అర్జెంటీనా జట్టుతో పాటు దిగ్గజం మెస్సీ ఇండియాకు ఎందుకొస్తున్నాడు?
సాధారణంగా అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్లకు భారత్ అంటే పెద్దగా తెలియదు. ఇందులో వారి తప్పేమీ లేదు.
By: Tupaki Desk | 27 March 2025 10:16 AMసాధారణంగా అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్లకు భారత్ అంటే పెద్దగా తెలియదు. ఇందులో వారి తప్పేమీ లేదు. దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో మాత్రమే ఫుట్ బాల్ బాగా ఫేమస్. ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల్లో ఆదరణ తక్కువే. ఇక అంతర్జాతీయ ఫుట్ బాల్ స్టార్లకు భారత్ రావాల్సిన అవసరమే లేదు. యూరోపియన్ లీగ్ లు, కోపా అమెరికా కప్ లతో వారు బిజిజిజీ. ఇప్పుడే కాదు.. బ్రెజిల్ దిగ్గజం పీలే, అర్జెంటీనా సూపర్ స్టార్ డిగో మారడోనా వంటివారు కొన్నిసార్లు ఇండియా వచ్చారు. కోల్ కతా వంటిచోట్ల వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
జగజ్జేత జట్టు కెప్టెన్ గా..
లయోనల్ మెస్సీ.. ప్రస్తుత ఫుట్ బాల్ ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్. 2022లో అర్జెంటీనాను ప్రపంచ కప్ లో విజేతగా నిలిపాడు. అదికూడా ఫ్రాన్స్ వంటి మేటి జట్టును మట్టికరిపించాడు. దీంతోనే మెస్సీ ప్రపంచ నంబర్ వన్ ఫుట్ బాలర్ తానే అని చాటుకున్నాడు.
14 ఏళ్ల తర్వాత
భారత్ లో మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్నాడు. అక్టోబరులో అతడు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు ఇండియా వస్తున్నాడు. అయితే, మెస్సీ ఒక్కడే కాదు.. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్టు మొత్తం ఇండియా రానుందట. కేరళలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడునుందట. మెస్సి 2011లో భారత్ వచ్చి కోల్‌కతాలో వెనెజులాతో ప్రపంచ కప్ అర్హత మ్యాచ్ లో ఆడాడు. అయితే, అప్పటికి అంత పాపులర్ కాదు. కెరీర్ ఆరంభంలో ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఆల్ టైమ్ గ్రేట్ గా కేరళలో అడుగుపెట్టనున్నాడు.
కాగా, అమెరికా, మెక్సికో, కెనడా 2026 జూన్ లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరగనుంది. రికార్డు స్థాయిలో 48 జట్లు పోటీపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా నుంచి ప్రపంచ కప్ నకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా 4-1తో బ్రెజిల్ ను ఓడించింది. మెస్సి ఈ మ్యాచ్ లో ఆడలేదు.