Begin typing your search above and press return to search.

వరల్డ్‌ కప్ పై కాళ్లు.. మిచెల్ మార్ష్ షాకింగ్ రియాక్షన్!

అవును... 2023 వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ చేసిన పని ఎంత వైరల్ అయ్యిందనేది తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   1 Dec 2023 2:22 PM GMT
వరల్డ్‌ కప్ పై కాళ్లు.. మిచెల్ మార్ష్ షాకింగ్ రియాక్షన్!
X

ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ లో టీం ఇండియా పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మైదానంలో ఆసీస్‌ ఆటతీరు ఆకట్టుకున్నప్పటికీ... సంబరాల్లో భాగంగా ఆ జట్టు ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ ప్రవర్తించిన తీరు నెట్టింట విమర్శలకు దారితీసింది. ఈ సందర్భంగా ఆ వివాదంపై మార్ష్ తొలిసారి స్పందించాడు.

అవును... 2023 వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ చేసిన పని ఎంత వైరల్ అయ్యిందనేది తెలిసిన విషయమే. ఆరోసారి ఛాంపియన్లుగా నిలిచామన్న ఆనందమో.. లేక, బలుపుతో కూడిన వ్యవహారమో తెలియదు కానీ... మార్ష్ కాస్త హద్దుమీరి ప్రవర్తించాడు. ఇందులో భాగంగా.. ఓ చేత్తో బీరు బాటిల్ పట్టుకుని తన రెండు కాళ్లను వరల్డ్ కప్ ట్రోఫీ మీద ఉంచి ఫోటోకు ఫోజులిచ్చాడు.

ఈ నేపథ్యంలో ఆ ఘటన, అనంతరం జరిగిన ట్రోలింగ్ మొదలైన విషయాలపై మిచెల్ మార్ష్ తొలిసారిగా స్పందించాడు. సోషల్ మీడియాలో వివాదాస్పదమైన ఆ ఫోటో గురించి ఫస్ట్ టైం నోరు విప్పాడు. ఇందులో భాగంగా... సోషల్‌ మీడియాలో వస్తున్న ఆ ఫొటోలో ఎలాంటి అమర్యాద ప్రవర్తన కనిపించడం లేదని.. దాని గురించి తీవ్రంగా ఆలోచించాలని అనుకోవడం లేదని అన్నాడు.

ఇదే సమయంలో... ఆ ఫోటోలో ఎలాంటి అగౌరవం కనిపించలేదని.. ఆ ఫోటో వైరల్ అయ్యిందని అందరూ తనకు చెబుతున్నప్పటికీ.. తాను సోషల్ మీడియాలో దానిని పెద్దగా చూడలేదని.. మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా... అవకాశం ఉంటే మరోసారి ఇలాంటి పనిచేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా మార్ష్ స్పందించడం గమనార్హం. దీంతో... బలుపు ఇంకా తగ్గలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!

కాగా.. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్ లో టీం ఇండియాపై గెలిచి, ట్రోఫీ సాధించిన ఆనంతరం ఆసీస్‌ క్రికెటర్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూం లో మార్ష్‌.. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటోలను ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్‌ తన ఇన్‌ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. దీంతో మార్ష్‌ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదే సమయంలో... ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆక్షేపించారు. ఇదే సమయంలో భారత్‌ లో మార్ష్‌ పై కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలో... తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌ పై మిచెల్‌ మార్ష్ స్పందించాడు. అందులో తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు! దీంతో మరోసారి కీ బోర్డులకు పని చెబుతున్నారు నెటిజన్లు!