Begin typing your search above and press return to search.

2 మ్యాచ్ లు.. 3 జట్లు.. 4 ఆటగాళ్లు.. టెస్టుల ‘సెంచరీ’

భారత టెస్టు క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు హైదరాబాదీ మొహ్మద్ అజహరుద్దీన్. భారత్ కు పదేళ్లు కెప్టెన్

By:  Tupaki Desk   |   6 March 2024 4:30 PM GMT
2 మ్యాచ్ లు.. 3 జట్లు.. 4 ఆటగాళ్లు.. టెస్టుల ‘సెంచరీ’
X

అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో వంద మ్యాచ్ లు ఆడడం అంటే అదో గొప్ప రికార్డు. చరిత్రలో ఇప్పటివరకు 2 వేలకుగా టెస్టులు జరిగితే కేవలం 77 మంది మాత్రమే టెస్టుల సెంచరీ కొట్టారు. టెస్టులు బాగా తగ్గిపోతున్న ఈ కాలంలో ఓ క్రికెటర్ వంద మ్యాచ్ లు ఆడడమూ గగనమే. ఇలాంటి సమయంలో రెండు రోజుల వ్యవధిలో నలుగురు ఆటగాళ్లు ‘సెంచరీ టెస్టు’ ఆడబోతున్నారు.

ఈ దిగ్గజాలంతా 90ల్లో ఔట్

భారత టెస్టు క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లు హైదరాబాదీ మొహ్మద్ అజహరుద్దీన్. భారత్ కు పదేళ్లు కెప్టెన్. వరుసగా మూడు వన్డే ప్రపంచ కప్ లలో సారథ్యం వహించాడు. అలాంటి వాడు మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుని.. 99వ టెస్టుతో జీవితకాల వేటుకు గురయ్యాడు. కెప్టెన్ గానే కాదు.. ఆటగాడిగానూ మరో మూడునాలుగేళ్లు ఆడే సత్తా ఉండి కూడా మహేంద్ర సింగ్ ధోనీ.. 90వ టెస్టుతో ఈ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. మేటి పేసర్ జహీర్‌ ఖాన్‌ (92)కూ వంద టెస్టులు ఆడే భాగ్యం దక్కలేదు. అయితే, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు.

భారత్ లో వీరిద్దరూ..

గురువారం నుంచి ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరిగే ఐదో టెస్టు అశ్విన్ కు వందోది. ఇదే సిరీస్ లో అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. 2011లో వెస్టిండీస్‌ పై ఢిల్లీ టెస్టులో అరంగేట్రం చేసిన అశ్విన్ 13 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. 507 వికెట్లు పడగొట్టాడు. 35 సార్లు ఐదేసి, 8 సార్లు 10 వికెట్లు పడగొట్టాడు. వందో టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా అశ్విన్‌ చరిత్రలో నిలిచిపోనున్నాడు. ఇక ధర్మశాల మ్యాచ్ తోనే ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బెయిర్ స్టో వందో టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇంగ్లండ్ తరఫున ఇప్పటివరకు 16 మంది మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. 2012లో వెస్టిండీస్‌ తో అరంగేట్రం చేసిన బెయిర్‌స్టో 36.42 సగటుతో 5974 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ లో వారిద్దరూ

సొంతగడ్డపై శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టు ద్వారా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, కెప్టెన్ పేసర్ టిమ్ సౌథీ తమ కెరీర్ లో వందో టెస్టు ఆడనున్నారు. విలియమ్సన్‌ 32 సెంచరీలతో 8,675 పరుగులు చేయడమే కాక 30 వికెట్లు పడగొట్టాడు. సౌథీ 378 వికెట్లు తీశాడు. 6 హాఫ్‌ సెంచరీలు సహా 2,072 పరుగులు చేశాడు. విలియమ్సన్.. ప్రపంచ మేటి బ్యాటర్. విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్ ల సమకాలీనుడు. న్యూజిలాండ్‌ తరఫున నలుగురు మాత్రమే 100 టెస్ట్‌ల మార్కును తాకారు. విలియమ్సన్, సౌథీ వారి సరసన చేరనున్నారు.

కొసమెరుపు: విలియమ్సన్.. ఐపీఎల్ ద్వారా హైదరాబాదీలకు సుపరిచితుడు. అభిమానులు అతడిని ‘‘కేన్ మామ’’గా పిలుస్తుంటారు. బెయిర్ స్టో కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ గా ఆస్ట్రేలియన్ ఓపెనర్ వార్నర్‌తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెయిర్ స్టో వన్డేల్లో వందో మ్యాచ్‌ కూడా ధర్మశాలలోనే ఆడాడు.