Begin typing your search above and press return to search.

నిరుడు రూ.25 కోట్లు.. నో రిటెన్షన్.. కెప్టెన్ కూ బైబై.. కోల్ ‘కథ’

నిరుడు మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కు రూ.25 కోట్ల వరకు పెట్టింది కోల్ కతా.

By:  Tupaki Desk   |   1 Nov 2024 3:30 PM GMT
నిరుడు రూ.25 కోట్లు.. నో రిటెన్షన్.. కెప్టెన్ కూ బైబై.. కోల్ ‘కథ’
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల)లో ఐదేసి టైటిళ్లు కొట్టిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత విజయవంతమైన జట్టు ఏదంటే కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్). నిరుడు నిలకడగా ఆడుతూ టైటిల్ సాధించింది ఈ జట్టు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, డాషింగ్ బ్యాట్స్ మన్ రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, వెస్టిండీస్ ఆల్ రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేస్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా తదితరులతో కూడిన కోల్ కతా ప్రత్యర్థులను ఆటాడుకుంది. మరీ ముఖ్యంగా 2012, 2014లో కెప్టెన్ గా టైటిల్స్ అందించిన టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈసారి మెంటార్ గా వచ్చి కోల్ కతాను విజయ పథంలో నడిపాడు.

మినీ వేలంలో..

నిరుడు మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కు రూ.25 కోట్ల వరకు పెట్టింది కోల్ కతా. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం గమనార్హం. అసలు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ఆడుతున్న స్టార్క్ కు ఇంత రేటా? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, పరుగులు భారీగా ఇవ్వడంపై స్టార్క్ ప్రదర్శన గురించి తొలుత విమర్శలు వచ్చాయి. చివరలో మాత్రం తనదైన స్థాయిలో రాణించాడు.

ఈసారి ఏమైంది?

స్టార్క్ మేటి పేసర్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఆస్ట్రేలియా టాప్ బౌలర్ అతడే. కానీ, ఈసారి వేలంలో మాత్రం మిచెల్ స్టార్క్ ను కోల్ కతా రిటైన్ చేసుకోలేదు. దీనికి కారణం ఏమిటో తెలియదు. అతడు దేశానికే ఆడాలని నిర్ణయించుకున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు స్టార్క్ ను వేలానికి వదిలేసినా.. అతడు ఎంత ధర పలుకుతాడనేది చూడాలి.

రేటు ఎక్కువని కెప్టెన్ కూ చెక్

కోల్ కతా డిఫెండింగ్ చాంపియన్ గా.. కొత్త కెప్టెన్ తో వచ్చే సీజన్ ఆడనుండడం విశేషం. బహుశా గతంలో ఏ జట్టూ ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సీజన్ కు వెళ్లి ఉండదు. ఈసారి కోల్ కతా తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోలేదు. శ్రేయస్ అయ్యర్ తనకు అధిక ధర కావాలని అడగడమే దీనికి కారణమని చెబుతున్నారు. మరి వేలంలో అయినా అయ్యర్ ను తీసుకుంటుందా? అనేది చూడాలి. అయ్యర్ గతంలో ఢిల్లీకి కెప్టెన్ చేశాడు. మొత్తానికి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు చెందిన కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ రిటెన్షన్ లో వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.