Begin typing your search above and press return to search.

క్రికెటర్లలో ఇతడో ఆణిముత్యం.. కెప్టెన్సీనే కాదు.. కాంట్రాక్టూ వద్దన్నాడు

మొన్న బాబర్ అజామ్.. నేడు ఇతడు.. టి20 ప్రపంచ కప్ లో ఓటమి దెబ్బకు మరో వికెట్ పడిపోయింది

By:  Tupaki Desk   |   19 Jun 2024 7:14 AM GMT
క్రికెటర్లలో ఇతడో ఆణిముత్యం.. కెప్టెన్సీనే కాదు.. కాంట్రాక్టూ వద్దన్నాడు
X

మొన్న బాబర్ అజామ్.. నేడు ఇతడు.. టి20 ప్రపంచ కప్ లో ఓటమి దెబ్బకు మరో వికెట్ పడిపోయింది. సూపర్ 8 దశకు చేరలేకపోవడంతో మన సన్ రైజర్స్ మాజీ కెప్టెన్, బ్యాట్స్ మన్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైనా కెప్టెన్సీ వదిలేస్తారు.. లేక పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటారు.. కానీ, ఇతడు మాత్రం ఏకంగా మరింత పెద్ద విషయమే ప్రకటించాడు. ఇపుడిది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

ప్రపంచకప్ లు అనగానే చెలరేగి ఆడుతుంది న్యూజిలాండ్. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు కనీసం సెమీస్ వరకు చేరుతుంది. మొన్నటి వన్డే వరల్డ్ కప్ లోనూ కివీస్ సెమీస్ కు వచ్చింది. అంతకుముందు టెస్టు చాంపియన్ షిప్ ను గెలుచుకుంది. దీనికిముందు 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో త్రుటిలో కప్ చేజార్చుకుంది. అలాంటి న్యూజిలాండ్ ప్రస్తుతం అమెరికా-కరీబియన్ దీవుల వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో కనీసం సూపర్ 8కు కూడా చేరలేకపోయింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనటువంటి పరాజయం ఎదుర్కొంది.

దీంతో కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ (టి20లు, వన్డేలు) లో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతోపాటు 2024-25 సీజన్‌ సెంట్రల్ కాంట్రాక్ట్‌ నూ కాదన్నాడు. ఆటగాడిగా మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే, మున్ముందు సెంట్రల్ కాంట్రాక్ట్‌ తీసుకుంటానని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్ గ్రూప్‌-సిలో ఉంది. అఫ్గానిస్థాన్‌, వెస్టిండీస్‌ చేతిలో ఓడడంతో దెబ్బపడింది. ఉగాండా, పపువా న్యూగినిపై నెగ్గినా సూపర్-8కు వెళ్లలేకపోయింది.

కాగా, న్యూజిలాండ్ వేసవిలో చాలా తక్కువ మ్యాచ్‌ లు ఆడుతుందని.. విదేశాల్లో ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దన్నట్లు విలియమ్సన్ చెప్పాడు.

కేన్ మామ మనకు బాగా దగ్గరే

విలియమ్సన్ క్రికెట్ లో జెంటిల్ మన్. 2015 ప్రపంచ కప్ ఫైనల్లో కప్ అందినట్లే అంది చేజారినా అతడు అత్యంత కూల్ గా కనిపించాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు అత్యంత నిలకడగా ఆడాడు. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.