Begin typing your search above and press return to search.

బంతి వికెట్లకు తగిలి సిక్స్.. ఆ పేసర్ ప్రపంచ కప్ నకు దూరం

అందుకనే గాయంతోనే అతడిని ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ గా విమానం ఎక్కిస్తోంది. దీన్నిబట్టే చెప్పొచ్చు ఆర్చర్ సామర్థ్యం ఏమిటో..?

By:  Tupaki Desk   |   17 Aug 2023 1:30 PM GMT
బంతి వికెట్లకు తగిలి సిక్స్.. ఆ పేసర్ ప్రపంచ కప్ నకు దూరం
X

గాయాలు వెంటాడుతున్నా.. ఫిట్ నెస్ సమస్యలు ఎన్నున్నా.. పేస్ బౌలింగ్ అంటేనే ఓ కిక్.. ఇక గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తే మీడియం పేసర్ అని.. 140 కిలోమీటర్ల వేగాన్ని చేరగలిగితే ఫాస్ట్ మీడియం అని.. 145 దాటి నికరంగా బంతులేస్తే ఫాస్ట్ అని చెబుతుంటారు. 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తే ఇక సూపర్ ఫాస్ట్ గానే లెక్కిస్తారు. కాగా, ఇంగ్లండ్ కూ ఉన్నాడు ఇలాంటి ఓ బౌలర్. అతడి ప్రత్యేకత ఏమంటే తమ దేశం వాడు కాకున్నా.. నిబంధనలు సడలించి మరీ ప్రపంచ కప్ నకు ఎంపిక చేసి ఆడించింది ఇంగ్లండ్ బోర్డు. కానీ బ్యాడ్ లక్ ను నిత్యం వెంటపెట్టుకుని తిరిగే అతడు ప్రపంచ కప్ నకు దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు.

ఇంగ్లిష్ వ్యక్తి, బార్బడోస్ తల్లికి పుట్టిన జోఫ్రా ఆర్చర్ క్రికెట్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కరీబియన్ దీవుల్లోని బార్బడోస్ స్వస్థలం కాగా.. అతడు ఇంగ్లండ్ కు వలస వచ్చాడు. కరీబియన్ దేహ దారుఢ్యంతో పాటు పుట్టుకతో వచ్చిన స్ప్రింట్ లక్షణాలతో పేసర్ గా ఎదిగాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో సత్తా చాటిన అతడికి జాతీయ జట్టుకు ఎంపికలో మాత్రం ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏడేళ్లు ఇంగ్లండ్ లో ఉంటేనే జాతీయ జట్టుకు తీసుకుంటారు. కానీ, ఆర్చర్ విషయంలో దానిని మూడేళ్లకు కుదించారు. అలా 2019లో ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ కప్ లో ఆర్చర్ ను ఆడించారు. నాటి టోర్నీలో ప్రతిభ కనబర్చిన ఆర్చర్ గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని భావించారు.

స్మిత్ కాంకషన్.. లబుషేన్ రాక 2019 యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను ఆర్చర్ తన భీకర బౌలింగ్ తో హడలెత్తించాడు. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు వ్యవహరించాడు. బ్యాట్స్ మెన్ తన బంతులకు గాయపడినా కనీస జాలి కూడా చూపలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక స్టీవ్ స్మిత్ అయితే బంతి హెల్మెట్ కు బలంగా తాకడంతో కాంకషన్ గా వైదొలగాడు. అతడి స్థానంలో లబుషేన్ బ్యాటింగ్ కు వచ్చాడు. కాగా, ఆ సిరీస్ అనంతరం ఆర్చర్ గాయాలకు గురయ్యాడు. ఒకదాని వెంట ఒకటి గాయం అతడిని వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల యాషెస్ సిరీస్ లోనూ ఆడలేదు.

ప్రపంచ కప్ కు రిజర్వ్ ప్లేయర్ గాయాల కారణంగా 28 ఏళ్ల ఆర్చర్ భారత్ లో జరగనున్న ప్రపంప కప్ లో పాల్గొనడం కష్టమే. అయితే, అతడు టోర్నీ మధ్యకైనా కోలుకుంటాడని ఇంగ్లండ్ జట్టు గంపెడాశతో ఉంది. అందుకనే గాయంతోనే అతడిని ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ గా విమానం ఎక్కిస్తోంది. దీన్నిబట్టే చెప్పొచ్చు ఆర్చర్ సామర్థ్యం ఏమిటో..?

గత కప్ లో ఆ బంతి హైలైట్ 2019 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ బంతి టోర్నీకే హైలైట్. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 143 కిలోమీటర్ల వేగంతో ఆర్చర్ సంధించిన బంతి బ్యాట్స్ మన్ సౌమ్య సర్కార్ వికెట్ బెయిల్స్ ను పడగొట్టి వికెట్ కీపర్ తలమీదుగా బౌండరీ అవతల పడింది. దీనిని చూసినవారంతా ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. కాగా, ప్రపంచ కప్ నకు ప్రాబబుల్స్ ఎంపిక దగ్గర పడుతుండగా ఆర్చర్ ఫిట్ నెస్ పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అందుకనే న్యూజిలాండ్ తో వచ్చే నెలలో జరిగే నాలుగు వన్డేల సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదు. ఈ సిరీస్ లో ఆడిన ఇంగ్లండ్ జట్టే దాదాపుగా భారత్ లో ప్రపంచ కప్ ఆడుతుందనే అంచనాలున్నాయి.

గత ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీయడమే కాదు.. స్కోర్లు టై అయిన ఫైనల్లో సూపర్ ఓవర్ వేసింది కూడా ఆర్చరే. అయితే, ఆర్చర్ మోచేయి గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ కు ఆడలేకపోయాడు.