Begin typing your search above and press return to search.

ఫుట్ 'బాలుడు' లమిన్ యమాల్..గుర్తుపెట్టుకోండి.. మళ్లీ మాట్లాడుకుందాం

అతడు 16 ఏళ్ల కుర్రాడు.. ఇంకా మీసాలు కూడా సరిగా రాలేదు.. కానీ, ఫుట్ బాల్ మైదానంలో దిగాడంటే ప్రత్యర్థులకు దడే

By:  Tupaki Desk   |   14 July 2024 3:00 AM GMT
ఫుట్ బాలుడు లమిన్ యమాల్..గుర్తుపెట్టుకోండి.. మళ్లీ మాట్లాడుకుందాం
X

అతడు 16 ఏళ్ల కుర్రాడు.. ఇంకా మీసాలు కూడా సరిగా రాలేదు.. కానీ, ఫుట్ బాల్ మైదానంలో దిగాడంటే ప్రత్యర్థులకు దడే.. నలుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను డ్రిబ్లింగ్‌ నైపుణ్యంతో దాటుకుంటూ వెళ్లిపోతాడు.. అతడిని చూస్తుంటే 60 ఏళ్ల కిందటి దిగ్గజం పీలే గుర్తొస్తాడు.. మెస్సీ, మారడోనాలనూ మరిపిస్తాడు. ఇప్పుడు ఫుట్ బాల్ ప్రపంచంలో అతడో సంచలనం. అతడు స్పెయిన్‌ కు చెందిన లమిన్‌ యమాల్.

ఈ ఏడాది యూరో ఫుట్ బాల్ కప్ లో లమిన్‌ యమాల్‌ దే హవా. ఓవైపు కెరీర్ చివరి దశలో ఉన్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోవైపు బుడిబుడి అడుగులు వేస్తున్న యమాల్. యూరో చరిత్రలోనే గోల్‌ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడు యమాల్. సెమీ ఫైనల్లో గోల్‌ తో స్పెయిన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యూరో కప్‌ ఫైనల్‌ కు ఒక్క రోజు ముందు 17వ ఏట అడుగు పెడుతున్నాడు యమాల్. కానీ, ఈ టోర్నీలో అతడు మ్యాచ్‌ లను పూర్తి సమయం ఆడనేలేదు.

ఫ్రాన్స్‌ ను పడగొట్టాడు ఈ బాల ఫుట్ బాలర్..

యూరో కప్ జర్మనీలో జరుగుతోంది. ఆ దేశ చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు వారు రాత్రి 8 దాటిన తర్వాత పని చేయకూడదు. అథ్లెట్లకు మాత్రం రాత్రి 11 గంటల వరకు మినహాయింపు ఉంటుంది. అయితే, యూరో కప్ లో మ్యాచ్‌ లు 11 తర్వాతే ముగుస్తున్నాయి. దీంతో 16 ఏళ్ల యమాల్ ను పూర్తి సమయం ఆడించేందుకు వీలు పడడం లేదు. ముందే గ్రౌండ్ నుంచి పంపించేస్తున్నారు. ఇలా చేయకుంటే స్పానిష్‌ ఫుట్‌బాల్‌ సంఘం రూ.27 లక్షలు (30 వేల యూరోలు) ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాగా సెమీస్‌ పోరులో యమాల్‌ ప్రపంచ మాజీ చాంపియన్ ఫ్రాన్స్ ను పడగొట్టాడు. 21వ నిమిషంలో కళ్లు చెదిరే రీతిలో 25 గజాల దూరం నుంచి టాప్‌ కార్నర్‌ కు బంతిని కొట్టి గెలిపించాడు. 16 ఏళ్ల 362 రోజుల వయసులోనే గోల్‌ కొట్టి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఫైనల్లో అయినా పూర్తిగా ఆడతాడా?

ఆదివారం స్పెయిన్ యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడనుంది. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడుతోంది. సెమీస్ లో గోల్ కొట్టిన యమాల్ వంటి ప్లేయర్ ను ఫైనల్లో పూర్తి స్థాయిలో ఆడించగలరా? అన్న ప్రశ్న వస్తోంది. ఆదివారం ఫైనల్‌ రాత్రి 9 గంటలకు (జర్మనీ టైమ్ ప్రకారం) ప్రారంభం కానుంది. అడ్డంకులు లేకపోతే 11 గంటల్లోపే పూర్తవుతుంది. ఎక్స్‌ట్రా, పెనాల్టీలు ఇవ్వాల్సి వస్తే యమాల్‌ ను ఆడించడం కుదరదు.

కాబోయే ప్రపంచ దిగ్గజం

మెరుపు వేగం, ప్రత్యర్థి గోల్‌ పోస్టు మీదకు దూసుకెళ్లడం.. క్షణాల్లో బంతిని లోపలికి పంపే నైపుణ్యం, బంతిపై నియంత్రణ సామర్థ్యం, మైదానంలో పాదరసంలా కదులుతూ 30 గజాల దూరం నుంచి కూడా బంతిని గోల్‌ పోస్టులోకి పంపే యమాల్ క్రమశిక్షణ తప్పకుండా ఇదే రీతిన ఆడితే మరో పీలే అవుతాడనే అంచనాలు వస్తున్నాయి. ఈ రైట్‌ వింగర్‌ చిన్న వయసులోనే అత్యంత పరిణితి చూపుతున్నాడు. మానసికంగానూ గట్టిగా కనిపిస్తున్నాడు. ఒత్తిడి అనే మాటే అతడిపై ప్రభావం చూపడం లేదు. అందుకే మారడోనా, మెస్సీలతో యమాల్‌ ను పోల్చాడు జర్మనీ దిగ్గజ ఆటగాడు లోథర్‌ మథియాస్. ఎడమ కాలును ప్రభావవంతగా వాడుతూ పాస్ లు ఇవ్వడంలో యమాల్ ది అందెవేసిన చేయి. యూరో కప్‌ లో ఇప్పటికే మూడు గోల్స్‌ లో సహకారం అందించాడు. బార్సిలోనా క్లబ్‌ సీనియర్‌ స్థాయిలో 51, అంతర్జాతీయ ఫుట్‌ బాల్‌ లో స్పెయిన్ కు 13 మ్యాచ్‌లు ఆడాడు యమాల్. యూరో కప్‌ లో ఖాళీ సమయంలో చదువుకుంటుండడం యమాల్ విశిష్ఠతను మరింత పెంచింది.