Begin typing your search above and press return to search.

జడ్జీల తొండాట.. భారత బాక్సర్‌ కు అన్యాయం!

ప్రస్తుతం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ లో ఒలింపిక్స్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Aug 2024 10:34 AM GMT
జడ్జీల తొండాట.. భారత బాక్సర్‌ కు అన్యాయం!
X

ప్రస్తుతం ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ లో ఒలింపిక్స్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్‌ ఇప్పటివరకు మూడు కాంస్యాలను గెలుచుకుంది. ఈ మూడూ షూటింగ్‌ క్రీడలో వచ్చినవే. ఇంకో పతకం త్రుటిలో చేజారింది. బాక్సింగ్‌ లో భారత బాక్సర్‌ నిశాంత దేవ్‌ కు ఖాయంగా మెడల్‌ వచ్చేదని అంటున్నారు. అయితే జడ్జీల తొండాటతో వేరొకరికి మెడల్‌ పోయింది.

ఒలింపిక్స్‌ లో భారత బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ అసమాన ప్రతిభతో వరుస భౌట్లలో గెలుస్తూ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు దూసుకొచ్చాడు. క్వార్టర్‌ ఫైనల్‌ లో 71 కిలోల విభాగంలో పోటీపడ్డ నిశాంత్‌.. మెక్సికో బాక్సర్‌ మార్కో వెర్డే చేతిలో ఓటమి పాలయ్యాడు. కాదు.. జడ్జీలే ఓడించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ప్రతి రౌండ్‌ లోనూ నిశాంత్‌ దేవ్‌ రాణించాడని.. ప్రత్యర్థితో పోలిస్తే మెరుగ్గా ఆడినా జడ్జీలు విచిత్రంగా ప్రత్యర్థి మార్కో వెర్డేను విజేతగా ప్రకటించడం పట్ల నెటిజన్లు, విశ్రాంత బాక్సర్లు విమర్శలు చేస్తున్నారు. భారత బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసినా అతడికి అన్యాయం చేశారని మండిపడుతున్నారు.

భారత బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ విజేతగా నిలవడమే లక్ష్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. మొదటి రౌండ్‌ లో, రెండో రౌండ్‌ లోనూ విజేతగా నిలిచాడు. అయితే జడ్జీలు రెండో రౌడ్‌ లో ప్రత్యర్థి మార్కో వెర్డేకు అనుకూలంగా 3–2 తేడాతో ఫలితాన్ని ఇచ్చారు. దీంతో నిశాంత్‌ తో పాటు అభిమానులు నివ్వెరపోయారు. మూడో రౌండ్‌ లో సైతం నిశాంత్‌ అద్భుతంగా పోరాడినా ఐదుగురు జడ్జీలు పదేసి పాయింట్లను మార్కో వెర్డెకు ఇవ్వడం గమనార్హం. నిశాంత్‌ కు తొమ్మిది చొప్పున మాత్రమే ఇవ్వడంతో అతడు ఓటమి పాలు కాక తప్పలేదు.

ఈ నేపథ్యంలో నిశాంత్‌ దేవ్‌ కు భారత మాజీ ఛాంపియన్‌ విజేందర్‌ సింగ్, బాలీవుడ్‌ నటుడు రణ్‌ దీప్‌ హుడా సోషల్‌ మీడియాలో మద్దతు తెలిపారు.

అసలు స్కోరింగ్‌ సిస్టమ్‌ ను ఎలా చేశారో నాకు అర్థం కావడం లేదని విజేందర్‌ సింగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నిశాంత్‌ చాలా అద్భుతంగా పోరాడాడని.. ఫలితం పట్ల నిరాశ చెందక్కర్లేదని విజేందర్‌ సింగ్‌ అతడికి మద్దతు ప్రకటించాడు.

ఇక బాలీవుడ్‌ స్టార్‌ రణదీప్‌ హుడా ఒలింపిక్‌ కమిటీపై మండిపడ్డాడు. ఈ బౌట్‌ లో నిశాంత్‌ విజయం సాధించాడని అతడు తెలిపాడు. స్కోరింగ్‌ విధానం అసలు సరైందేనా? నిశాంత్‌ నుంచి ఒలింపిక్‌ కమిటీ పతకాన్ని దోచేసింది అని సోషల్‌ మీడియాలో ఘాటుగా స్పందించాడు. నిశాంత్‌ తన ఆటతీరుతో తమ మనసులను గెలిచాడని అభినందించాడు.