Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ కు ఎంపికవని ఆటగాడే మ్యాచ్ విన్నరయ్యాడు..

సొంత దేశంపై అదరగొట్టి ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్ మన్ మార్నస్ లబుషేన్ సొంత దేశం దక్షిణాఫ్రికా.

By:  Tupaki Desk   |   8 Sep 2023 2:30 PM GMT
ప్రపంచ కప్ కు ఎంపికవని ఆటగాడే మ్యాచ్ విన్నరయ్యాడు..
X

క్రికెట్ అంటేనే విచిత్రమైన గేమ్. ఈ రోజు సెంచరీ కొట్టిన ఆటగాడు రేపు డకౌటవుతాడు. నిన్న తీవ్రంగా విఫలమైన వాడు మరో మ్యాచ్ లో హీరోగా మారతాడు. జెంటిల్ మన్ గేమ్ లో ఎన్నో మలుపులు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే.. త్వరలో జరగబోయే ప్రపంచ కప్ గురించి. సరిగ్గా 27 రోజుల్లో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ కప్ కోసం అన్ని జట్లూ తమ 15 మంది సభ్యుల పేర్లను ప్రకటించేశాయి. ఇందులో మార్పు చేర్పులకు ఈ నెల 28 వరకు సమయం ఉంది.

సరిగ్గా ఏడాది కిందటి వరకు ఆ ఆటగాడు మేటి బ్యాట్స్ మన్ అవుతాడని అనుకున్నారు. టెస్టుల్లో దుమ్మురేపిన అతడు వన్డేల్లోనూ గొప్ప ప్లేయర్ గా నిలుస్తాడని భావించారు. కానీ, క్రికెట్ కదా..? అన్నీ అనుకున్నట్లు నడవవు. కాలం కలసిరాక ఫామ్ కోల్పోవడంతో ఆ ఆటగాడు వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ప్రపంచ కప్ 17 మంది ప్రాబబుల్స్ కు ఎంపికవలేదు.

సొంత దేశంపై అదరగొట్టి ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్ మన్ మార్నస్ లబుషేన్ సొంత దేశం దక్షిణాఫ్రికా. వారి కుటుంబం ఆస్ట్రేలియాకు వెళ్లి స్థిరపడింది. లబుషేన్ అక్కడే పెరిగి క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. 2018లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ ఏడాది ఇంగ్లండ్ తో జరిగిన యాషెస్ సిరీస్ తో జట్టులో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నాడు.

కాగా, ఐదేళ్లలో లబుషేన్ టెస్టుల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2019 వన్డే ప్రపంచ కప్ లో ఆడని అతడు 2023 కప్ పై ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఇటీవల యాషెస్ సిరీస్ లో ఓటమి పాలవడంతో వన్డే ప్రపంచ కప్ జట్టులో చోటు లభించలేదు. కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది.

టి20 సిరీస్ లో 3-0తో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్ కు సంబంధించి గురువారం తొలి మ్యాచ్ జరిగింది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222కే పరిమితమైంది. కెప్టెన్‌ బవుమా (114 నాటౌట్‌; 142 బంతుల్లో 14×4, 1×6) అజేయ శతకంతో ఆదుకున్నాడు. ఛేదనలో ఆసీస్‌ కూడా తడబడింది. 113/7తో ఓటమి అంచున నిలిచింది. కామెరూన్ గ్రీన్‌ (0) స్థానంలో కంకషన్‌ సబ్‌ స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్‌ (80 నాటౌట్‌; 93 బంతుల్లో 8×4) పోరాడాడు. అగర్‌ (48 నాటౌట్‌; 69 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్‌ 40.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

అప్పుడూ కంకషన్ సబ్ గానే ఆర్చర్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ కంకషన్ కు గురికావడంతో 2018 యాషెస్ సిరీస్ లో లబుషేన్ సబ్ స్టిట్యూట్ గా వచ్చాడు. ఆ మ్యాచ్ లో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. తర్వాత టీమ్ లో పాతుకుపోయాడు. ఇప్పుడు కూడా కంకషన్ సబ్ గానే వచ్చి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. విచిత్రం ఏమంటే.. వన్డే ప్రపంచ కప్ నకు లబుషేన్ ను ఎంపిక చేయలేదు. 17 మంది ప్రాబబుల్స్ లో భారత సంతతి ఆటగాడు తన్వీర్ సంఘాకు చోటు దక్కినా లబుషేన్ ను తీసుకోలేదు.

ఆ తర్వాత 15 మంది సభ్యుల జట్టులో ఎలాగూ చోటు ఇవ్వలేదు. గాయాలతో ఉన్న స్మిత్, మ్యాక్స్ వెల్ కు అవకాశం కల్పించినా.. లబుషేన్ ను పరిగణించలేదు. అయితే, గురువారం నాటి అద్భుత ఇన్నింగ్స్ చూశాక ఆస్ట్రేలియా సెలక్టర్లు తమ నిర్ణయం సరికాదని భావిస్తారేమో? ఎందుకంటే భారత్ వంటి స్పిన్ పిచ్ లుండే దేశంలో టెక్నికల్ గా సౌండ్ అయిన లబుషేన్ అవసరం చాలా ఉంటుంది మరి..