ఐపీఎల్ లో ‘మయాంకం..’ ఒకరు కాదు నలుగురు
వారం కిందటి వరకు సాధారణ ఆటగాడిగా కూడా ఇతడు ఎవరికీ తెలియదు.
By: Tupaki Desk | 7 April 2024 1:30 PM GMTఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురూ కాదు.. నలుగురు క్రికెటర్లు ఒకే పేరుతో ఉన్న ఆటగాళ్లు.. ఒకే టోర్నీలో ఆడుతూ ఉంటే.. ఆ నలుగురూ ఒకే దేశానికి చెందినవారై ఉంటే.. ఒకరు బ్యాట్స్ మన్, మరొకరు సూపర్ పేసర్.. ఇంకొకరు ఎడమచేతి వాటం స్పిన్ ఆల్ రౌండర్, మరొకరు మిస్టరీ స్పిన్నర్ అయితే.,.? ఇదంతా చూసేందుకు కాస్త విభిన్నంగా ఉంది కదా..? ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో ఇదే జరుగుతోంది.
ఈ సూపర్ పేసర్
ప్రస్తుతం ఐపీఎల్ లో అందరి నోటా నానుతున్న పేరు మయాంక్ యాదవ్. వారం కిందటి వరకు సాధారణ ఆటగాడిగా కూడా ఇతడు ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడు ఏకంగా టీమిండియా తలుపులు తడుతున్నాడు. 156 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి భారత ఫాస్ట్ బౌలర్లలో ఈ స్థాయి వేగం కూడా ఉంటుందా? అనిపించాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్న మయాంక్ యాదవ్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు.
ఈ సన్ రైజర్స్ సీనియర్ బ్యాటర్..
మయాంక్ అనగానే మనకు తొలుత మెదిలే ప్లేయర్ మయాంక్ అగర్వాల్. కర్ణాటకకు చెందిన ఈ బ్యాట్స్ మన్ ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్నాడు. 2018లోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ, ఆ తర్వాత వెనుకబడి జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఈ మయాంక్ అగర్వాల్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతుండడం విశేషం. కాగా, 2022లో అగర్వాల్ ను పంజాబ్ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ గానూ నియమించింది. అయితే, 2023లో అనూహ్యంగా వదులుకుంది. ఇక రెండు నెలల కిందట రంజీ మ్యాచ్ ఆడేందుకు వెళ్తూ విమానంలో మంచినీళ్లనుకుని యాసిడ్ తాగిన మయాంక్ అగర్వాల్ వార్తల్లో నిలిచాడు.
హైదరాబాద్ లోనే మరో మయాంక్
లెగ్ బ్రేడ్ వేసే మయాంక్ మార్కండే.. టీమిండియాకు ఒక టి20లో ప్రాతినిధ్యం వహించిన స్పిన్నర్. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. పంజాబ్ కు చెందిన ఇతడు గతంలో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. మిస్టరీ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాగా, మయాంక్ దాగర్ అని ఢిల్లీకి చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. గతంలో సన్ రైజర్స్ కూడా ఆడడం విశేషం.