Begin typing your search above and press return to search.

నాడు సచిన్ తో ‘పరుగులు’.. నేడు ‘అడుగే’ లేదు.. క్రికెటర్ దీన స్థితి

అది 1980వ దశకం రెండో భాగం.. ముంబై స్కూల్ క్రికెట్ లో ఇద్దరు పిల్లలు రికార్డులు బద్దలు కొట్టారు.

By:  Tupaki Desk   |   6 Aug 2024 9:23 AM GMT
నాడు సచిన్ తో ‘పరుగులు’.. నేడు ‘అడుగే’ లేదు.. క్రికెటర్ దీన స్థితి
X

అది 1980వ దశకం రెండో భాగం.. ముంబై స్కూల్ క్రికెట్ లో ఇద్దరు పిల్లలు రికార్డులు బద్దలు కొట్టారు. కుడి-ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడంతో ప్రత్యర్థి బౌలర్లను మైదానం అంతటా ఉరికించి కొట్టారు.. అలా 1988లో జరిగిన స్కూల్ క్రికెట్ మ్యాచ్ లో ఆ ఇద్దరూ ఏకంగా 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది 40 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ యువ క్రికెటర్లకు అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఉదంతం. అలా స్కూల్ లోనే అదరగొట్టినవారిద్దరూ భారత జట్టుకూ వచ్చేశారు. కుడిచేతి వాటం కుర్రాడు కాస్త నెమ్మదిగా ప్రయాణం మొదలు పెట్టగా ఎడమ చేతివాటం కుర్రాడు మాత్రం దూసుకుపోయాడు. డబుల్ సెంచరీలు, సెంచరీలతో అదరగొట్టాడు. ఇతడికి అద్భుతమైన భవిష్యత్ ఉందని అందరూ భావించారు. కానీ, విధి అలా ఎందుకు జరగనిస్తుంది.

చేజేతులా..

భారత క్రికెట్ లో జీవితాన్ని సరిగా గాడిలో పెట్టుకోలేని అత్యంత ప్రతిభావంతుడు ఎవరంటే.. అందరూ ముంబైకి చెందిన వినోద్ కాంబ్లీ పేరే చెబుతారు. 1988లో ముంబై హారిస్‌ షీల్డ్‌ సెమీ ఫైనల్‌ శారదా విద్యాశ్రమ్ విద్యార్థులుగా సచిన్ టెండూల్కర్ తో కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. అందులో కాంబ్లీ (349 నాటౌట్) వాటానే అధికం. సచిన్ (326 నాటౌట్) చేసింది తక్కువే. ఆ వెంటనే సచిన్ భారత జట్టులోకి రావడం కుదురుకోవడం జరిగిపోయింది. అయితే, కాంబ్లీ ఒక రెండేళ్లు అటుఇటుగా వచ్చాడు. కానీ, సచిన్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. వరుసగా రెండు డబుల్ సెంచరీలు కొట్టాడు. తక్కువ టెస్టుల్లోనే వెయ్యి పరుగులు చేసిన రికార్డును అందుకున్నాడు. అతడిని వెస్టిండీస్ దిగ్గజం లారాతో పోల్చారు. కానీ, కాంబ్లీ కట్టుతప్పాడు. క్రమశిక్షణ మరిచాడు. పార్టీలు, అమ్మాయిలతో స్నేహం కారణంగా కెరీర్ లో వెనుకబడ్డాడు. దీంతో జట్టులో చోటు కోల్పోయాడు. సహచరుడు సచిన్ సెంచరీల మీద సెంచరీలతో కెప్టెన్ అయిపోగా.. కాంబ్లీ జట్టులోకి ఎంపికే కాలేదు. అప్పటికీ సచిన్ కెప్టెన్ అయ్యాక కాంబ్లీని ఆదుకున్నాడు. కానీ, అతడు దానిని నిలుపుకోలేదు. 2000 తర్వాత కాంబ్లీ భారత జట్టుకు ఎంపిక కాలేదు.

ఏమైంది అతడికి?

ఆదాయం లేకపోవడంతో ఆర్థికంగానూ కాంబ్లీ దెబ్బతిన్నాడు. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కాంబ్లీ గతంలో పేర్కొన్నాడు. సచిన్ సాయం చేసినా అది ఎంతని చేయగలడు...? ఓ దశలో ముంబై క్రికెట్ అసోసియేషన్ లో కోచ్ గానూ కాంబ్లీ పనిచేశాడు. అయితే, అతడి ఆరోగ్యం దెబ్బతిన్నదనే కథనాలు వచ్చాయి. తాజాగా కాంబ్లీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం 52 ఏళ్లున్న కాంబ్లీ కాలు కదపలేని స్థితిలో ఉన్నాడు. ఓ దుకాణం వద్దకు వచ్చిన అతడు.. బైక్‌ పట్టుకుని నిల్చున్నాడు. లోపలకు నడిచి వెళ్లలేకపోయాడు. దీంతో అక్కడున్నవారు కాంబ్లీ చేతులు పట్టుకుని కూర్చోబెట్టారు. కాంబ్లీ ముఖ కవళికలను బట్టి చూస్తే ఆ వీడియో తాజాదే అని తెలుస్తోంది.కానీ, ఎప్పటిది అనేది మాత్రం నిర్ధారణ కాలేదు.

సచిన్.. కాంబ్లీని ఆదుకో..

కాంబ్లీ చిన్ననాటి మిత్రుడు అయిన సచిన్ అతడిని ఆదుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై సచిన్ స్పందన ఏమిటనేది తెలియరాలేదు. బాల్య మిత్రుడికి ఇప్పటికే సచిన్ పలుసార్లు సాయం చేశాడు. అయితే, ఇప్పుడు కూడా స్పందిస్తాడా? అసలు ఈ కథనాలు నిజమేనా? అనేది తేలాల్సి ఉంది.