సీఎస్కే ఫిక్సింగ్.. ఐపీఎల్ మాజీ చైర్మన్ సంచలన ఆరోపణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఇలా ముగిసిందో లేదో.. అలా సంచలన ఆరోపణ బయటకు వచ్చింది.
By: Tupaki Desk | 27 Nov 2024 2:30 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఇలా ముగిసిందో లేదో.. అలా సంచలన ఆరోపణ బయటకు వచ్చింది. ఇంకా వేలంలో ఎవరెవరికి ఎంత డబ్బులు దక్కాయో లెక్క చూస్తుండగానే.. అమ్ముడుపోని ఆటగాళ్లను అయ్యో అంటుండగానే తీవ్ర దుమారం రేగేలా కనిపిస్తోంది. ఎక్కడచూసినా ఇప్పుడు ఐపీఎల్ రేట్ల గురించే మాట్లాడుతండగా ఆ లీగ్ కు చైర్మన్ గా చేసిన వ్యక్తి కలకలం రేపారు. ప్రతిష్ఠాత్మక లీగ్ లో ఒకప్పుడు ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు.
లీగ్ ను పుట్టించి.. పరారై..
17 ఏళ్లు దాటిపోయింది కాబట్టి ఐపీఎల్ వెనుక ఉన్నది ఎవరన్న సంగతి ఇప్పుడు పెద్దగా చర్చకు రాదేమోగానీ.. ఈ లీగ్ కు ఓ దశలో అన్నీ తానై వ్యవహరించారు లలిత్ మోదీ. 1980ల్లో చదువు కోసం అమెరికా వెళ్లిన లలిత్.. అక్కడ స్పోర్ట్స్ లీగ్ ల వ్యాపారాన్ని చూసి అలాంటిదే భారత్ లోనూ ఉండేలా ప్లాన్ చేశారు. మొదట్లో బీసీసీఐ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, 2007 వన్డే ప్రపంచ కప్ లో దారుణ ఓటమి అనంతరం దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) పుట్టడంతో బీసీసీఐ హడావుడిగా ఐపీఎల్ ను తెరపైకి తెచ్చింది. దీనికి రెండేళ్ల ముందే శరద్ పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లలిత్ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2013 వరకు భారత క్రికెట్ లో ప్రముఖుడిగా కొనసాగిన లలిత్ మోదీ కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీ వివాదం, మరికొన్ని ఆరోపణలతో నిషేధానికి గురయ్యారు. ఆపై లండన్ వెళ్లిపోయి అక్కడ ఉంటున్నారు. మధ్యలో బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో రిలేషిన్ షిప్ ద్వారా లలిత్ మోదీ వార్తల్లో నిలిచారు. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చారు.
అప్పట్లో శ్రీనివాసన్..
ఇండియా సిమెంట్స్ సంస్థల అధినేత, తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన సంగతి తెలిసందే. ఈయన ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు యజమాని కూడా. అయితే, శ్రీనివాసన్ ఫిక్సింగ కు పాల్పడ్డారని లలిత్ మోదీ ఆరోపిస్తున్నారు. ఆయన బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లోకి ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ను తీసుకోవాలని భావించారట. అతడి కోసం బిడ్ వేయొద్దని అన్ని జట్టకు చెప్పమన్నట్లు లలిత్ మోదీ పేర్కొన్నారు. అంతేకాదు.. శ్రీనివాసన్ చెన్నైలో జరిగే మ్యాచ్ లకు అంపైర్లను మార్చి స్థానిక అంపైర్లకు అవకాశం ఇచ్చేవారని కూడా తెలిపారు.
అప్పట్లో సీఎస్కే పై బ్యాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొదటినుంచి చెన్నైకే ఆడుతున్నాడు. అతడి సారథ్యంలోనే చెన్నై అత్యంత బలమైన జట్టుగా ఎదిగింది. అయితే, గతంలో ఎస్కేపై రెండు సీజన్ల పాటు బ్యాన్ పడింది. ఆ సమయంలో పుణె సూపర్ జెయింట్స్ పేరుతో బరిలో దిగింది.