Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ గా ఇంగ్లండ్ డాషింగ్ బ్యాట్స్ మన్?

కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో వైఫల్యాలతో అతడిని తప్పించి ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్ ను నియమిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Jan 2025 9:30 PM GMT
టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ గా ఇంగ్లండ్ డాషింగ్ బ్యాట్స్ మన్?
X

అభిషేక్ నాయర్.. భారత దేశవాళీ క్రికెట్ లో మంచి ఆల్ రౌండర్.. సిక్స్ ప్యాక్ తో సూపర్ ఫిట్ గా ఉంటూ కుడి చేతి మీడియం పేస్.. ఎడమ చేతి బ్యాటింగ్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పేరు తెచ్చుకున్నాడు. 41 ఏళ్ల నాయర్ పుట్టింది మన సికింద్రాబాద్ లోనే. రంజీల్లో మాత్రం ముంబైకి ఆడాడు. ఐపీఎల్ లో మాత్రం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు అభిషేక్ నాయర్ మంచి స్నేహితుడు. ఈ పరిచయంతోనే గంభీర్ హెడ్ కోచ్ అయినవెంటనే నాయర్ ను బ్యాటింగ్ కోచ్ గా తెచ్చుకున్నాడు.

నాయర్ ఎందుకు?

టి20, వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లో రాణించిన హెడ్ కోచ్ గంభీరే మేటి బ్యాటర్. అలాంటప్పుడు ఇంక నాయర్ అవసరం ఏముంది? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వాస్తవానికి నాయర్ ఆల్ రౌండర్. కోహ్లి, రోహిత్ లకు అతడు చెప్పగలిగేవాడూ కాదు. అయినా అతడిని బ్యాటింగ్ కోచ్ గా తీసుకోవడంలో అర్థం ఏమిటో ఎవరికీ అంతుబట్టలేదు.

పీటర్సన్ కు బాధ్యతలు?

హెడ్ కోచ్ గంభీర్ పూర్తిగా అన్నీ చూసుకోలేడు. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్ కు ప్రత్యేక కోచ్ ను తీసుకోవడం సరైనదే. అందుకే నాయర్ కు అవకాశం ఇచ్చారు. కానీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో వైఫల్యాలతో అతడిని తప్పించి ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్ ను నియమిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. పీటర్సన్ కూడా తాను ఇలాంటి బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నాడు. ఇంగ్లండ్ కు 104 టెస్టులు ఆడిన పీటర్సన్ 8వేల పైగా, 136 వన్డేల్లో 40.73 సగటుతో 4,440 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ రాణించాడు. అయితే, ఇప్పటివరకు పీటర్సన్ ఎక్కడా కోచింగ్ ఇవ్వలేదు. పైగా ఇతడు ఇంగ్లండ్ కు ఇడిన సమయంలో జట్టులో క్రమశిక్షణా రాహిత్యం ఆరోపణలున్నాయి. అప్పటి కెప్టెన్ తో పీటర్సన్ కు సరిపడలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే కెరీర్ తొందరగా ముగిసిందని చెప్పేవారు.

కొసమెరుపు: దక్షిణాఫ్రికాలో పుట్టిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ లో స్థిరపడి ఆ దేశానికి ఆడాడు. ఇప్పుడు భారత్ కు కోచ్ గా రానున్నాడు.