Begin typing your search above and press return to search.

మను బాకర్.. 'క్రీడా రత్నమేనా'? కాదా?

వాస్తవానికి మను లేకుంటే ఈ ఒలింపిక్స్ లో మన పతకాల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

By:  Tupaki Desk   |   24 Dec 2024 12:30 PM GMT
మను బాకర్.. క్రీడా రత్నమేనా? కాదా?
X

ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించడం అంటే భారతీయులకు సాధ్యమే కాదనేవారు.. పైగా షూటింగ్ లో అయితే ఒక పతకం వస్తేనే గొప్పనేవారు.. అలాంటిది కొన్ని నెలల కిందట పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో రెండు కాంస్యాలు గెలిచి చరిత్రలో కెక్కింది మను బాకర్. వాస్తవానికి మను లేకుంటే ఈ ఒలింపిక్స్ లో మన పతకాల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. భారత దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆమెకు దక్కుతుందా? లేదా? అని..

ఆమె పేరుందా? లేదా?

మను కచ్చితంగా క్రీడా రత్నమే. ఆమె సాధించిన ఘనతనే దానిని చెబుతుంది. అయితే, ఆమెకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న ఇస్తారా? లేదా? అని పెద్ద చర్చగా మాచరింది. ఈ పురస్కారాన్ని ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. ఆలోపుగా జాబితాలు పంపాలి. సరిగ్గా నెల రోజులు ఉన్న సమయంలో ఇంకా తుది ప్రతిపాదనల జాబితా సిద్ధం కాలేదు. అయితే, ఖేల్ రత్న జాబితాలో మను పేరు ఉంటుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి.

ఎందుకొచ్చిందీ సమస్య?

సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలో 12 మందితో ఈసారి ఖేల్ రత్న అవార్డు కమిటీ వేశారు. ఈ అవార్డుకు స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అథ్లెట్లకు మంత్రిత్వ శాఖ కల్పించింది. కానీ, దరఖాస్తు చేసుకోని వారికి కూడా ఈ పురస్కారాలకు ప్రతిపాదించేందుకు కమిటీకి అనుమతి ఇచ్చారు. అయితే, ఖేల్‌ రత్న రేసులో వరుసగా రెండో ఒలింపిక్స్‌ లోనూ కాంస్యం సాధించేలా జట్టును నడిపించిన భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ సింగ్, పారాలింపిక్స్‌ హై జంప్‌ లో స్వర్ణం సాధించిన ప్రవీణ్‌ కుమార్‌ పేర్లను ప్రతిపాదనలో వెళ్లాయి. కానీ, మను బార్ పేరును పరిగణనలోకి తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు , మను అసలు దరఖాస్తు చేయలేదని కూడా అంటున్నారు.

మను తండ్రి వ్యాఖ్యలతో కలకలం

ఖేల్ రత్న కోసం మను దరఖాస్తు చేసిందని ఆమె తండ్రి, మర్చంట్‌ నేవీ చీఫ్‌ ఇంజినీర్‌ రాంకిషన్‌ తేల్చి చెప్పాడు. ఒలింపిక్స్‌ లో ఆడినా భారత్‌ లో విలువ ఉండదని.. రెండు పతకాలు గెలిచిననా ఖేల్‌ రత్నకు పట్టించుకోవడం లేదని నిట్టూర్చాడు. దీంతో మను విషయం సంచలనమైంది. దేశం కోసం విజయాలు సాధిస్తూ, గుర్తింపునకు అడుక్కోవాల్సి రావడంలో అర్థం లేదన్నాడు. పైగా రెండు, మూడేళ్లుగా పద్మశ్రీ, పద్మభూషణ్, ఖేల్‌ రత్న కోసం మనూ దరఖాస్తు చేస్తోందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడూ కచ్చితంగా దరఖాస్తు చేసిందని భావిస్తున్నట్లు తెలిపాడు.