కోహ్లి రెండో ఇల్లు లండన్.. భారత్ కంటే అక్కడే ఎక్కువగా.. దీని మర్మమేమిటో?
2020-21 ఆస్ట్రేలియా పర్యటనలోనూ కోహ్లి తన భార్యకు తొలి కాన్పు సందర్భంగా టెస్టులకు దూరంగా ఉన్నాడు.
By: Tupaki Desk | 9 Aug 2024 2:30 PM GMTటీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి ఇటీవలి కాలంలో ఎక్కువగా భారత్ లో కంటే బ్రిటన్ లోనే ఉంటున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం అతడు కొలంబో నుంచి నేరుగా లండన్ ఫ్లైట్ ఎక్కాడు. వాస్తవానికి ఈ సిరీస్ నుంచి కోహ్లి రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ.. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబట్టడంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో పాల్గొన్నాడు. కానీ, దారుణంగా విఫలమయ్యాడు. స్పిన్ ఆడలేకపోయాడు. అయితే, ఇది వైఫల్యం కాదని భావించాలి. కాగా, ఈ ఏడాది జనవరిలో భారత్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ నుంచి కోహ్లి అనూహ్యంగా తప్పుకొన్నాడు. టెస్టు ఫార్మాట్ ను చాలా ఇష్టపడే కోహ్లి ఈ నిర్ణయం తీసుకోవడం అనేక సందేహాలకు తావిచ్చింది. అయితే, కోహ్లి-అనూష్క శర్మ దంపతులకు కుమారుడు జన్మిస్తున్న నేపథ్యంలోనే కోహ్లి టెస్టులను దూరంగా ఉన్నట్లు తర్వాత తేలింది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలోనూ కోహ్లి తన భార్యకు తొలి కాన్పు సందర్భంగా టెస్టులకు దూరంగా ఉన్నాడు.
లండన్ లోనే కుటుంబం..
ఇటీవల కోహ్లి భారత్ లో కంటే యూకేలో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనుష్క రెండో కాన్పు కూడా విదేశాల్లోనే జరిగినట్లు.. ఆ సమయంలో స్వదేశంలో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు దూరంగా ఉన్న కోహ్లి ఇంగ్లండ్ లో ఉన్నట్లు స్పష్టమైంది. మళ్లీ ఇప్పుడు కూడా అతడు శ్రీలంక నుంచి నేరుగా లండన్ వెళ్లిపోయాడు. అసలు కోహ్లి కుటుంబం (అనుష్క, కుమార్తె వామికా, కుమారుడు అకాయ్) లండన్ లోనే ఉంటున్నట్లుగా సమాచారం. గతంలో విహార యాత్రలకు తరచూ లండన్ వెళ్లే వీరు ఇప్పుడు లండన్ లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారా? అని అనిపిస్తోంది. గత నెలలో టి20 ప్రపంచ కప్ తర్వాత కప్ తో వచ్చిన టీమ్ ఇండియా.. ముంబై వాంఖడేలో విజయోత్సవ పరేడ్ లో పాల్గొంది. అనంతరం కోహ్లి లండన్ వెళ్లిపోయాడు. కుమారుడిని ఎత్తుకుని అతడు లండన్ వీధుల్లో విహరిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. అంతెందుకు? గత ఏడాది భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ అనంతరం కూడా కోహ్లి లండన్ చెక్కేశాడు.
మ్యాచ్ లు ఉంటేనే భారత్ లో..
కోహ్లి టి20 ప్రపంచ కప్ తర్వాత టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత లండన్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. కానీ, లంకతో వన్డే సిరీస్ లో పాల్గొనాల్సి వచ్చింది. మరోవైపు సిరీస్ లు లేకుంటే కోహ్లి లండన్ లోనే ఉంటున్నట్లు తెలిసింది. కేవలం మ్యాచ్ లు ఉన్నప్పుడు మాత్రమే అతడు భారత్ కో, ఆయా దేశాల టూర్లకో వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 36 ఏళ్లకు దగ్గరవుతున్న విరాట్ క్రికెట్ నుంచి రిటైరైతే లండన్ లో స్థిర నివాసం ఏర్పరచుకోనున్నట్లు తెలుస్తోంది. తనకు యూరప్ అంటే ఇష్టమని గతంలో అతడు చెప్పాడు. సాధారణ జీవితం గడపొచ్చనే ఉద్దేశంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, భారత్ ను అత్యంత అధికంగా ప్రేమించే కోహ్లి దేశానికి దూరమవుతాడని భావించలేం. పూర్తిగా కాకున్నా.. లండన్ లో మాత్రం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది.