లుక్ బ్యాక్ స్పోర్ట్స్: గంభీర్..టీమిండియా హెడ్ కోచా?హెడ్ ఏక్ కోచా?
ఆటగాళ్ల రిటైర్మెంట్ అత్యంత సహజం.. ఇవికాక మరేంటి కీలక పరిణామం? దీనికి సమాధానం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమాకం.
By: Tupaki Desk | 13 Dec 2024 8:30 PM GMT2024లో టీమ్ ఇండియా విషయంలో చోటుచేసుకున్న అతిపెద్ద పరిణామం ఏమిటి..?
టి20 ప్రపంచ కప్ ను 17 ఏళ్ల తర్వాత గెలుచుకోవడమా?
స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కావడమా?
90 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా స్వదేశంలో.. అదీ న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ కావడమా?
27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోవడమా?
..ఈ ఏడాది భారత క్రికెట్ లో జరిగిన కీలక ఘటనలు ఇవేవీ కాదు. గెలుపు ఓటములు ఏ క్రీడలోనైనా సహజం. ఆటగాళ్ల రిటైర్మెంట్ అత్యంత సహజం.. ఇవికాక మరేంటి కీలక పరిణామం? దీనికి సమాధానం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమాకం.
43 ఏళ్లకే..
టీమ్ ఇండియా హెడ్ కోచ్ అంటే.. ఎవరైనా 50 ఏళ్లు 60 ఏళ్లు దాటినవారినే చూస్తారు. కానీ, గంభీర్ కేవలం 43 ఏళ్లకే ఆ పదవిలోకి వచ్చాడు. ఇది మామూలు బాధ్యత కాదు.. 150 కోట్ల జనాభా ఊపిరిగా భావించే క్రీడలో దేశాన్ని ముందుకు నడిపించే పెద్ద బాధ్యత. దీని బరువు ఇంత అని చెప్పలేం... అయితే, గంభీర్ మనస్తత్వానికి ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
ఆరు నెలలు 3 ఓటములు..
గంభీర్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలే.. అయితే.. జూలైలో శ్రీలంకతో జరిగిన తొలి సిరీస్ లోనే అతడికి చేదు అనుభవం ఎదురైంది. టి20ల్లో స్వీప్ చేసినా, లంక చేతిలో 27 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా వన్డే సిరీస్ ఓడింది. ఇక ఎన్నడూ లేని విధంగా ఏ జట్టుపైనా లేని విధంగా మూడు టెస్టుల సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లో తొలి మ్యాచ్ నెగ్గినా, గులాబీ టెస్టులో పరాజయం పాలైంది.
గంభీర్ నడిపించగలడా?
గంభీర్ ముక్కుసూటి మనిషి. దీంతోపాటు కోహ్లితో విభేదాలు ఉన్నాయనే అపోహ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో కోల్ కతా నైట్ రైడర్స్ ను కోచ్/మెంటార్ గా విజేతగా నిలిపినా, లీగ్ వేరు, జాతీయ జట్టు వేరు. అందుకే టీమ్ ఇండియాను అతడు నడిపించగలడా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మరో రెండున్నరేళ్లు..
హెడ్ కోచ్ గా గంభీర్ కాల వ్యవధి మూడేళ్లు. ఇప్పటికే ఆరు నెలలు పూర్తయ్యాయి. మరో రెండున్నరేళ్లలో భారత్ అనేక పెద్ద టోర్నీలు ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్, డిఫెండింగ్ చాంపియన్ గా టి20 ప్రపంచ కప్ వీటిలో కీలకమైనవి.
దిగ్గజాలను భర్తీ చేయాలి..
వచ్చే రెండేళ్లలో కోహ్లి, రోహిత్, షమి రిటైర్ అవడం ఖాయం. వీరి స్థానాలను భర్తీ చేయగల ఆటగాళ్లను వెదకడం గంభీర్ ముందున్న పెద్ద బాధ్యత. టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేర్చడం ఇప్పటికిప్పుడు ఉన్న అతి పెద్ద బాధ్యత.