Begin typing your search above and press return to search.

జీన్స్ వేసుకున్నాడని ఫైన్.. చెస్ టోర్నీకే దిగ్గజం గుడ్ బై

వస్త్రధారణ కూడా ఇందులో భాగమే. అయితే, ఇలాంటి నిబంధన ఓ దిగ్గజ ఆటగాడు చెస్ టోర్నీకే గుడ్ బై చెప్పే స్థితికి తీసుకొచ్చింది.

By:  Tupaki Desk   |   28 Dec 2024 9:39 AM GMT
జీన్స్ వేసుకున్నాడని ఫైన్.. చెస్ టోర్నీకే దిగ్గజం గుడ్ బై
X

మిగతా క్రీడలు వేరు.. చెస్ వేరు.. మేధో క్రీడ అయిన చదరంగంలో ప్రతి విషయాన్నీ చాలా కీలకంగా భావిస్తారు. ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగే వాటిని వేటినీ అనుమతించరు. వస్త్రధారణ కూడా ఇందులో భాగమే. అయితే, ఇలాంటి నిబంధన ఓ దిగ్గజ ఆటగాడు చెస్ టోర్నీకే గుడ్ బై చెప్పే స్థితికి తీసుకొచ్చింది.

అనతొలి కార్పొవ్, గ్యారీ కాస్పరోవ్ తర్వాత చెస్ ప్రపంచంలో దిగ్గజంగా వెలుగొందుతున్నాడు మాగ్నస్ కార్ల్‌ సన్. 34 ఏళ్ల కార్ల్‌ సన్ నార్వే దేశానికి చెందినవాడు. 2013లో చెన్నైలో జరిగిన ప్రపంచ చదరంగం పోటీల్లో భారత్ కు చెందిన విశ్వనాథన్ ఆనంద్ పై గెలిచి ప్రపంచ విజేతగా నిలిచాడు. కార్ల్‌ సన్ సాధించిన అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 2872. ఇవి చదరంగ పోటీలో ఒక రికార్డు.

ఇంతటి అగ్రశ్రేణి చెస్ ప్లేయర్ అయిన కార్ల్ సన్ వివాదంలో చిక్కాడు. తాజాగా ప్రపంచ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ పోటీల నుంచి వైదొలిగాడు. అయితే, ఈ సందర్భంగా డ్రెస్‌ కోడ్ కీలకంగా నిలిచింది. అతడు కోడ్ పాటించకపోవడంతో మాగ్నస్‌ పై చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హోలోసక్ అనర్హత వేటు వేశాడు. పైగా 200 డాలర్ల జరిమానా విధించాడు.

ఫిడే నిబంధనలు ఓ వెర్రి

మాగ్నస్‌ గతంలోనూ జీన్స్ వేసుకుని ఈవెంట్‌ లో పాల్గొన్నాడు. దానినే పునరావృతం చేయడంతో వేటు పడింది. అయితే, తాజా పరిస్థితిపై అతడు తీవ్రంగా స్పందించాడు. ఫిడే నిబంధనలు వెర్రిగా ఉన్నాయని ఎద్దేవా చేశాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే)పై విమర్శలు చేశాడు. ఫిడే కారణంగా చాలా విసిగిపోయానని... అందుకే కొనసాగాలనుకోవడం లేదని చెప్పాడు. వారితో కలిసి ప్రయాణం అనవసరం అని తేల్చేశాడు.

‘‘ఇక్కడికి వచ్చాక నిద్రపోయా. మీటింగ్‌ కు ముందు మంచి లంచ్‌ చేశా. రూమ్‌ కు వెళ్లి దుస్తులు మార్చుకునే సమయం లేదు. షర్ట్, జాకెట్‌ తో ఉన్నా. జీన్స్‌ వేసుకుని ఉన్నాననే ఆలోచన కూడా నాకు లేదు. షూస్‌ కూడా మార్చుకోలేదు. నాకు జరిమానా విధించారు. మూడో రౌండ్‌ తర్వాత మార్చుకోవాలని చెప్పారు. ఇవాళ కుదురకపోవచ్చు. రేపు వేసుకొని వస్తానని చెప్పినా వేటు వేశారు. అప్పీలు చేయను. బ్లిట్జ్‌ ఛాంపియన్‌ షిప్‌ లో ఆడను’’ అని కార్ల్ సన్ తెలిపాడు.