంగానే అతడు 14 నెలలు క్రికెట్ కు దూరమయ్యాడు. 2023 జూన్ లో ఐర్లాండ్ టూర్ తో తిరిగి వచ్చాడు. అప్పటినుంచి నిర్విరామంగా ఆడుతున్నాడు. వన్డే ప్రపంచ కప్ లో జట్టు ఫైనల్ చేరడంలో షమీతో పాటు బుమ్రా కీలకంగా నిలిచాడు. టి20 ప్రపంచ కప్ లో బుమ్రానే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ. మొన్నటి ఆస్ట్రేలియా సిరీస్ లోనూ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అతడే. కానీ, ఇప్పుడు వెన్ను గాయం తిరగబెట్టింది. ఇది గ్రేడ్ 1 గాయం అని చెబుతున్నారు.

కనీసం 2.. గరిష్ఠం 3 నెలలు బుమ్రా కనీసంగా రెండు నెలలు, గరిష్ఠంగా మూడు నెలలు మైదానానికి దూరం కాక తప్పదంటున్నారు. గ్రేడ్ 1 గాయం కావడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు. మరోవైపు బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకీ అందుబాటులో ఉండడం లేదు. దీంతో టీమ్ ఇండియాకు బిగ్ షాక్ ఖాయం అని అంటున్నారు. ఎందుకంటే చాంపియన్స్ ట్రీఫ వన్డే ఫార్మాట్ లో జరుగుతోంది. మరో మేటి పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్నాడో లేదో స్పష్టత లేదు. బుమ్రా కూడా దూరమైతే హైదరాబాదీ పేసర్ సిరాజ్ ప్రధాన పేసర్ గా భారం మోయాల్సి ఉంటుంది. మరి బుమ్రా ఐపీఎల్ నాటికి అయినా కోలుకుంటాడా..? లేక గతంలోలా సుదీర్ఘ కాలం జట్టుకు దూరం అవుతాడా?