Begin typing your search above and press return to search.

నేషనల్ క్రష్.. 2 నెలల బిరుదు మాత్రమే..: ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో రెండు పతకాలు సాధించింది హరియాణాకు చెందిన మను బాకర్.

By:  Tupaki Desk   |   1 Oct 2024 9:30 PM GMT
నేషనల్ క్రష్.. 2 నెలల బిరుదు మాత్రమే..: ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్
X

అందానికి అందం.. ఆటకు ఆట.. అందుకేనేమో ఆమె ఒలంపిక్స్ లో ఒక మెడల్ కొట్టేసరికి ఫ్యాన్స్ పెరిగిపోయారు.. రెండో మెడల్ కూడా సాధించేసరికి చాలామంది లవర్స్ అయిపోయారు.. మాటా మంతీ సాగించడం ఆలస్యం.. సాటి ఒలింపియన్ తో ముడిపెట్టేశారు.. అదేమీ లేదని తేలినా.. ఆమె స్వదేశానికి చేరినా.. ఆమెపై కథనాలు, ఊహాగానాలు మాత్రం ఆగలేదు.

మళ్లీ గురి ఎప్పుడో?

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో రెండు పతకాలు సాధించింది హరియాణాకు చెందిన మను బాకర్. రికార్డుల్లోకి ఎక్కిన ఆమె అప్పటినుంచి దేశంలో షూటింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. ఇప్పటికీ ఆ క్రేజ్ ను మను ఆస్వాదిస్తోంది. అయితే, పారిస్ ఒలింపిక్స్ తర్వాత మను మళ్లీ షూటింగ్ లోకి దిగలేదు. ఆమె ఎక్కడకు వెళ్లినా ఇదే ప్రశ్న ఎదురయ్యేది. ప్రస్తుతం మను బాకర్ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తోంది. ఇష్టమైన ఆహారం తింటూ నచ్చినట్లుగా గడుపుతోంది. షూటింగ్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ పోటీలలోనూ పాల్గొనలేదు. ఈ నేపథ్యంలోనే మను మళ్లీ తుపాకీ పడుతుందా? అనే సందేహాలు వచ్చాయి.

పతకం గెలిచినా పాత జీవితమే..

ఒలింపిక్ పతకం గెలిచాక తన జీవితంలో వచ్చిన మార్పు ఏమిటని చాలామంది అడుగుతున్నారని మను తెలిపింది. అయితే.. అప్పటికి, ఇప్పటికి ఏమీ మారలేదని.. తను పాత మనునే అని స్పష్టం చేసింది. ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. వచ్చే నెల నుంచి మళ్లీ షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతానని స్పష్టం చేసింది.

నేను నేషనల్ క్రష్ నే కానీ..

మను బాకర్ షూటర్ గా ఎంతటి మేటి క్రీడాకారిణో అందరికీ తెలిసిందే. ఒలింపిక్స్ మెడల్ గెలిచాక ఆ క్రేజ్ మరింత పెరిగింది. దీంతోనే నేషనల్ క్రష్ గా పిలవడం మొదలుపెట్టారు. కానీ.. దీనిని కొట్టి పారేస్తోంది మను. నేషనల్ క్రష్ అనేది ఒక దశ మాత్రమేనని పేర్కొంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ బిరుదు మారుతుంటుందని తెలిపింది. ఎప్పటికప్పుడు కొత్త నేషనల్ క్రష్ వస్తుంటారని.. ఒలింపిక్ పతకాలు గెలిచాక కూడా తన జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పుకొచ్చింది. ఒలింపిక్స్ పతకాలు సాధించడంతో అందరూ తనవైపే చూస్తున్నారని, మరిన్ని పతకాలను ఆశిస్తున్నారని వివరించింది.