దిగితే సెంచరీ.. లేదా అర్థ సెంచరీ.. ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం
ఆడుతున్నది 8వ టెస్టే.. కానీ ఇప్పటికే ఐదు సెంచరీలు.. నాలుగు అర్ధ సెంచరీలు.. 13 ఇన్నింగ్స్ లో 1,002 పరుగులు.. కమిందు..
By: Tupaki Desk | 29 Sep 2024 2:30 AM GMTఆడుతున్నది 8వ టెస్టే.. కానీ ఇప్పటికే ఐదు సెంచరీలు.. నాలుగు అర్ధ సెంచరీలు.. 13 ఇన్నింగ్స్ లో 1,002 పరుగులు.. కమిందు.. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసినవారిలో మూడో స్థానం. అది కూడా బ్యాటింగ్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (13 ఇన్నింగ్స్; ఆస్ట్రేలియా) సమానం. ఎప్పుడో 1930లో బ్రాడ్‌మన్ సాధించిన రికార్డును 94 ఏళ్ల అనంతరం 26 ఏళ్ల కుర్రాడు సాధించాడు. ఇతడి కంటే కేవలం హెర్బర్ట్ సట్ క్లిఫ్ (ఇంగ్లాండ్, 1925లో), ఎవర్టన్ వీక్స్ (వెస్టిండీస్, 1949లో) కేవలం 12 ఇన్నింగ్స్ లలోనే వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నారు. అంటే.. వందేళ్ల కిందట, 75 ఏళ్ల కిందట వారు నెలకొల్పిన రికార్డులకు దగ్గరగా వెళ్లాడు ఈ బ్యాట్స్ మన్. అందుకనే అతడిని ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనంగా పేర్కొంటున్నారు.
ఎవరీ కుర్రాడు?
ఇటీవల భారత్ తో జరిగిన వన్డే సిరీస్ లో శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు.. కుడిచేత్తో ఆఫ్ బ్రేక్, ఎడమ చేత్తో ఆర్థొడాక్స్ స్పిన్ వేసే కమిందు.. బ్యాట్స్ మెన్ కు తగినట్లుగా తన బౌలింగ్ శైలిని మార్చుకోగలడు. అయితే, బౌలింగ్ లో ఎంతటి వైవిధ్యం చూపుతున్నాడో.. బ్యాటింగ్ లో అంతకంటే స్థిరత్వం ప్రదర్శిస్తున్నాడు. కేవలం 8 టెస్టుల్లో 13 ఇన్నింగ్స్ లో 9 సార్లు సెంచరీ లేదా అర్ధ సెంచరీ సాధించాడంటేనే కమిందు సత్తా ఏమిటో తెలుస్తోంది.
ఏడు నుంచి ఐదుకు..
కమిందు మెండిస్ ను స్పిన్ ఆల్ రౌండర్ గా పరిగణించారు. దీంతో అతడిని శ్రీలంక జట్టు టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ పంపింది. కానీ, బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారీ కమిందు అద్భుతంగా ఆడుతున్నాడు. ఇటీవలి ఇంగ్లండ్ సిరీస్ లో మొదటి టెస్టులో సెంచరీ, మిగతా రెండు టెస్టుల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో ఇతడు మామూలు బ్యాట్స్ మన్ కాదని భావించిన శ్రీలంక జట్టు ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి ప్రమోట్ చేసింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న కమిందు తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో 182 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.
మున్ముంద ఏం చేస్తాడో..?
ఇప్పటికైతే కమిందు మెండిస్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటికే ఇలాంటివారు ఎందరో వచ్చారు. కొత్తలో అద్భుత ప్రతిభ చాటి తర్వాత కనుమరుగయ్యారు. కమిందు కూడా అలాంటివాడు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. మొన్నటివరకు శ్రీలంక క్రికెట్ పూర్తి అనిశ్చితిలో ఉంది. ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.
కొసమెరుపు: వచ్చే ఐపీఎల్ వేలంలో కమిందు మెండిస్ కు ఎంతటి ధర పలుకుతుందో చూడాలి.