అమెరికా అండర్-19లో కీపర్ అమోఘ్ రెడ్డి.. భారత్ కూ తెలుగోడే
ఇంకా లోతుగా పరిశీలిస్తే తెలుగు మూలాలు కూడా ఉన్నట్లు స్పష్టమైంది.
By: Tupaki Desk | 30 Jan 2024 11:30 AM GMTదక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ లో భారత జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి మంచి జోరుమీదుంది. తొలుత బంగ్లాదేశ్, తర్వాత ఐర్లాండ్, తాజాగా అమెరికా జట్టునూ ఓడించింది. ఇక మిగిలింది న్యూజిలాండ్ నూ మట్టి కరిపిస్తే మన జట్టు తదుపరి రౌండ్ కు వెళ్తుంది. అయితే, అమెరికాతో మ్యాచ్ సందర్భంగా పరిశీలిస్తే ఓ విశేషం కనిపించింది. ఆ జట్టులో అందరు ఆటగాళ్లూ భారత సంతతికి చెందినవారే. అంటే 15 మంది ఆటగాళ్లూ భారత సంతతి వారే. ఇంకా లోతుగా పరిశీలిస్తే తెలుగు మూలాలు కూడా ఉన్నట్లు స్పష్టమైంది.
ఆ 15 మందిలో..
ప్రణవ్ చెట్టిపాళ్యం, భవ్య మెహతా, సిద్ధార్థ్ కప్పా, రిషి రమేష్ (కెప్టెన్), ఉత్కర్ష్ శ్రీవాత్సవ, మానవ్ నాయక్, అమోఘ్ రెడ్డి ఆరేపల్లి (వికెట్ కీపర్), పార్థ్ పటేల్, ఆరిన్ నాదకర్ణి, అతీంద్ర సుబ్రమణియన్, ఆర్య గార్గ్, ఆర్యన్ బత్రా, రాయన్ భగానీ, ఖుష్ బలాలా, ఆర్యమాన్ సూరి... ఇవీ అమెరికా అండర్ -19 జట్టులోని ఆటగాళ్ల పేర్లు. వీరిలో రిషి రమేష్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత కీలకమైన ఆటగాడు అమోఘ్ రెడ్డి వికెట్ కీపర్. మిగతావారంతా భారత్ లోని ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా వారి పేర్లను బట్టి స్పష్టమవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి ఒకరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, అమోఘ్ రెడ్డిది మాత్రం పూర్తిగా తెలుగు నేపథ్యం అని అతడి పేరును బట్టి తెలిసిపోతోంది.
అందరూ అక్కడ పుట్టినవారే?
అమెరికా అండర్ 19 జట్టులో అందరూ భారతీయ మూలాలు ఉన్నవారే అయినా.. వీరిలో ఎవరూ భారత్ లో జన్మించలేదని వారి ప్రొఫైల్స్ ను బట్టి అర్థం అవుతోంది. అందులోనూ వీరిలో ఎక్కువ శాతం సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లిన భారతీయులకు జన్మించినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే అమోఘ్ రెడ్డి ఆరేపల్లి పుట్టింది కాలిఫోర్నియాలోని శానోస్ లో. అతడికి మరో 40 రోజుల్లో 18 ఏళ్లు నిండనున్నాయి. వీరి తల్లిదండ్రులు సాఫ్ట్ వేర్ బూమ్ లో అమెరికా వెళ్లినట్లుగా తేలుతోంది. అమెరికాలో వికెట్ కీపర్ గా కీలక పాత్ర పోషిస్తున్న అమోఘ్.. భారత్ పై 27 పరుగులు చేశాడు.
కొసమెరుపు: అండర్ 19 భారత జట్టులోనూ ఓ తెలుగోడు ఉన్నాడు. అతడి పేరు అవనీష్ ఆరవెల్లి. ఇతడి స్వస్థలం సిరిసిల్ల. విచిత్రం ఏమంటే అవనీష్ కూడా వికెట్ కీపరే. మరోవైపు అవనీష్ తండ్రి గతంలో అమెరికా వెళ్లి ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేశారు. కానీ,కుమారుడిని క్రికెటర్ గా చేయాలన్న లక్ష్యంతో స్వదేశం తిరిగొచ్చారు. ఒకవేళ అవనీష్ అక్కడే ఉండిఉంటే అమెరికా జట్టులో కీపర్ అయి ఉండేవాడేమో?