విండీస్ దెబ్బకు ఉంగా..ఉంగా.. 39 పరుగులకే ఉగాండా ఆలౌట్
అగ్ర రాజ్యం అమెరికాలో పిచ్ లు నెమ్మదిగా ఉన్నాయి.. కరీబియన్ దీవుల్లో రికార్డులు బద్దలవుతున్నాయి..
By: Tupaki Desk | 9 Jun 2024 11:22 AM GMTఅగ్ర రాజ్యం అమెరికాలో పిచ్ లు నెమ్మదిగా ఉన్నాయి.. కరీబియన్ దీవుల్లో రికార్డులు బద్దలవుతున్నాయి.. ఇదీ ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ లో విశేషం. ఎన్నడూ లేని విధంగా 20 జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో రోజుకో సంచలనం నమోదవుతోంది. పపువా న్యూ గినియా, ఉగాండా వంటి క్రికెట్ లో ఎన్నడూ వినని పేర్లు.. నమీబియా, ఒమన్ వంటి పసికూన జట్లు టోర్నీలో తలపడుతున్నాయి. నేపాల్, నెదర్లాండ్స్ వంటి జట్లూ కప్ లో ఆడుతున్నాయి.
కూన చేతిలో పరాజయం తప్పించుకుని..
గత ఆదివారం పపువా న్యూగినియా తో మ్యాచ్ లో వెస్టిండీస్ దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లింది. అయితే, అనుభవరాహిత్యంతో మ్యాచ్ ను చేజార్చుకుంది. మరోవైపు టి20 వరల్డ్ కప్ చరిత్రలో.. ఓ బౌలర్ అత్యంత తక్కువ ఎకానమీతో బంతులేసిన రికార్డు గత వారమే నమోదైంది. 43 ఏళ్ల ఉగాండా ఆఫ్ బ్రేక్ బౌలర్ సుబుగా నాలుగు ఓవర్ల కోటాలో రెండు మెయిడెన్లు సహా 4 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు (4-2-4-2) తీశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అత్యంత ఉత్తమ ఎకానమీ.
అదే ఉగాండా... నేడు విలవిల
పపువా చేతిలో మొన్న ఓడిపోయేలా కనిపించిన వెస్టిండీస్.. శనివారం ఉగాండాను చిత్తు చేసింది. ప్రత్యర్థిని 39 పరుగులకే ఆలౌట్ చుట్టేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యల్ప స్కోరు చేసిన రెండో జట్టుగా ఉగాండా నిలిచింది. 2014లో శ్రీలంకపై నెదర్లాండ్స్ 39 పరుగులకే కుప్పకూలింది. కాగా, ఉగాండాపై విండీస్ 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత విండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (44), రస్సెల్ (30), పూరన్ (22), పావెల్ (23), రూథర్‌ఫర్డ్ (22) రాణించారు.
176 పరుగుల టార్గెట్ లో ఉగాండా 39 పరుగులకే కుప్పకూలింది. జుమా మియాగి (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఈ మ్యాచ్ లో విండీస్ బౌలర్ అకీల్ హుసేన్ (5/11) రికార్డు ప్రదర్శన చేశాడు.