Begin typing your search above and press return to search.

కొహ్లీని "గోట్" అంటున్నారు... 90ల్లో ఎన్ని సార్లు అవుట్ అయ్యాడంటే..?

తాజాగా న్యుజిలాండ్ పై కొహ్లీ ఆడిన 95 పరుగుల ఇన్నింగ్స్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

By:  Tupaki Desk   |   23 Oct 2023 9:34 AM GMT
కొహ్లీని గోట్ అంటున్నారు... 90ల్లో ఎన్ని సార్లు అవుట్ అయ్యాడంటే..?
X

న్యూజిలాండ్‌ తో మ్యాచ్‌ లో స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్‌ కు చేరినప్పటికీ... సమయోచిత ఇన్నింగ్స్‌ తో విరాట్ కోహ్లీ టీం ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. సెంచరీకి చేరువగా వచ్చి 95 పరుగుల వద్ద భారీషాట్ కు ప్రయత్నించిన ఔటైనా... కివీస్ పై కొహ్లీ ఆడిన ఆ అద్భుత ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఇన్నింగ్స్ వల్ల సుమారు 20 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్‌ ను భారత్ మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

తాజాగా న్యుజిలాండ్ పై కొహ్లీ ఆడిన 95 పరుగుల ఇన్నింగ్స్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా... టీం ఇండియా మాజీ ఆల్‌ రౌండర్ యువరాజ్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. సెంచరీ చేయకపోయినా అంతకంటే విలువైన ఇన్నింగ్స్‌ గా దీనిని అభివర్ణించాడు. ఇందులో భాగంగా... విరాట్ కొహ్లీని "గోట్" గా అభివర్ణించాడు యూవీ! ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేశాడు సిక్స్ ల సామ్రాట్!

"విరాట్ కోహ్లీ నుంచి మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం అద్భుతం. చివరి వరకూ గేం ను తీసుకెళ్లిన తీరు సూపర్బ్. అందుకే నువ్వు జీ.ఓ.ఏ.టీ. (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం). రవీంద్ర జడేజా మంచి భాగస్వామ్యం అందించాడు. చివరి వరకు క్రీజ్‌ లో ఉండి జట్టును గెలిపించాడు. షమీ సూపర్ స్పెల్‌ తో అదరగొట్టావు" అని యువీ ట్వీట్ చేశాడు.

ఈ స్థాయిలో చారిత్రక విక్టరీలో కీలక పాత్ర పోషించిన కొహ్లీపై ప్రశంసల జల్లులు కురుస్తున్నా.. ఈ విజయాన్ని టీం ఇండియా క్రికెట్ అభిమానులంతా సెలబ్రేట్ చేసుకుంటున్నా.. ఈ మ్యాచ్‌ లో నిరాశ కలిగించిన అంశం ఏదైనా ఉందంటే అది కోహ్లీ 5 పరుగుల దూరంలో సెంచరీ కోల్పోవడమనే చెప్పాలి. అది కూడా సెంచరీగా మారితే సచిన్ సరసన కొహ్లీ చేరేవాడు!

అవును... ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో కోహ్లీ సెంచరీ చేసి ఉంటే సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసేవాడు. అయితే అనూహ్యంగా కోహ్లీ 95 పరుగుల వద్ద అవుటయ్యాడు. అయితే ఇలా 90ల్లో అవుటవ్వడం కొహ్లీకి ఇదే తొలిసారి కాదు. ఇప్పటివరకూ అంతర్జాతీయ మ్యాచ్ లలో కోహ్లీ 90ల్లో అవుటయ్యాడు. అలా అవుటైన ఇన్నింగ్స్ లు అన్ని ఫార్మేట్లలోనూ కలిపి ఇప్పటికి ఎనిమిది.

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ లో అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఇప్పటివరకూ 8 సార్లు 90ల్లో అవుటయ్యాడు. అందులో 6 సార్లు వన్డేల్లో, 2 సార్లు టెస్ట్‌ ల్లో 90 - 100 పరుగుల మధ్యలో ఉండగా పెవిలియన్ కు చేరాడు. ఏది ఏమైనా... ఇప్పటివరకూ సుమారు 512 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన కొహ్లీ... మొత్తం 78 శతకాలు బాదాడు.