Begin typing your search above and press return to search.

ఖరీదైన సమస్య... కోల్ కతా ఫ్యాన్స్ ను వణికించేస్తున్న మిచెల్ స్టార్క్!

అవును... కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు విజయానికి చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు అవసరం పడింది.

By:  Tupaki Desk   |   22 April 2024 6:30 AM GMT
ఖరీదైన సమస్య... కోల్  కతా ఫ్యాన్స్  ను వణికించేస్తున్న మిచెల్  స్టార్క్!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. వాస్తవానికి ఈ మ్యాచ్ లో కోల్ కతా కు విక్టరీ ఈజీగానే దక్కుతుందని చాలా మంది భావించినా... చివర్లో మిచెల్ స్టార్క్ పెట్టిన టెన్షన్ అంతా ఇంతా కాదనే చెప్పాలి.

అవును... కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు విజయానికి చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు అవసరం పడింది. ఈ సమయంలో... హర్షిత్ రానా వేసిన 18 ఓవర్ రెండో బంతికి ప్రభుదేశాయ్ ఔటయ్యాడు. పైగా ఈ ఓవర్ లో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు హర్షిత్. దీంతో చివరి రెండు ఓవర్లో బెంగళూరు విజయానికి 31 పరుగులు కావాల్సి వచ్చింది.

ఈ క్రమంలో ఆండ్రూ రస్సెల్ వేసిన 19 వ ఓవర్లో దినేష్ కార్తీక్ ఒక సిక్స్, ఒక ఫోర్ సాధించి చివరి బంతిలో ఔటయ్యాడు. దీంతో 202 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన బెంగళూరుకు చివరి ఆరు బంతుల్లోనూ 21 పరుగుల అవసరం ఏర్పడింది. ఈ సమయంలో బంతిని మిచెల్ స్టార్క్ అందుకున్నాడు. దీంతో... అతని పేలవమైన పెర్ఫార్మెన్స్ తో ఇప్పటికే ఆందోళనలో ఉన్న కోల్ కతా ఫ్యాన్స్ ఒక్కసారిగా టెన్షన్ కి గురయ్యారు.

వారి టెన్షన్ ని నిజం చేస్తూ... మిచెల్ స్టార్క్ వేసిన 20 ఓవర్ మొదటి బంతికి కరన్ శర్మ సిక్స్ కొట్టగా.. బెంగళూరు ఫ్యాన్స్ లో హుషారు నెలకొంది. ఇదే సమయంలో "స్టార్క్ సమర్పయామీ" అనే కామెంట్లు వినిపించాయి. ఆ తర్వాత డాట్ బాల్ పడింది. దీంతో చివరి నాలుగు బంతుల్లో 15 పరుగులు కావాలి. ఈ సమయంలో వరుసగా రెండు సిక్స్ లు ఇచ్చాడు స్టార్క్.

దీంతో... స్టార్క్ పై తీవ్ర విమర్శలు మొదలైపోయాయి. అయితే... ఆ తర్వాత బంతికే కరన్ శర్మ ఔటవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు కోల్ కతా ఫ్యాన్స్. ఈ సమయంలో చివరి బంతికి బెంగళూరు విజయానికి 3 పరుగులు కావాలి. ఈ సమయంలో చివరి బంతికి రెండో పరుగుకు రనౌట్ అవ్వడంతో సూపర్ ఓవర్ అవసరం లేకుండానే కోల్ కతా విజయం సాధించింది.

ఈ విజయం సంగతి కాసేపు పక్కనపెడితే... మిచెల్ స్టార్క్ పెర్ఫార్మెన్స్ పై మాత్రం తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఆ చివరి బంతికి కూడా ఫోర్ వచ్చి ఉంటే... పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అప్పటికే టెయిల్ ఎండర్స్ బ్యాటింగ్ చేయడంతో ఆ ప్రమాదం కాస్త తప్పిందనే చెప్పాలి. ఈ సమయంలో చివర్లో అతడికి లాస్ట్ ఓవర్ ఇవ్వడంపై శ్రేయస్ పైనా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

అలా అని ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు 25 కోట్ల విలువైన ఈ అత్యంత ఖరీదైన ఆటగాడు ఈ సీజన్ మొత్తంలో ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయలేదనే చెప్పాలి. ఈ క్రమంలో సన్ రైజర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో వికెట్లేమీ తీయకుండా 53 పరుగులు సమర్పించుకున్న స్టార్క్.. తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు ఇచ్చాడు.

ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. అతడు గెలిపించకపోయినా పర్లేదు కానీ.. చేజేతులా ఓటమికి సహకరిస్తున్నాడనే కామెంట్లు మొదలయ్యాయి! ఈ సమయంలో ఢిల్లీపై మాత్రం 2/25 నమోదు చేసిన స్టార్క్.. చెన్నైపై 0/29 నమోదు చేశాడు. ఆ తర్వాత లక్నోతో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు మాత్రం తీసి 28 పరుగులు ఇచ్చిన స్టార్క్... రాజస్థాన్ పైనా వికెట్లేమీ తీయకుండా 50 పరుగులు ఇచ్చుకున్నాడు.

ఇక తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఒక వికెట్ తీసి.. కోల్ కతా ఫ్యాన్స్ ను తీవ్రంగా టెన్షన్ పెట్టి 55 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇప్పుడు కోల్ కతాకు ఉన్న ఇంటర్నల్ సమస్యల్లో ప్రప్రథమంగా నిలిచాడు ఈ ఖరీదైన ఆటగాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.!