Begin typing your search above and press return to search.

సరుకు లేకున్నా అవకాశాలు..టీమిండియా క్రికెటర్ పై మాజీ స్టార్ ధ్వజం

ఆస్ట్రేలియాలో పర్యటనలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని భారత్ 1-3తో కోల్పోవడంతో టీమ్ ఇండియాపై వరుసగా విమర్శలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 Jan 2025 4:30 PM GMT
సరుకు లేకున్నా అవకాశాలు..టీమిండియా క్రికెటర్ పై మాజీ స్టార్ ధ్వజం
X

ఆస్ట్రేలియాలో పర్యటనలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని భారత్ 1-3తో కోల్పోవడంతో టీమ్ ఇండియాపై వరుసగా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలు ఇంకా అవసరమా? వారు రంజీ ట్రోఫీలు ఆడడంలో తప్పేముంది? బుమ్రా తప్ప మరో మంచి బౌలర్ దొరకడా..? జట్టు ఎంపికలో పొరపాట్లు ఎందుకు? అంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఓ యువ ఆటగాడి సత్తాపై మాజీ క్రికెటర్ నిప్పులు చెరిగాడు. అతడిని అనవసరంగా పైకెత్తుతున్నారంటూ మండిపడ్డారు.

ఐదు ఇన్నింగ్స్ లో 93 పరుగులు.. ఇవీ యువ బ్యాట్స్ మన్ శుబ్ మన్ గిల్ ఆస్ట్రేలియా పర్యటన గణాంకాలు. ఓ విధంగా చెప్పాలంటే గిల్ నిరాశపరిచాడు. అతడి కంటే జూనియర్లు అయిన యశస్వి జైస్వాల్‌ (10 ఇన్నింగ్స్‌ 391), తెలుగు ఆల్ రౌండర్ నితీశ్‌కుమార్‌ రెడ్డి (9 ఇన్నింగ్స్‌ 298) మెరుగ్గా రాణించారు. గిల్ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే, గిల్ ను 2, 3, 5వ టెస్టులోనే ఆడించారు.

కాగా, ఆస్ట్రేలియాలో గిల్ వైఫల్యంపై మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ మండిపడ్డాడు. అతడు ఓవర్‌ రేటెడ్‌ ప్లేయర్‌ అంటూ నిందించాడు. ఈ విషయం పదేపదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నాడు. గిల్ కోసం.. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఇతర ఆటగాళ్లను విస్మరిస్తున్నారని సెలక్టర్లను నిందించాడు. గిల్‌ కు ఇన్ని అవకాశాలు ఇచ్చే బదులు.. సూర్య కుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లను టెస్టుల్లో ప్రోత్సహించాలి కదా? అని ప్రశ్నించాడు. సూర్య టెక్నిక్‌, ఆడే సత్తా ఉన్నవాడని.. టీమ్ మేనేజ్‌ మెంట్, సెలెక్టర్లు మాత్రం టి20 స్పెషలిస్టు ముద్ర వేశారని తప్పుబట్టాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, ఇండియా 'ఎ' టూర్‌ లలో అదరగొడుతున్న సాయి సుదర్శన్ లను ప్రోత్సహించాలని సూచించాడు.

ఆవేదనలో అర్థం ఉందా?

శ్రీకాంత్ ఆవేదనలో గిల్ ను తక్కువ చేసి చూడడంలో అర్థం ఉందా? అంటే లేదని చెప్పాలి. గిల్ ఆస్ట్రేలియాలో విఫలమైనది వాస్తవమే. కానీ, అతడు గతంలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. టి20లు, వన్డేల్లో నిరూపించుకున్నాడు. టెస్టుల్లో నిలదొక్కకుంటున్నాడు. అతడికి అవకాశాలు ఇవ్వడంలో తప్పు లేదు. పైగా గిల్ ను ఆస్ట్రేలియా పర్యటనలో ఇష్టం వచ్చినట్లు ఆడించారు. తొలి, నాలుగో టెస్టులో బరిలో దింపలేదు. అలాంటిది పూర్తిగా విఫలమయ్యాడని చెప్పలేం. అంచనాలకు తగ్గట్లు రాణించలేదని మాత్రం అనగలం. ఈ మాత్రం దానికే శ్రీకాంత్ తీవ్రంగా విమర్శలు చేయడం సరికాదు.