ఐపీఎల్ మెగా వేలంలో 574 మంది..బంపర్ ఆఫర్.. 2 కోట్లే స్టార్లు
ఈసారి రిటెన్షన్ లోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లు పెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్.
By: Tupaki Desk | 16 Nov 2024 2:30 PM GMTఅనేక మార్పులు.. కొత్త నిబంధనలు.. సరికొత్త విశేషాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే సీజన్ మరింత ఉత్సాహంగా సాగేందుకు మెగా వేలం జరగనుంది. అది కూడా కేవలం వారం రోజుల్లోనే ఉంది. గత సీజన్ కు మినీ వేలం జరగ్గా దాదాపు రూ.25 కోట్ల అత్యధిక ధర (ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్-కోల్ కతా) పలికిన సంగతి తెలిసిందే. ఈసారి రిటెన్షన్ లోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లు పెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్.
రిటెన్షన్ పోగా..
కొద్ది రోజుల కిందట రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి ఐపీఎల్ జట్లు. ఒక్కో జట్టు కొందరిని అట్టిపెట్టుకున్నాయి. ఇక మిగిలింది మెగా వేలం. ఈ ఏడాది మెగా వేలం నిబంధనలు మారాయి. మరోవైపు వేలం బరిలో దిగేది ఎందరు? అనే సంఖ్యపై స్పష్టత వచ్చింది. మొత్తం 574 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.
మూడో వంతు మంది
వచ్చే మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. బీసీసీఐ గతంలో వెల్లడించిన జాబితా ప్రకారం 1,574 మంది ఆటగాళ్లున్నారు. ఇప్పుడీ జాబితాను మూడో వంతుకు కుదించారు. కాగా, వీరిలోనూ 366 మంది భారత ఆటగాళ్లు. 208 మంది విదేశీ క్రికెటర్లు. ఇక ధర ప్రకారం చూస్తే.. ఇందులో 81 మంది ఆటగాళ్ల కనీస ధర రూ.2 కోట్లు.
స్టార్లూ వేలంలో..
టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు వికెట్ కీపర బ్యాటర్ రిషభ్ పంత్, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పేసర్ అర్ష్‌దీప్, షమీ, హైదరాబాదీ సిరాజ్, అవేశ్ ఖాన్, లెగ్ స్పిన్నర్ చాహల్ రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలో ఉన్నారు. విదేశీ స్టార్లలో దక్షిణాఫ్రికా పేసర్లు రబాడ, నోకియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా హిట్టర్లు బట్లర్, మ్యాక్స్‌వెల్ కూడా రూ.2 కోట్ల ధరకే వేలంలోకి రానున్నారు. ఇక రూ.కోటిన్నర కనీస ధరతో 27 మంది, రూ.1.25 కోట్లతో 18 మంది, రూ.కోటితో 23 మంది ఆటగాళ్లు మెగా వేలానికి సిద్ధమయ్యారు. ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో మెగా వేలం నిర్వహించనున్నారు.