Begin typing your search above and press return to search.

క్రికెట్ వదులుకోమన్నారు.. సంబంధాలే వదిలేసుకున్నా.. మిథాలీ

భారత మహిళల క్రికెట్ ను మిథాలీని వేరు చేసి చూడలేం. ఎందుకంటే.. అసలు ఆమెతోనే భారత క్రికెట్ కు పేరొచ్చింది.

By:  Tupaki Desk   |   4 Dec 2024 6:30 PM GMT
క్రికెట్ వదులుకోమన్నారు.. సంబంధాలే వదిలేసుకున్నా.. మిథాలీ
X

భారత్ లో మహిళల క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆమె. ఇప్పుడు అమ్మాయిలంతా బ్యాట్ బాల్ పడుతున్నారంటే.. ఆమెనే స్ఫూర్తి.. పైగా తెలుగు నేల నుంచి అలాంటి క్రికెటర్ వస్తుందని ఎవరూ ఊహించరు. అలాంటిది ఏకంగా రెండు దశాబ్దాలు దేశానికి ఆడింది. లేడీ సచిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆమెనే మిథాలీ రాజ్. ఈమె ఫ్యామిలీకి నార్త్ ఇండియా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. మిథాలీ మాత్రం పక్కా హైదరాబాదీ.

2 దశాబ్దాల ప్రయాణంలో..

భారత మహిళల క్రికెట్ ను మిథాలీని వేరు చేసి చూడలేం. ఎందుకంటే.. అసలు ఆమెతోనే భారత క్రికెట్ కు పేరొచ్చింది. టి20లు, వన్డేలు, టెస్టులు మూడు ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ అంటే ఓ దశలో మిథాలీనే. రెండు దశాబ్దాల పాటు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ లేడీస్ క్రికెట్ గా నిలిచిన మిథాలీ.. దాదాపు రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది.

వివాహ బంధం ఎప్పుడు?

మిథాలీకి ప్రొఫెషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వెంటనే అందరూ భావించింది ఆమె వివాహం చేసుకుంటారని.. కానీ, రెండేళ్లయినా ఆ కబురు రాలేదు. దీనిపై తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మిథాలీ మాట్లాడింది. ప్రొఫెషనల్ క్రికెట్ లో ఉన్నప్పుడే తనకు ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయని, అమ్మ తరఫు బంధువుల ఒత్తిడితో కొన్నిపెళ్లిచూపులకు వెళ్లినట్లు చెప్పింది. అయితే, అబ్బాయిలు.. పరిచయం పూర్తయిన వెంటనే.. ఎంతమంది పిల్లలు కావాలి? అని అడిగేవారని మిథాలీ చెప్పుకొచ్చింది.

నా ఆలోచనలన్నీ క్రికెట్ గురించే

పెళ్లి చూపుల్లో అబ్బాయిలు పిల్లల గురించి అడిగితే.. తన ఆలోచనలు మాత్రం పూర్తిగా క్రికెట్ చుట్టూనే తిరిగేవని మిథాలీ చెప్పింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న తాను ఇలాంటి ప్రశ్నలు ఊహించలేదని.. ఎవరితోనూ దీని గురించి చర్చించకపోవడంతో ఇబ్బంది పడ్డానని వివరించింది.

ఓ సారి పెళ్లిచూపులకు వచ్చిన యువకడు వివాహం తర్వాత పిల్లలను చూసుకోవడానికి పరిమితం కావాలని కోరాడని.. మరికొన్నిసార్లు అత్తగారికి సేవలు చేస్తావా? ఇంకా క్రికెట్ ఆడతావా? ఏది కావాలో తేల్చుకో? అని ఇంకొందరు అడిగారని మిథాలీ తెలిపింది.

దీంతో క్రికెట్ కే ప్రాధాన్యం ఇస్తూ అలాంటి సంబంధాలకు తాను నో చెప్పానని మిథాలీ పేర్కొంది. ఓ అమ్మాయిగా ఇలా వ్యవహరించడం సరికాదని స్నేహితులు సూచించినా, తాను వెనక్కు తగ్గలేదని స్పష్టం చేసింది. ‘కొంత సర్దుకుపో. లేదంటే నీకు పెళ్లికాదు’ అని క్రికెట్ స్నేహితులు చెప్పి చూశారని..తన కెరీర్‌ కోసం అమ్మానాన్న ఎంతో త్యాగం చేశారని, తానూ ఎన్నో వదులుకున్నాని.. వచ్చే ఎవరో ఒక వ్యక్తి కోసం ఇదంతా పక్కనబెట్టాలా? అనిపించి తన ధోరణి మార్చుకోనని చెప్పేసినట్లు మిథాలీ తెలిపింది.