లక్నో వర్సెస్ చెన్నై... హెడ్ టు హెడ్ గణాంకాలు చెప్పేదిదే
లక్నో బ్యాటర్స్ లో టాప్ ఆర్డర్ బాగానే రాణిస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ లో లోపాలు వెంటాడుతూనే ఉన్నాయి
By: Tupaki Desk | 19 April 2024 4:14 AM GMTఐపీఎల్ సీజన్ 18లో భాగంగా పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ - ఐదో ప్లేస్ లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ మద్య పోరు ఎకానా స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ 6 మ్యాచ్ లు ఆడిన చెన్నై నాలుగు మ్యాచ్ లలో గెలవగా.. అదే ఆరు మ్యాచ్ లు ఆడిన లక్నో 3 మ్యాచ్ లలో విజయం సాధించింది.
లక్నో బ్యాటర్స్ లో టాప్ ఆర్డర్ బాగానే రాణిస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ లో లోపాలు వెంటాడుతూనే ఉన్నాయి. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోతుండటం వారికి శాపంగా మారింది. లక్నో బ్యాటర్స్ లో పూరన్ 6 మ్యాచ్ లు ఆడి 223 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 204 పరుగులు చేశాడు. ఇక బౌలర్లలో యష్ ఠాకూర్ 5 మ్యాచ్ లలో 7 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ యాదవ్ మూడు మ్యాచ్ లలో 6 వికెట్లు పడగొట్టాడు.
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఇటీవలి మ్యాచ్ లో లక్నో 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. నికోలస్ పూరన్ 45 పరుగులతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచగా.. వెస్టిండీస్ స్పీడ్ స్టర్ షమర్ జోసెఫ్ తన నాలుగు ఓవర్ల స్పెల్ లో 47 పరుగులు ఇవ్వడం ఖరీదైన మిస్టేక్ గా మారింది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే... వారి ఇటీవలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై గెలిచిన జోష్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ధోని 4 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కీలకమైన తేడా వచ్చింది. ఈ క్రమంలో జట్టు బ్యాటింగ్ మెరుగుపడుతోంది. శివం దుబే నిలకడగా ఆడుతున్నాడు. ఇదే సమయంలో పతిరనా నాలుగు వికెట్లు తీసి ఆ మ్యాచ్ లో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
చెన్నై బ్యాటింగ్ విభాగంలో శివం దూబే ఆడిన ఆరు మ్యాచ్ లలో 242 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 224 పరుగులతో రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే... ముస్తాఫిజూర్ రెహమాన్ 5 మ్యాచ్ లు ఆడి 10 వికెట్లు తీయగా.. పథిరన 3 మ్యాచ్ లు మాత్రమే ఆడి 8 వికెట్లు పడగొట్టాడు.
హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!:
లక్నో, చెన్నై జట్లు ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. వీటిలో చెన్నై ఒక మ్యాచ్ గెలవగా.. లక్నో మరో మ్యాచ్ గెలిచింది. ఇక మిగిలిన మ్యాచ్ లో ఫలితం తేలలేదు! ఇక, లక్నో ఇప్పటివరకు చెన్నైపై అత్యధిక స్కోరు 211 నమోదు చేయగా.. లక్నోపై చెన్నై అత్యధిక స్కోరు 217 పరుగులుగా ఉంది. దీంతో కాగితాలపై జట్లు ఎంత బలంగా ఉన్నా, మరెన్ని బలహీనతలున్నా.. ఈ రెండు జట్లూ కేవలం నాలుగోసారి మాత్రమే తలబడుతుండటంతో... అంచనాలు అంత ఈజీ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి!