Begin typing your search above and press return to search.

గుజరాత్ వర్సెస్ లక్నో... అందరి చూపూ ఆ ఇద్దరిపైనే!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 21వ మ్యాచ్ ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోతోంది

By:  Tupaki Desk   |   7 April 2024 4:16 AM GMT
గుజరాత్ వర్సెస్ లక్నో... అందరి చూపూ ఆ ఇద్దరిపైనే!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా 21వ మ్యాచ్ ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం లక్నో లోని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఎకానా స్టేడియం సిద్ధమైంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ రెండింట గెలిచిన లక్నో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉండగా.. ఆడిన నాలుగు మ్యచ్ లలోనూ 2 గెలిచిన గుజరాత్ 7వ స్థానంలో ఉంది.

లక్నో టీం లో నికోలస్ పూరన్ ఆడిన 3 మ్యాచ్ లలోనూ 146 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉండగా.. డీకాక్ 139, కేఎల్ రాహుల్ 93 పరుగులు సాధించారు. బౌలర్లలో యువ సంచలనం మయాంక్ యాదవ్ రెండు వికెట్లు ఆడి 6 వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హుక్ 3 మ్యాచ్ లలో 4 వికెట్లు పడగొట్టాడు.

ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే... కెప్టెన్ శుభ్ మన్ గిల్ 4 మ్యాచ్ లలో 164 పరుగులు సాధించగా.. సాయి సుదర్శన్ 160 పరుగులు, డేవిడ్ మిల్లర్ మూడు మ్యాచ్ లలో 77 పరుగులు సాధించాడు. బౌలర్లలో మోహిత్ శర్మ 4 మ్యాచ్ లలో 7 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ 4 మ్యాచ్ లలో 4 వికెట్లు పడగొట్టాడు.

ఇక చివరిగా పంజాబ్ పై ఆడిన మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్స్ లో శుభ్ మన్ గిల్ 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇక బెంగళూరుతో ఆడిన చివరి మ్యాచ్ లో లక్నో బ్యాటర్స్ లో డీకాక్ 56 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇక బౌలర్లలో మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకుని వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నాడు.

దీంతో... శుభ్ మన్ వర్సెస్ మయాంక్ యాదవ్ పోరు ఎలా సాగబోతోందనేది ఆసక్తిగా మారింది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్!:

2022లో అరంగేట్రం చేసినప్పటి నుంచి లక్నో - గుజరాత్‌ లు నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌ ల్లో తలపడ్డాయి. వీటిలో గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ లలోనూ విజేతగా నిలవగా.. లక్నో ఇంకా గుజరాత్‌ పై మొదటి విజయాన్ని నమోదు చేయలేదు!

ఇక ఈ మైదానంలో జరిగిన ఎనిమిది ఐపీఎల్ మ్యాచ్ లలో.. మొదటి బ్యాటింగ్ చేసిన ఐదు జట్లు గెలిచాయి. ఇదే సమయంలో.. ఇక్కడ పేసర్లకు అవకాశాలు బాగుంటాయని చెబుతున్నారు. ఈ మైదానంలో పేసర్లు 55 వికెట్లు తీయగా.. స్పిన్నర్లు 42 వికెట్లు తీశారు. ఇక సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 154 పరుగులుగా ఉంది.