Begin typing your search above and press return to search.

జై షా.. 35ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్.. భారత్ నుంచి 5వ వాడు

కేవలం 30 ఏళ్ల అత్యంత చిన్న వయసులోనే బీసీసీఐ కార్యదర్శి అయిన రికార్డు ఘనత సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Aug 2024 5:01 PM GMT
జై షా.. 35ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్.. భారత్ నుంచి 5వ వాడు
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా అత్యంత చిన్న వయసులోనే పెద్ద పదవిని అధిష్ఠించనున్నారు. కేవలం 35 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ అయిన ఘనతను అందుకోనున్నారు. ఇప్పటికే 30 ఏళ్లకే బీసీసీఐలోకి వచ్చిన జై షా.. బోర్డును తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. తాజాగా ఐసీసీ చైర్మన్ అయ్యారు. వచ్చే డిసెంబరులో ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు. కాగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గానూ జైషా బాధ్యతలు చూశారు. 1988 సెప్టెంబరు 22న ఆయన జన్మించారు. కేవలం 30 ఏళ్ల అత్యంత చిన్న వయసులోనే బీసీసీఐ కార్యదర్శి అయిన రికార్డు ఘనత సొంతం చేసుకున్నారు.

21 ఏళ్లకే క్రికెట్ అసోసియేషన్ లోకి

గుజరాత్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అమిత్ షా కళ్లూ చెవులు. అలాంటి నాయకుడి కుమారుడైన జైషా కేవలం 21 ఏళ్లకే.. అంటే 2009లో అహ్మదాబాద్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ లోకి ప్రవేశించారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ గా బాధ్యతలు చూశారు. 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) జాయింట్ సెక్రటరీ అయ్యారు. ఆ సమయంలో జీసీఏ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘నరేంద్ర మోదీ’ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అప్పుడు జై షా తండ్రి అమిత్ షా జీసీఏ అధ్యక్షుడు కావడం విశేషం. 2015లో జై షా బీసీసీఐ ఫైనాన్స్-మార్కెటింగ్ కమిటీ సభ్యుడయ్యారు. 2019లో బీసీసీఐ కార్యదర్శి అయ్యారు. 2022లో మరోసారి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రెండేళ్ల కిందట బీసీసీఐ ఐపీఎల్ ఐదేళ్ల మీడియా హక్కులు రూ.48,390 కోట్లకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

భారత్ నుంచి ఐదో చైర్మన్

జగ్మోహన్ దాల్మియా (1997-20), శరద్ పవార్ (2010-12), ఎన్.శ్రీనివాసన్ (2014-15), శశాంక్ మనోహర్ (2015-20)లు జై షా కంటే ముందు ఐసీసీ చైర్మన్లు అయ్యారు. కాగా, 1989 నుంచి ఐసీసీ ప్రారంభమైంది. తొలి చైర్మన్ గా కొలిన్ కౌడ్రీ (1989 – 1993), క్లైడ్ వాల్కాట్ (1993–97), మాల్కమ్ గ్రే (2000-03), ఎహసాన్ మని (2003–06), పెర్సీ సన్ (2006–07), రే మాలి (2007–08), డేవిడ్ మోర్గాన్ (2008–10), అలన్ ఇసాక్ (2012–14), ముస్తఫా కమల్ (2014 –15), జహీర్ అబ్బాస్ (2015–16)లు ఐసీసీ చైర్మన్లుగా చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్క్లే చైర్మన్ గా ఉన్నారు.