Begin typing your search above and press return to search.

విశాఖలో పరుగుల వరద... కేకేఆర్ హ్యాట్రిక్ విక్టరీ... టాప్‌ 5 స్కోర్లు ఇవే

ఐపీఎల్ 2024 సీజన్‌ లో భాగంగా ఢిల్లీ – కోల్ కతా మధ్య అద్భుతమైన మ్యాచ్ నడిచింది.

By:  Tupaki Desk   |   4 April 2024 3:57 AM GMT
విశాఖలో పరుగుల వరద...  కేకేఆర్  హ్యాట్రిక్  విక్టరీ... టాప్‌ 5 స్కోర్లు ఇవే
X

ఐపీఎల్ 2024 సీజన్‌ లో భాగంగా ఢిల్లీ – కోల్ కతా మధ్య అద్భుతమైన మ్యాచ్ నడిచింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన కోల్‌ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. అక్కడ నుంచి ఆద్యాంతం ఈ మ్యాచ్ ఏ విధంగా సాగిందనేది ఇప్పుడు చూద్దాం..!

ప్రారంభమైన కోల్ కతా ఇన్నింగ్స్:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా జట్టు నుంచి ఫిలిప్‌ సాల్ట్, సునీల్ నరైన్ లు క్రీజ్ లోకి ఎంటరయ్యారు. ఈ క్రమంలో ఖలీల్ అహ్మద్‌ వేసిన తొలి ఓవర్‌ లో ఏడు పరుగులు వచ్చాయి. ఇవన్నీ ఎక్స్‌ ట్రాల రూపంలో వచ్చినవే కావడం గమనార్హం.

అనంతరం... ఇషాంత్ శర్మ వేసిన రెండో ఓవర్‌ లో 10 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో చివరి రెండు బంతులకు ఫిలిప్‌ సాల్ట్ (8) రెండు ఫోర్లుగా మలిచాడు.

ఇదే క్రమంలో ఖలీల్ అహ్మద్‌ వేసిన మూడో ఓవర్‌ లో 15 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ లో ఫిలిప్ సాల్ట్ రెండు ఫోరులు, సునీల్ నరైన ఒక ఫోరు బాదారు. దీంతో మూడు ఓవరలకు కోల్ కతా స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 32 పరుగులకు చేరింది.

ఒకే ఓవర్ లో 3 సిక్స్ లు, 2 ఫోర్లు!:

కోల్ కతా ఓపెనర్లు దూకుడు పెంచారు. ఇందులో భాగంగా.. ఇషాంత్‌ శర్మ వేసిన నాలుగో ఓవర్‌ లో మొదటి మూడు బంతులకు వరుసగా 6, 6, 4 బాదిన సునీల్ నరైన... చివరి రెండు బంతులనూ వదల్లేదు. ఇందులో భాగంగా వాటిని 6, 4 గా మలిచాడు. దీంతో ఈ ఓవర్‌ లో 26 పరుగులు వచ్చాయి. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా వికెట్లేమీ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.

కోల్‌ కతా ఫస్ట్‌ వికెట్ డౌన్:

దూకుడుగా కొనసాగుతున్న కోల్ కతా బ్యాటింగ్ కు బ్రేక్ పడింది. ఇందులో భాగంగా... అన్రిచ్ వేసిన ఐదో ఓవర్లో మూడో బంతికి ఫిలిప్‌ సాల్ట్ 18 (12 బంతులలో) ట్రిస్టన్‌ స్టబ్స్‌ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది కోల్ కతా.

21 బంతుల్లోనే నరైన్ హాఫ్‌ సెంచరీ!:

క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచీ దూకుడుగా ఆడుతున్న సునీల్ నరైన్... ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇందులో భాగంగా.. 4 ఓవర్లో 26 పర్గులు రాబట్టిన నరైన్... ఆరో ఓవర్ లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. ఈ క్రమంలోనే 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది కోల్‌ కతా!

కోల్ కతా విధ్వంసం... 10 ఓవర్లకు 135!

విశాఖ వేదికగా కోల్ కతా బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు! ప్రధానంగా సునీల్ నరైన్.. ఢిల్లీ బౌలర్స్ ని ఊచకోత కోస్తున్నాడు. ఇందులో భాగంగా... 32 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌ ల సాయంతో 72 పరుగులు చేశాడు. మరోపక్క రఘువంశీ 16 బంతుల్లో 33 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా స్కోరు ఒక వికెట్ నష్టానికి 135 పరుగులకు చేరుకుంది.

భారీ భాగస్వామ్యానికి బ్రేక్... కోల్‌ కతా రెండో వికెట్ డౌన్!

ఎప్పుడో 4.3 ఓవర్లో 60 పరుగుల వద్ద ఢిల్లీకి ఒక వికెట్ దక్కగా... ఆ తర్వాత 12.3 ఓవర్లో 164 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. ఇందులో భాగంగా... 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌ లతో 85 పరుగులు చేసిన సునీల్ నరైన్.. మిచెల్ మార్ష్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో... 48 బంతుల్లో 104 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

మరోవైపు ఇదే ఓవర్ లో రఘువంశీ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 13 ఓవర్లకు కోల్ కతా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు.

కోల్ కతా మూడో వికెట్ డౌన్!:

అన్రిచ్ వేసిన 13.2 ఓవర్‌ లో 27 బంతుల్లో 54 పరుగుల వద్ద రఘువంశీ ఔటయ్యాడు. దీంతో 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కోల్ కతా స్కోరు 181 పరుగులకు చేరి.. భారీ టోటల్ దిశగా కదులుతుంది.

200 దాటిన కోల్‌ కతా స్కోరు!:

ఖలీల్‌ అహ్మద్‌ వేసిన 16 ఓవర్‌ లో 10 పరుగులు వచ్చాయి. అప్పటికే బాదుడు మొదలుపెట్టేసిన రస్సెల్ 12 బంతుల్లో 27 పరుగులు చేసేశాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది కోల్ కతా.

శ్రేయస్ అయ్యర్ ఔట్!:

ఖలీల్ అహ్మద్‌ వేసిన 17.1 ఓవర్‌ లో సిక్స్‌ బాదిన శ్రేయస్ అయ్యర్.. తర్వాతి బంతికి మిచెల్ మార్ష్‌ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో... 18 ఓవర్లకు స్కోరు 4 వికెట్ల నష్టానికి 239 పరుగులకు చేరింది.

రింకు సింగ్ ఔట్!:

8 బంతుల్లో ఒక ఫోరు, 3 సిక్స్ ల సాయంతో 26 పరుగులతో దడ దడ లాడించ్సిన రింకూ సింగ్... అన్రిచ్ వేసిన 19 ఓవర్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కోల్ కతా స్కోరు 19 ఓవర్లు పూర్తయ్యేసరికి 5 వికెట్ల నష్టానికి 264 పరుగులకు చేరింది.

వరుసగా రెండు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ!:

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో ఇషాంత్ శర్మ అద్భుతమైన యార్కర్ తో ఆండ్రూ రస్సెల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి రస్సెల్ వ్యక్తిగత స్కోరు 19 బతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 41 పరుగులు. దీంతో కోల్‌ కతా ఆరో వికెట్ కోల్పోయింది.

అనంతరం అదే ఓవర్ మూడో బంతికి రమణ్‌ దీప్‌ సింగ్ (2) ఔటయ్యాడు. దీంతో... కోల్ కతా ఏడో వికెట్ నూ కోల్పోయింది. దీంతో... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది కోల్ కతా! ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు.

ఛేజింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ!:

కోల్ కతా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ బరిలోకి దిగింది. ఇందులో భాగంగా... డెవిడ్ వార్నర్, పృథ్వి షా క్రీజ్ లోకి అడుగుపెట్టారు. మిచెల్ స్టార్క్‌ వేసిన తొలి ఓవర్లో 11 పరుగులు రాబట్టారు. దీంతో.. తొలి ఓవర్ పూర్తయ్యేసరికి వికెట్లెమీ నష్టపోకుండా ఢిల్లీ స్కోరు 11 పరుగులకు చేరింది.

ఫస్ట్ వికెట్ డౌన్!:

వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌ లో ఐదో బంతికి వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు పృథ్వీ షా. మరోవైపు ఇదే ఓవర్ లో వార్నర్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో.. రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది ఢిల్లీ.

రెండో వికెట్ డౌన్!:

మిచెల్ స్టార్క్‌ వేసిన 3 ఓవర్‌ లో ఐదో బంతికి రమణ్‌ దీప్‌ సింగ్‌ కు క్యాచ్‌ ఇవ్వడంతో మిచెల్ మార్ష్‌ (0) డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో మూడు ఓవర్ లు ముగిసే సరికి కోల్ కతా స్కోరు 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు.

మూడో వికెట్ డౌన్!:

వైభవ్‌ వేసిన 4వ ఓవర్‌ చివరి బంతికి పోరెల్‌ నరైన్‌ చేతికి చిక్కి అభిషేక్‌ పోరెల్‌ (0) డకౌట్ అయ్యాడు. పైగా ఈ ఓవర్ లో ఒకే పరుగు రావడంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా స్కోరు 3 వికెట్ల నష్టానికి 27 పరుగులుగా ఉంది.

గ్యాప్ ఇవ్వడం లేదు... నాలుగో వికెట్ డౌన్!:

భారీ లక్ష్య ఛేదనలో భాగంగా దూకుడుతో పాటు నిలకడగా ఆడాల్సిన ఢిల్లీ బ్యాటర్లు.. మైదానంలోకి చుట్టం చూపుగా వచ్చి పోతున్నారు. వరుసపెట్టి పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో... మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌ లో వార్నర్‌ (18) ఔటయ్యాడు. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 40 పరుగులుగా ఉంది.

10 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ పరిస్థితి ఇది!:

10 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది ఢిల్లీ. ఈ సమయంలో.. కెప్టెన్ రిషభ్‌ పంత్ (24), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (28) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు!

12 ఓవర్లో వరుసగా 4, 6, 6, 4, 4, 4!:

భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ బ్యాటర్స్ అంతా వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ కు క్యూ కడుతుంటే... ఈసారి వచ్చే వాడు బంతిని బౌండరీకి పంపేవాడు కావాలి కానీ.. తాను పెవిలియన్ కు చేరేవాడు కాకూడదన్నట్లుగా మైదానలోకి ఫిక్స్ అయ్యి వచ్చినట్లున్నాడు పంత్.

ఈ క్రమంలో వెంకటేశ్‌ అయ్యర్ వేసిన 12 ఓవర్‌ లో వరుసగా 4, 6, 6, 4, 4, 4 బాదేశాడు. ఫలితంగా... 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఫలితంగా 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది ఢిల్లీ.

పంత్ మెరుపు ఇన్నింగ్స్ కి తెర!:

దూకుడు మీద ఆడుతూ.. ఢిల్లీ ఫ్యాన్స్ లో ఎక్కడో చిన్న హోప్ క్రియేట్ చేసిన రిషబ్ పంత్... వరుణ్ చక్రవర్తి వేసిన 12.2 ఓవర్‌ లో ఔటయ్యాడు. అప్పటికి పంత్ వ్యక్తిగత స్కోరు 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ ల సాయంతో 55 పరుగులుగా ఉంది.

ఇదే ఓవర్ లో 3వ బంతికి అక్షర్ పటేల్ (0) గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. దీంతో 13 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది ఢిల్లీ.

ట్రిస్టన్‌ స్టబ్స్‌ హాఫ్‌ సెంచరీ!:

ఢిల్లీ ఇన్నింగ్స్ లో పంత్ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏమైనా ఉందంటే... అది ట్రిస్టన్ స్టబ్స్ ది అనే చెప్పుకోవాలి. వరుణ్‌ చక్రవర్తి వేసిన 15 ఓవర్‌ లో ఐదో బంతికి ట్రిస్టన్‌ స్టబ్స్‌ 32 బంతుల్లో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో... 15 ఓవర్లు పూరయ్యే సరికి ఢిల్లీ స్కోరు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులుగా ఉంది.

ఘోర ఓటమికి చేరువైన ఢిల్లీ!:

సునీల్ నరైన్‌ వేసిన 15.1 ఓవర్‌ లో సుమిత్ కుమార్ (7) ఔటవ్వడంతో ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అనంతరం వైభవ్‌ వేసిన 16.1 ఓవర్‌ లో సలామ్ (1) ఔటయ్యాడు. దీంతో 17 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోరు 9 వికెట్ల నష్టానికి 166 పరుగులకు చేరింది.

ఢిల్లీ ఆలౌట్.. కోల్ కతా హ్యాట్రిక్!:

విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ లో కోల్‌ కతా 106 పరుగుల భారీ తేడాతో మరపురాని విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీని 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ చేసింది.

ఢిల్లీ బ్యాటర్స్ లో రిషభ్‌ పంత్‌ (55), ట్రిస్టన్‌ స్టబ్స్ (54) మినహా మిగిలిన బ్యాటర్స్ అంతా విఫలమయ్యారు.

ఇక కోల్ కతా బౌలర్స్ లో వైభవ్ అరోరా, వరున్ చక్రవర్తి తలో మూడు వికెట్లూ తీసుకోగా.. మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసుకున్నారు.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక టాప్‌ 5 స్కోర్లు!

హైదరాబాద్‌ - 277/3 వర్సెస్ ముంబై

కోల్‌ కతా - 272/7 వర్సెస్ ఢిల్లీ

బెంగళూరు - 263/5 వర్సెస్ పూణె

లక్నో - 257/5 వర్సెస్ పంజాబ్‌

బెంగళూరు - 248/3 వర్సెస్ గుజరాత్‌ లయన్స్‌