సవక.. సవక.. రూ.కోటిన్నరకే ఐపీఎల్ కెప్టెన్.. అదీ చాంపియన్ జట్టుకు
సహజంగా తమ జట్టును చాంపియన్ గా నిలిపిన కెప్టెన్ ను ఏ జట్టూ ఆ వెంటనే వదులుకోదు.
By: Tupaki Desk | 18 March 2025 11:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ముంబై ఇండియన్స్ (ఎంఐ). వీటి తర్వాతి స్థానం ఎవరిది? అంటే ముందుగా చెప్పాల్సిన పేరు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2012, 2014లో టైటిల్ కొట్టిన కోల్ కతా.. మళ్లీ 2024లోనూ చాంపియన్ అయింది.
శ్రేయస్ ను వదులుకుని..
సహజంగా తమ జట్టును చాంపియన్ గా నిలిపిన కెప్టెన్ ను ఏ జట్టూ ఆ వెంటనే వదులుకోదు. కానీ, కోల్ కతా మాత్రం గత ఏడాది జట్టును నడిపించిన శ్రేయస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో కొనుక్కోలేదు. దీంతో అతడిని రూ.26.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
మరొక్క నాలుగు రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానుండగా తాజాగా కెప్టెన్ల ధర విషయమై చర్చ జరుగుతోంది.
గత ఏడాది నవంబరులో జరిగిన మెగా వేలంలో టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల అత్యధిక ధరకు వేలంలో పాడుకుంది. ఆ తర్వాత శ్రేయస్ ఉండగా.. తదుపరి చెన్నై సారథి రుతురాజ్, రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమ్మిన్స్ (రూ.18 కోట్లు) ఉన్నారు.
ఢిల్లీ కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్, గుజరాత్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ (రూ.16.50 కోట్లు), ముంబై సారథి హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్ (రూ.11 కోట్లు) మంచి ధరలోనే ఉన్నారు.
అనేక విశేషాల ఐపీఎల్ 18లో కోల్ కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతోంది. ఈ జట్టుకు కెప్టెన్ గా టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్ మన్ అజింక్య రహానేను ప్రకటించారు. అయితే, అతడి రేటు రూ.కోటిన్నర మాత్రమే. కేకేఆర్ వదిలేసిన అయ్యర్ రెండో అత్యధిక ధర రూ.26.75 కోట్లు పొందగా.. కేకేఆర్ కేవలం రూ.కోటిన్నరకే కెప్టెన్ ను తెచ్చుకుందన్నమాట.
కొసమెరుపు: ఇండియన్ టీమ్ లోకి టి20 బ్యాటర్ గా అరంగేట్రం చేసిన రహానే ఆ తర్వాత వన్డేల్లో అదరగొట్టాడు. టెస్టుల్లో వైస్ కెప్టెన్ అయ్యాడు. టి20లకు తగినట్లుగా ఆడడం లేదని తప్పించగా.. వన్డేల్లో ఎప్పుడో మర్చిపోయారు. టెస్టులకూ ఎంపిక చేయడం లేదు.