ఒక క్రికెటర్.. అటు మోదీ, ఇటు కైఫ్ ఒకటే ప్రశంసలు వర్షం
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
By: Tupaki Desk | 22 Dec 2024 10:30 PM GMTఅంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్ క్రికెట్ కు అశ్విన్ అందించిన సేవలకు గుర్తుగా ఖేల్ రత్న అవార్డునిచ్చి సత్కరించాలని కోరుతున్నారు. ఆకస్మాత్తుగా కెరీరుకు గుడ్ బై చెప్పిన అశ్విన్ నిర్ణయం పట్ల అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ దగ్గర నుంచి అతని సహచరుల వరకు అంతా క్రికెట్ కు అశ్విన్ అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. అశ్విన్ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆశ్యర్యపోయారంటూ ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో అశ్విన్ ఆటతీరును అభినందించిన ప్రధాని మోదీ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
‘‘మరెన్నో ఆఫ్ బ్రేక్స్ సంధించి ప్రత్యర్థి బ్యాటర్లను ఔట్ చేస్తావని అనుకుంటున్న సమయంలో క్యారమ్ బంతితో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచావు. అయితే ఇలాంటి ప్రకటన చేయడం అత్యంత కఠినమని అందరికీ తెలుసు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటావు. భారత్ కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావు అందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా, జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టావు. మీ అమ్మగారు ఆస్పత్రిలో ఉన్నప్పుడూ జట్టుకోసం ఆలోచించావు. చెన్నై వరదల సమయంలోనూ కుటుంబ సభ్యులతో కాకుండా జట్టుతోనే ఉన్నావు. ఇక జర్సీ నంబర్ 99ని మేం మిస్ కాబోతున్నాం’’ అంటూ ప్రధాని మోదీ అశ్విన్ కు లేఖ రాశారు.
మరోవైపు అశ్విన్ ఒకప్పటి సహచరుడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా అశ్విన్ సేవలను గుర్తు చేస్తూ తన అనుభవాలను పంచుకున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్ లోని బలహీనతలను పసిగట్టి పంజా విసరడం అశ్విన్ ప్రత్యేకతంటూ అభినందించాడు కైఫ్. అశ్విన్ తో కలిసి కైఫ్ ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు ఆడారు. ఆ సమయంలో అశ్విన్ నిశిత పరిశీలనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు కైఫ్. ఒక సందర్భంలో ఢిల్లీ ఐపీఎల్ జట్టులో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా, అతడికి బౌలింగ్ చేయనని అశ్విన్ చెప్పాడు. అలా ఎందుకన్నావని నేను ప్రశ్నిస్తే ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. దానికి నేను ఆశ్యర్యపోయా, ఆట పట్ల అతడి అనాలసిస్ ఈ స్థాయిలో ఉంటుందా? అని అనుకొన్నా, స్మిత్ తన హెల్మెట్ లో కెమెరా పెట్టుకున్నాడు. మన బౌలింగ్ తీరును అంతా రికార్డు చేసుకుంటాడు. అది వరల్డ్ కప్ లో విశ్లేషించుకోడానికి ప్రత్యర్థి జట్టుకు పనికొస్తుంది. అందుకే తాను బౌలింగ్ చేయనని అశ్విన్ నాతో చెప్పాడంటూ గతంలో జరిగిన సంఘటనను గుర్తుచేశాడు కైఫ్.
అంతర్జాతీయ క్రికెట్ లో 765 వికెట్లు పడగొట్టిన అశ్విన్ 2013లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అశ్విన్ సేవలను కొనియాడుతూ ప్రముఖులు అభినందినలు తెలుపుతున్నారు.