సన్ రైజర్స్ బ్యాటర్స్ పై నైట్ రైడర్స్ బౌలర్స్ విజయం!
అంతేనా... 15, 16 బంతుల్లో హాఫ్ సెంచరీలు.. 39 బంతుల్లోనే సెంచరీ.. ఇది ఈ సీజన్ లో హైదరాబాద్ బ్యాటర్స్ సృష్టించిన బీభత్సాలు.
By: Tupaki Desk | 27 May 2024 4:50 AM GMTఐపీఎల్ సీజన్ 17లో అత్యధికంగా ఆకట్టుకున్నవారిలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ఒకరనే సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో వారు కొట్టిన ఫోర్లు, బాదిన సిక్స్ లు, చేసిన సెంచరీలు, ఎత్తిన బ్యాట్ లూ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఒక మ్యాచ్ లో 277.. ఇంకో మ్యాచ్ లో 287.. మరో మ్యాచ్ లో 6 ఓవర్లు ముగిసేసరికే స్కోరు 125 పరుగులు చేసిన చరిత్ర హైదరాబాద్ సొంతం.
అంతేనా... 15, 16 బంతుల్లో హాఫ్ సెంచరీలు.. 39 బంతుల్లోనే సెంచరీ.. ఇది ఈ సీజన్ లో హైదరాబాద్ బ్యాటర్స్ సృష్టించిన బీభత్సాలు. అయితే... అవన్నీ చేసి తుదిపోరుకు ఎంట్రీ సాధించిన ఆ జట్టు.. ఫైనల్ లో మాత్రం చేతులెత్తేసింది. ప్రధానంగా సన్ రైజర్స్ బలం అంతా బ్యాటర్సే అని అనుకుంటున్న దశలో బ్యాట్ లు ఎత్తాల్సిన హైదరాబాద్ బ్యాటర్స్ చేతులు ఎత్తేశారు! కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
అవును... ఈ ఐపీఎల్ లో సంచలన ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకొచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. చివరి పోరులో తేలిపోయింది. అర్ధసెంచరీలు, సెంచరీలు చేసి బ్యాట్ లు ఎత్తుతారనుకున్న బ్యాటర్లు.. కోల్ కతా బౌలర్ ల దాటికి చేతులెత్తేశారు. ఫలితంగా... ఆదివారం చెపాక్ లో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.
మిచెల్ స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24), ఆండ్రి రసెల్ (3/19)ల అద్భుత బౌలింగ్ కు తలవంచిన సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయిపోవడం గమనార్హం. రికార్డ్ స్థాయి పరుగులు చేసిన బ్యాటర్సేనా వీళ్లు అని సగటు ప్రేక్షకుడు టీవీల ముందు ఆశ్చర్యపోయిన పరిస్థితి.
టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో లీగ్ దశలో మాదిరే ఓపెనర్లు హెడ్, అభిషేక్ చెలరేగిపోతారని చాలా మంది భావించారు. అయితే రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి ఇద్దరూ పెవిలియన్ కు చేరుకున్నారు. అభిషేక్ (2), హెడ్ (0), త్రిపాఠి (9), షాబాజ్ (8), సమద్ (4), ఉనద్కత్ (4), భువనేశ్వర్ (0*) సింగిల్ డిజిట్స్ కి పరిమితమైపోయారు.
మార్క్రమ్ (20), నితీశ్ (13), క్లాసెన్ (16), కమిన్స్ (24) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. సన్ రైజర్స్ బ్యాటర్స్ కి బ్యాట్ ఝులిపించే అవకాశం కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు ఏ దశలోనూ ఇవ్వలేదు. కోలుకునే అవకాశం లేకుండా.. వరుసగా దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఫలితంగా... 18.3 ఓవర్లలోనే చాప చుట్టేసిన పరిస్థితి!
అనంతరం ఛేజింగ్ కి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్: 26 బంతుల్లో 4×4, 3×6), రహ్మనుల్లా గుర్బాజ్ (39: 32 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా పని పూర్తి చేశారు. దీంతో 2012, 2014 తర్వాత.. తాజాగా మూడోసారి కప్పు అందుకుంది కోల్ కతా నైట్ రైడర్స్.
ఇదే సమయంలో రెండోసారి ఫైనల్ లో తడబడిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. గతంలో 2018లోనూ సన్ రైజర్స్ ఫైనల్ లో ఓడిపోయింది. ఇదే క్రమంలో... ఐపీఎల్ లో కనీసం మూడు టైటిళ్లు గెలిచిన జట్లలో కోల్ కతా స్థానం సంపాదించుకుంది. ఇప్పటి వరకూ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు అయిదేసి టైటిళ్లు సాధించాయి.
ఇక ఈ సీజన్ లో 741 పరుగులు చేసిన కొహ్లీ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకోగా.. 24 వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ హర్షల్ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నారు. ఇక 488 పరుగులు చేసి 17 వికెట్లు కూడా తీసిన సునీల్ నరైన్ అత్యంత విలువైన ఆటగాడు కాగా... సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి 303 పరుగులతో ఉత్తమ వర్దమాన నటుడిగా నిలిచారు.
ఇక ప్రైజ్ మనీ విషయానికొస్తే... విజేత కోల్ కతాకు రూ.20 కోట్లు రాగా.. రన్నరప్ హైదరాబాద్ కు రూ. 12.5 కోట్లు వచ్చింది!