నిన్న టీటీలో 24 ఏళ్ల అర్చన నేడు క్రికెట్ లో కేఎల్ రాహుల్ రిటైర్?
నిన్ననే 24 ఏళ్ల వయసులోనే రిటైరై సంచలనం రేపింది టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఒలింపియన్ అర్చనా కామత్
By: Tupaki Desk | 23 Aug 2024 9:28 AM GMTనిన్ననే 24 ఏళ్ల వయసులోనే రిటైరై సంచలనం రేపింది టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఒలింపియన్ అర్చనా కామత్. దీంతోనే అందరూ నోరెళ్లబెట్టారు. ఇంతలో టీమిండియా వికెట్ కీపర బ్యాటర్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ పై కలకలం రేగుతోంది. ఇటీవలే జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన రాహుల్.. శ్రీలంకతో వన్డే సిరీస్ లో పాల్గొన్నాడు. వికెట్ కీపింగ్ కూడా చేశాడు. కానీ, 2 మ్యాచ్ లలోనూ విఫలం కావడంతో మూడో మ్యాచ్ కు పక్కనపెట్టారు. మరోవైపు రాహుల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ జట్టు యాజమాన్యంతో ఈ సీజన్ లో మ్యాచ్ ల సందర్భంగా విభేదాలు తలెత్తాయి. దీంతోనే రాహుల్ వచ్చే సీజన్ కు మెగా వేలంలోకి వెళ్తాడని, ఆపై సొంతగడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని ఎంచుకుంటాడనే కథనాలు వస్తున్నాయి. ఇంతలోనే అతడి క్రికెట్ భవితవ్యంపై కలకలం రేగింది.
ఒక్క పోస్ట్ తో..
రాహుల్ పేరిట తాజాగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘త్వరలో ఓ ప్రకటన చేయబోతున్నా’ అని అందులో అతడు పేర్కొన్నాడు. దీంతోపాటు రెండేళ్లుగా రాహుల్ ఫామ్ ఒడిదొడుకులు, గాయాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వికెట్ కీపర్ గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. బ్యాటింగ్ లో తేలిపోతున్నాడు. దీంతోనే అతడు గుడ్ బై చెబుతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు రాహుల్ గురించి క్రికెటర్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇమేజ్ ను షేర్ చేస్తూ.. ఓ యూజర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అందులో.. పలువురి అభిప్రాయాల స్వీకరణ అనంతరం నిర్ణయం ప్రకటిస్తున్నానని.. క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని.. ఇది సులువైన నిర్ణయం కాదని.. తన జీవితంలో కొన్నేళ్లుగా క్రికెట్ భాగమైందని.. మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, అభిమానులకు ధన్యవాదాలని.. దేశానికి ఆడడం గర్వకారణం అని ఉంది. కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
ఫేకా.. రియలా?
రాహుల్ పోస్ట్ ఫేక్ అని కొందరు కొట్టిపడేస్తుండగా, త్వరలో అతడు చేయబోయే ప్రకటన తండ్రిగా కొత్త ప్రయాణం గురించేనని మరికొందరు పేర్కొన్నారు. కాగా, దీనిపై ఫ్యాక్ట్ చెక్ ను ఆశ్రయించారు మరికొందరు. దీంతో రాహుల్ భవితవ్యంపై వచ్చిన ఊహాగానాలు ఫేక్ అని తేల్చారు. కాగా, కేఎల్ రాహుల్, కుటుంబసభ్యులు, బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. రాహుల్.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు ప్రేమించుకున్న వీరిద్దరూ గత ఏడాది ఒక్కటయ్యారు. మరోవైపు రాహుల్.. అంత తొందరగా కెరీర్ పై నిర్ణయం తీసుకోడు. ఎందుకంటే.. భవిష్యత్ లో వన్డే, టెస్టు కెప్టెన్సీలు అతడికి దక్కొచ్చు. బ్యాట్స్ మన్ గా మంచి ప్రతిభావంతుడే. అయితే, మ్యాచ్ విన్నర్ కాకపోవడం పెద్ద లోటు. తరచూ గాయాలు, అంచనాలను నిలబెట్టుకోలేకపోవడం కూడా ప్రభావం చూపుతున్నాయి. కొంచెం నిలకడ సాధిస్తే కెప్టెన్సీ రేసులోకి రావడం ఖాయం. అంతేగాక.. భారత కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లక్నో జెయింట్స్ కు పనిచేసినప్పుడు రాహుల్ తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అందుకనే రాహుల్ ఇప్పుడప్పుడే వైదొలగడు.