హద్దు దాటిన అభిమానమా? డబ్బులిచ్చి కాళ్లమీద పడేశారా.. పరాగ్ పై ట్రోల్
ఇదే ప్రారంభ మ్యాచ్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది! కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేయగానే, ఓ అభిమాని పిచ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
By: Tupaki Desk | 27 March 2025 12:17 PMగత శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి మ్యాచ్.. వేదిక కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్.. తలపడుతున్న జట్లు.. డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
ఇదే ప్రారంభ మ్యాచ్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది! కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేయగానే, ఓ అభిమాని పిచ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కోహ్లి కాళ్లను తాకాడు. అయితే, కోహ్లికి ఇలాంటివి కొత్త కాదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఇటీవల ఓ అభిమాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇది కోహ్లి పట్ల ఉన్న అభిమానం. తాజాగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో అది మరోసారి స్పష్టమైంది. దీంతో సెక్యూరిటీ గార్డులు వెంటనే స్పందించి, ఆ అభిమానిని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఇక కోహ్లి మాత్రం నవ్వుతూ, అభిమానిని శాంతింపజేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బుధవారం అసోంలోని గువాహటిలో రాజస్థాన్ రాయల్స్-కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లోనూ అభిమాని దూసుకొచ్చాడు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు.
వాస్తవానికి పరాగ్ పెద్ద స్టార్ కాదు. టీమ్ ఇండియాకు పదిమ్యాచ్ లు కూడా ఆడలేదు. అయితే, అతడు అసోంకు చెందినవాడు. ఆ రాష్ట్రం నుంచి తొలిసారి టీమ్ ఇండియాకు ఆడి చరిత్రలోకెక్కాడు. అందుకే అతడికి అసోంలో ఫాలోయింగ్ ఎక్కువ. ఇండియా అంతటికి కోహ్లి ఎలాగో అసోంకు పరాగ్ అలాగన్నమాట.
అయితే, అభిమానులు మైదానంలోకి దూసుకురావడం అనేది మాత్రం సమస్యగా భావించక తప్పడం లేదు. ఎంత పటిష్ట భద్రత, నిబంధనలు అమలు చేస్తున్నా దీనిని నివారించలేకపోతున్నారు. పిచ్ వరకు రావడం, ఆటగాళ్లను తాకడం కాస్త అసౌకర్యంగానే ఉంది.
ఇక పరాగ్ ను మాత్రం సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేశారు. అతడు డబ్బులిచ్చి అభిమాని తన కాళ్లమీద పడేలా చేశాడని రాసుకొచ్చారు. కానీ, పరాగ్ ఫాలోయింగ్ ను బట్టి చూస్తే ఇది అవాస్తవం అని తెలుస్తోంది. పైగా ఐపీఎల్ లో ఎలాంటి పీఆర్ ఉండదని తెలుసుకోవాల్సి కూడా ఉంది.