Begin typing your search above and press return to search.

కోల్ కతా ఫ్లయింగ్ కిస్ లలో ఇంత కథ ఉందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసి మూడు రోజులైనా తాజా సీజన్ తాలూకు వైబ్రేషన్స్ ఇంకా కొనసాగుతోంది

By:  Tupaki Desk   |   29 May 2024 1:30 PM GMT
కోల్ కతా ఫ్లయింగ్ కిస్ లలో ఇంత కథ ఉందా?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసి మూడు రోజులైనా తాజా సీజన్ తాలూకు వైబ్రేషన్స్ ఇంకా కొనసాగుతోంది. అందులోనూ తెలుగు వారంతా తమ జట్టుగా భావించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో పరాజయం పాలవడంతో ఇంకా ఆ బాధ తొలుస్తూనే ఉంది. ఇక విజేతగా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ది సహజంగానే భిన్నమైన పరిస్థితి. ఆ జట్టు టోర్నీ అంతటా నిలకడగా ఆడుతూ వచ్చింది. ఓ దశలో రాజస్థాన్ రాయల్స్ కూడా కోల్ కతాకు దీటుగా ఆడినా.. తర్వాత వరుసగా పరాజయాలు చవిచూసింది. కేకేఆర్ మాత్రం ఫైనల్లోనూ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టైటిల్ కొట్టేసింది.

గంభీర్ రాకవతో ముచ్చటగా మూడో టైటిల్

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తిరిగి రావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ కథే మారిపోయింది. జట్టులో ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలో స్పష్టమైన అవగాహన ఉన్న గంభీర్ కోల్ కతాను అందుకు తగినట్లుగా తీర్చిదిద్దాడు. తాను గతంలో జట్టుతో ఉన్న సమయంలో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపిన గంభీర్ ఇప్పుడూ ఆ ప్రయోగాన్నే నమ్ముకున్నాడు. నరైన్ ఓపెనర్ గా ఎంతటి విధ్వంసం రేపాడో అందరూ చూశారు. ఓ విధంగా కోల్ కతాకు మేటి ఓపెనర్ లభించడమే కాక.. ఓ బ్యాటర్ ను అదనంగా తీసుకునే చాన్స్ దొరికింది. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నరైన్ నిలిచాడంటే దాని ఘనతంతా గంభీర్ దే.

పదేళ్ల తర్వాత విజేత..

చెన్నైలో జరిగిన ఫైనల్ అనంతరం కేకేఆర్ యజమాని షారూక్ ఖాన్ సహా యావత్ టీమ్ సభ్యులు చేసిన హంగామా అంతాఇంతా కాదు. పదేళ్ల తర్వాత విజేతగా నిలవడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతోనే చెన్నై చెపాక్ మైదానంలో షారూఖ్ సహా కోల్ కతా టీమ్ సభ్యులంతా ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ సెలబ్రేషన్ చేసుకున్నారు.

ముందుగానే ప్లాన్ చేసుకుని

కోల్ కతా సంబరాలను ముందుగానే ప్లాన్ చేసినట్లు ఆ జట్టు పేసర్ హర్షిత్ రాణా చెప్పాడు. ఈ సీజన్ లో రాణాపై ఒక మ్యాచ్ వేటు పడింది. బ్యాటర్ ఔట్ అనంతరం పెవిలియన్ కు దారి చూపడమే దీనికి కారణం. ఇప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బ్యాన్ అనంతరం తాను బాధపడినట్లు చెప్పాడు. ఆ సమయంలో షారూక్ ఖాన్ వచ్చి ధైర్యం చెప్పాడని రాణా పేర్కొన్నాడు. ‘‘నీ బాధ నాకు తెలుసు. టైటిల్ కొట్టి ఫ్లయింగ్ కిస్ తో సెలబ్రేట్ చేసుకుందాం’’ అని చెప్పాడు. అన్నట్లుగానే.. అలానే చేశామని పేర్కొన్నాడు.