లుక్ బ్యాక్ స్పోర్ట్స్:టీమిండియా..ఫస్టాఫ్ హిట్..సెకండాఫ్ డిజాస్టర్
అలాంటి క్రికెట్ లో ప్రతి పిల్లాడి కల తాను భారత జాతీయ జట్టుకు ఆడాలనే.
By: Tupaki Desk | 12 Dec 2024 2:45 AM GMTఈ ఏడాది భారత క్రికెట్ జట్టు గురించి చెప్పాలంటే.. రాజ్యపూజ్యం 5.. అవమానం 5.
ఎంతమంది విమర్శించినా.. మరెంతో మంది నిందించినా.. భారత్ లో 90 శాతంపైగా క్రీడాభిమానులు ఇష్టపడేది క్రికెట్. కోట్లాది మంది ఆడే క్రీడ కూడా ఇదే. దీనికితగ్గట్లే.. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో బాక్స్ క్రికెట్ కల్చర్ పుట్టుకొచ్చింది. గంటకు ఇంత అని చెల్లించి నెట్స్ లో ప్లాస్టిబ్ బ్యాట్ తో బ్యాటింగ్, టెన్నిస్ బంతితో బౌలింగ్ దీని ప్రత్యేకత. ఇక పట్టణాలు, నగరాల్లో రూ.వేలకు వేలు వెచ్చించి కోచింగ్ కు వెళ్తున్న పిల్లల సంఖ్యకు లెక్కే లేదు. అలాంటి క్రికెట్ లో ప్రతి పిల్లాడి కల తాను భారత జాతీయ జట్టుకు ఆడాలనే. అయితే, కేవలం 11 మందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. మరి ఆ 11 మంది 2024లో భారత కీర్తి ప్రతిష్ఠలను నిలిపారా?
టెస్టు సిరీస్ తో మొదలుపెట్టి..
నిరుడు నవంబరు 19న జరిగింది వన్డే ప్రపంచ కప్ ఫైనల్. ఆ తర్వాత భారత్ ఆస్ట్రేలియాతోనే టి20 సిరీస్ ఆడింది. ఇక 2024 ప్రారంభంలోనే ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడింది భారత్. దీనిని 4-1తో గెలుచుకుంది. ఓడిపోయిన ఆ ఒక్కట టెస్టు కూడా హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. ఈ సిరీస్ తర్వాత వెంటనే ఐపీఎల్ కు వెళ్లిపోయింది. రెండు నెలలకు పైగా సాగిన ఈ సీజన్ లో ఈ ఏడాది కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది.
టి20 కప్ గెలుచుకున్నారోచ్.. 17 ఏళ్ల తర్వాత
సొంతగడ్డపై గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పరాజయం అభిమానులను కుంగదీసింది. అయితే, దీనిని మరిపింపజేస్తూ అమెరికా, కరీబియన్ దీవుల్లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను గెలుచుకుంది టీమ్ ఇండియా. పైగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ టి20 ఫార్మాట్లోకి దిగి దేశానికి ప్రపంచ కప్ అందించారు. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచ కప్ తర్వాత భారత్ మళ్లీ కప్ కొట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ తర్వాత జూనియర్ టీమ్ జింబాబ్వే వెళ్లి ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకుని వచ్చింది. ఇంతటితోనే 2024 ఫస్ట్ హాఫ్ పూర్తయింది.
సెకండాఫ్ చండాలం..
సినిమా భాషలో చెప్పాలంటే టీమ్ ఇండియా 2024లో ఫస్టాఫ్ హిట్.. సెకండాఫ్ ఛండాలం అనే అనాలి. ఎందుకంటే.. జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లింది మన జట్టు. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో క్లీన్ స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్ లో మాత్రం దారుణంగా ఓడింది. తొలి వన్డే కనాకష్టంగా టై అయినా మిగతా రెండింటిలో రోహిత్ శర్మ టీమ్ చేతులెత్తేసింది. ఈ సిరీస్ కు తొలుతు రెస్ట్ తీసుకుందామనుకున్న రోహిత్, కోహ్లి ఆ నిర్ణయం మార్చుకుని జట్టుతో కలిశారు. కానీ, ఏం ఉపయోగం లేకపోయింది. దీంతో 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో భారత్ వన్డే సిరీస్ ఓడింది. సెప్టెంబరులో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసినా, టి20 సిరీస్ ను నెగ్గినా అది చిన్న జట్టు కాబట్టి పెద్దగా పరిగణనలోకి తీసుకోవద్దు.
న్యూజిలాండ్ దెబ్బకొట్టింది
టెస్టుల్లో బహుశా భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఎన్నడూ ఎరుగని పరాజయం అంటే ఏమిటో చూపించింది న్యూజిలాండ్ జట్టు. మూడు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. స్పిన్ ఏమాత్రం ఆడలేరనే పేరున్న ఆ జట్టు బ్యాట్స్ మెన్ మన జట్టు టాప్ బ్యాటర్ల కంటే మెరుగ్గా రాణించారు. ఫలితంగా 36 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్టు మ్యాచ్ నెగ్గిన రికార్డును.. భారత్ లో భారత్ ను క్లీన్ స్వీప్ చేసిన అరుదైన ఘనతనూ అందుకుంది. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై భారత్ 2-0 తేడాతో స్వీప్ అయింది. 12 ఏళ్ల తర్వాత, 18 వరుస టెస్టు విజయాల తర్వాత భారత్ తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్ లో ఓడింది. ఇక మూడు అంతకుమించి టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ కావడం మాత్రం 91 ఏళ్లలో తొలిసారి.
ఇప్పటికైతే 1-1 తో..
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టెస్టులో నెగ్గినా మలి టెస్టులో దారుణంగా ఓడింది. ఈ ఏడాది మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. శనివారం నుంచి మూడో టెస్టు, ఈ నెల 26 నుంచి నాలుగో టెస్టు జరగనుంది. వీటిలో కచ్చితంగా గెలిస్తేనే 2024ను మంచిగా ముగించినట్లు. లేదంటే మైనస్ తోనే ముగించినట్లు.