Begin typing your search above and press return to search.

ఆ కోచ్ పదవిలో ఐపీఎల్ కంటే వెయ్యి రెట్లు పాలిటిక్స్.

ఒకరికి మించి ఒకరు అన్నట్లు ప్రతిభావంతులు పుట్టుకొచ్చారు. ఇలాంటి జట్టుకు హెడ్ కోచ్ గా ఉండడం అంటే మామూలు మాటలు కాదు.

By:  Tupaki Desk   |   24 May 2024 6:47 AM GMT
ఆ కోచ్ పదవిలో ఐపీఎల్ కంటే వెయ్యి రెట్లు పాలిటిక్స్.
X

ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు.. 100 కోట్ల మంది పైగా వీరాభిమానులు.. రూ.లక్ష కోట్ల లీగ్.. కనీసం మూడు అంతర్జాతీయ జట్లను తయారుచేయగల సామర్థ్యం.. కోట్లాది మంది కుర్రాళ్లు, పిల్లలు వీధుల్లో అదే పనిగా ఆడే దేశం.. వీటన్నిటినీ మిచిం ప్రపంచ క్రికెట్ ను శాసించేంతటి దమ్ము.. ఇదంతా ఒకే ఒక్క క్రికెట్ బోర్డు గురించి. ఓ 20 ఏళ్ల కిందటి వరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అంటే ప్రపంచ క్రికెట్ కమిటీ (ఐసీసీ) బెదిరిపోయేది.. కానీ, ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పేరు వింటేనే వణికిపోతోంది.

క్రికెట్ బలపడింది.. జట్టు కూడా..

ప్రస్తుతం 2-3 సీనియర్ క్రికెట్ టీమ్ లను తయారుచేయగల సామర్థ్యం భారత క్రికెట్ కు ఉంది. గత ఏడాది ఐర్లాండ్, ఆసియా క్రీడలతో పాటు అసలు సీనియర్ టీమ్ వేర్వేరుగా టోర్నీలు ఆడిన సంగతి తెలిసిందే. కాగా, భారత క్రికెట్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యున్నత స్థానంలో నిలిపిందనే చెప్పాలి. ఇదే సమయంలో టీమిండియా అత్యంత బలంగా మారింది. ఆటగాళ్ల ఫిట్ నెస్ మెరుగుపడింది. ఒకరికి మించి ఒకరు అన్నట్లు ప్రతిభావంతులు పుట్టుకొచ్చారు. ఇలాంటి జట్టుకు హెడ్ కోచ్ గా ఉండడం అంటే మామూలు మాటలు కాదు.

ఒకరికి ముగ్గురు కోచ్ లు..

టీమిండియాకు గతంలో ఒకరే కోచ్ ఉండేవారు. అయితే, పోటీతత్వం, పెరుగుతున్న ప్రమాణాల రీత్యా బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు హెడ్ కోచ్ ను నియమించడం ప్రారంభించారు. ప్రస్తుతం దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. కాగా, ద్రవిడ్ పదవీ కాలం వన్డే ప్రపంచ కప్ తోనే ముగిసింది. కానీ, అతడిని కొనసాగించారు. జూన్ 1 నుంచి జరిగే టి20 ప్రపంచ కప్ తర్వాత ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఆస్ట్రేలియాకు నాలుగేళ్లు కోచ్ గా పనిచేసిన మాజీ ఓపెనర్ జస్టిన్‌ లాంగర్.. ద్రవిడ్ స్థానంలో వచ్చేందుకు రేసులో ఉన్నాడనే కథనాలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ పేర్లు కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

అమ్మో భారత కోచ్ గానా?

ఐపీఎల్‌ లో లఖ్‌ నవూ సూపర్ జెయింట్స్‌ కు లాంగర్‌ ప్రధాన కోచ్‌. అయితే, టీమిండియా కోచ్ పదవిపై ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ తనకు ఓ కీలక విషయాన్ని చెప్పినట్లు లాంగర్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌ గా పనిచేసినప్పుడు చాలా అలసిపోయానని.. జాతీయ జట్టును నడిపించడం తేలికైన విషయం కాదని అంగీకరించాడు. దీనిపై రాహుల్‌ తో మాట్లాడానని.. ‘నువ్వు ఐపీఎల్‌ జట్టు కోచ్‌ గా ఎంత ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కొని ఉంటావో.. టీమిండియా ప్రధాన కోచ్‌ గా దానికి వెయ్యి రెట్లు అధికంగా తట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడన్నాడు. ఇది మంచి సలహాగా భావిస్తున్నానని.. తానూ అదే ఊహించానని లాంగర్‌ తెలిపాడు. కాగా, టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చేవారు 2027 వన్డే ప్రపంచ కప్‌ వరకు కోచ్‌ గా ఉండాల్సి ఉంటుంది.