అయోధ్య రాముడికి టీమిండియా తెలుగు ‘భరతుడి’ సెంచరీ అంకితం
టీమిండియా ఈ నెల 25 నుంచి ఉప్పల్ లో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇది మొదటి టెస్టు కావడం గమనార్హం.
By: Tupaki Desk | 22 Jan 2024 2:30 PM GMTదేశమంతా ఇప్పుడు ఒకటే చర్చ.. ఒకటే మాట.. అదే అయోధ్య.. జై శ్రీరామ్.. భవ్యమైన మందిర ప్రారంభోత్సవ వేళ భక్తిభావంతో భారతావని పులకించిపోతోంది.. ఈ సమయంలో అధిక శాతం వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలోనూ జైశ్రీరామ్ నినాదాలతో కూడిన స్టేటస్ లే. అయోధ్య మందిర చిత్రాలే. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా భరతుడు సెంచరీ కొట్టి అయోధ్య రాముడికి తనవంతుగా హారతి ఇచ్చాడు. విశేషం ఏమంటే.. గతంలో టీమిండియాలో రాముడి పరమ భక్తుడు ‘‘హనుమంతుడు’’ ఉండేవాడు. అతడి బలం కాస్త తగ్గడంతో వెనకపట్టు పట్టాడు.. ఇప్పుడు రాముడికి తమ్ముడే అయినా భక్తిలో హనుమంతుడితో సాటిరాగల భరతుడు వచ్చాడు.
అయోధ్య రాముడి చలవతో..
టీమిండియా ఈ నెల 25 నుంచి ఉప్పల్ లో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇది మొదటి టెస్టు కావడం గమనార్హం. ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో కఠిన పరీక్షను ఎదుర్కొని మన జట్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పర్యటన ముగిశాక సంచలనాల అఫ్ఘానిస్థాన్ తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడింది. ఇప్పుడు టెస్టులను వన్డే తరహాలో ఆడే ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ లలో తలపడనుంది. వాస్తవానికి భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టి ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దానిని మరిచిపోయేందుకు భారత్ ను భారత్ లో ఓడించడం వారికి అత్యవసరం. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు టెస్టుల సిరీస్ ను సవాల్ గా తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇక భారత్ కూ ఈ సిరీస్ చాలా కీలకం. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం అనంతరం దక్షిణాఫ్రికా సిరీస్ తో టెస్టు సిరీస్ లో త్రుటిలో పరాభవం తప్పించుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో పాయింట్లు పెరగాలంటే.. ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేయాలి. తద్వారా చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలుస్తుంది. అందుకు పునాది ఈ నెల 25 నుంచి హైదరాబాద్ లో జరిగే తొలి టెస్టులోనే పడాల్సిన అవసరం ఉంది. కాగా.. ఈ మ్యాచ్ కు టీమిండియా వికెట్ కీపర్ ఎవరనే ప్రశ్న వస్తోంది. ఇప్పటికే జట్టులో కేఎల్ రాహుల్, విశాఖ పట్నం కుర్రాడు కేఎస్ భరత్, యూపీకి చెందిన యువ ధ్రువ్ జురెల్ రూపంలో ముగ్గురు కీపర్లున్నారు. వీరిలో కేఎస్ భరత్ కే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.
ఐదు రోజులు వికెట్లు కాసేలా..?
టెస్టు మ్యాచ్ లో వికెట్ కీపింగ్ అంటే మాటలు కాదు. విదేశాల్లో అయితే అన్నీ ఫాస్ట్ పిచ్ లే. రాహుల్ ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ లో వికెట్ కీపింగ్ చేశాడు. ఓ బ్యాట్స్ మన్ ను అదనంగా ఆడించేందుకు ఇది పనికొచ్చింది. కానీ, భారత్ లో ఎక్కువ శాతం స్పిన్ పిచ్ లు. అందులోనూ అశ్విన్, జడేజా వంటి మేటి స్పిన్నర్ల బంతులను ఒడిసిపట్టడం అంత సులువు కాదు. దీనికి స్పెషలిస్ట్ కీపర్లు అవసరం. ఆ నైపుణ్యం రాహుల్ కంటే భరత్ కు ఎక్కువగా ఉంది. ధ్రువ్ జురెల్ ఇంకా కుర్రాడు. అతడికి టెస్టు అవకాశం ఇస్తారని భావించలేం. మరోవైపు భరత్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు)తో జరిగిన టూర్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. అది కూడా రెండో ఇన్నింగ్స్ లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా సెంచరీ చేసి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు.
బ్యాట్ ను విల్లును చేసి.. రాముడికి అభివాదం
ఇంగ్లండ్ లయన్స్ తో మ్యాచ్ లో సెంచరీ అనంతరం కేఎస్ భరత్ తన బ్యాట్ ను విల్లులా చూపుతూ బాణం సంధించినట్లుగా సైగలు చేశాడు. దీంతో సెంచరీని రాముడికి అంకితం ఇచ్చినట్లు అయింది. కాగా భరత్ ఇప్పటికే టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు. కీపింగ్ బాగున్నా బ్యాటర్ గా ఆకట్టుకోలేదు. ఇప్పుడు రాముడికి అంకితం ఇచ్చిన సెంచరీ ద్వారా బ్యాటింగ్ పై అనుమానాలను తీర్చాడు. మరోవైపు రామాయణంలో భరతుడి పాత్ర అందరికీ తెలిసిందే. అన్న శ్రీ రాముడి పట్ల అతడికి ఉన్న ఆరాధ్య భావం గురించి గొప్పగా చెబుతుంటారు. రాముడితో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్లడంతో అతడికి ఎక్కువ పేరు వచ్చింది. అయితే, భరతుడి తల్లి కైకేయి కోరడంతోనే రాముడు సింహాసనం అధిష్ఠించకుండా వనవాసానికి వెళ్లాడు. కానీ, భరతుడు మాత్రం అన్న వచ్చేవరకు ఆ సింహాసనం మీద కూర్చోలేదు. సోదరుడి పాదుకలను సింహాసనంపైన ఉంచి తన అభిమానాన్ని చాటుకున్నాడు.