ఐపీఎల్ బాల్ ఆఫ్ ద టోర్నీ.. పాతిక కోట్ల ప్లేయర్.. ఇదీ అతడి పవర్
ఆ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ అయితే అద్భుత ఫామ్ లో ఉన్నాడు.
By: Tupaki Desk | 27 May 2024 5:44 AM GMTఅది 2015 వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. అద్భుతమైన ఆటతో తుది సమరానికి దూసుకొచ్చింది న్యూజిలాండ్. ఆ జట్టు కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ అయితే అద్భుత ఫామ్ లో ఉన్నాడు. అతడి దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే ఇక అంతే. అయితే, అదేమీ జరగకుండా చేశాడు ఓ బౌలర్. ఫైనల్ మ్యాచ్ ఇలా మొదలైందో లేదో.. ప్రేక్షకులు సీట్లలో కూర్చోకముందే.. మెకల్లమ్ ను అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు ఆ పేసర్. ఆ ప్రపంచ కప్ కే అది ‘బాల్ ఆఫ్ ద టోర్నీ’.
ఇది 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్. దూకుడైన ఆటతో ఫైనల్ కు దూసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఆ జట్టు ఓపెనర్ల పేర్లు వింటేనే బౌలర్లు భయపడిపోయే పరిస్థితి. కానీ, ఆ పేసర్ అత్యద్భుత డెలివరీతో ఓపెనర్ వికెట్లను గిరాటేశాడు. ఇది కూడా ‘‘బాల్ ఆఫ్ ద టోర్నీ’’.
పైన రెండు సందర్భాల్లో చెప్పుకొన్నది ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గురించి. ఐపీఎల్ లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు స్టార్క్. గత డిసెంబరులో జరిగిన వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ అతడిని రూ. రూ.24.75 కోట్లకు కొనుక్కుంది. అయితే, ఈ సీజన్ మొదట్లో స్టార్క్ అంచనాలను అందుకోలేకపోయాడు.
ప్రపంచ కప్ లో అదరగొట్టి
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో స్టార్క్ అదరగొట్టాడు. ఓపెనర్ గిల్ సహా మూడు వికెట్లు తీశాడు. అయితే, స్టార్క్ ఈ ఐపీఎల్ సీజన్ లో తొలుత విఫలం కావడంలో కాస్త అర్థం ఉంది. అతడు టెస్టులు, వన్డేలు, టి20లు అన్నీ ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్ లో ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి అడుగుపెట్టాడు. చివరిగా 2016లో బెంగళూరుకు ఆడాడు. దీంతోనే కుదురుకోవడాని కాస్త సమయం తీసుకున్నాడు. తొలి 9 మ్యాచ్ లలో ఏడు వికెట్లే తీశాడు. ఈ నేపథ్యంలో తీవ్రంగా ఎగతాళి చేశారు. వందల కొద్దీ పరుగులు ఇస్తుండడంతో అతడికి పెట్టిన డబ్బుతో దానిని పోల్చారు.
పెద్ద మ్యాచ్ లంటే చెలరేగుతాడు
స్టార్క్ పొడగరి. ఐపీఎల్ లో భారత పిచ్ లు అలవాటయ్యేందుకు అతడికి టైం పట్టింది. ఒక్కసారి గాడిలో పడ్డాక ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. తనపై వచ్చిన విమర్శలకు గట్టిగా బదులిస్తూ చెలరేగిపోయాడు. ఇక తీవ్ర ఒత్తిడి ఉండే కీలక మ్యాచ్ లలో స్టార్క్ మరింత అద్భుత ప్రదర్శన చేస్తాడు. క్వాలిఫయర్ 1లో సన్ రైజర్స్ ను 3 వికెట్లతో దెబ్బకొట్టాడు. ఫైనల్లోనూ కీలకమైన అభిషేక్, త్రిపాఠి వికెట్లు తీసి ప్రత్యర్థికి చెక్ పెట్టాడు.
భార్య కూడా భారత లీగ్ ప్లేయరే
ఈ ఐపీఎల్ సీజన్ కు ముందు మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ భారత్ ఆతిథ్యం ఇచ్చిన వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆడింది. యూపీ వారియర్స్ కెప్టెన్ ఈమెనే. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అలీసా హీలీ.. ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ సోదరుడి కుమార్తె.