Begin typing your search above and press return to search.

నోటిని అదుపులో పెట్టుకుని.. 9 కిలోలు తగ్గి.. షమీ ఫిటెనెస్ మంత్ర!

2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో సంచలనం మొహమ్మద్ షమీ. ఫామ్ కాస్త అటుఇటుగా ఉండడంతో అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు.

By:  Tupaki Desk   |   22 Feb 2025 10:30 PM GMT
నోటిని అదుపులో పెట్టుకుని.. 9 కిలోలు తగ్గి.. షమీ ఫిటెనెస్ మంత్ర!
X

2023లో భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో సంచలనం మొహమ్మద్ షమీ. ఫామ్ కాస్త అటుఇటుగా ఉండడంతో అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు. శార్దూల్ ఠాకూర్ కు అవకాశం ఇచ్చారు. శార్దూల్ రాణించకపోవడంతో షమీని తీసుకున్నారు. ఇక అక్కడినుంచి అతడు చెలరేగాడు. అయితే, అనూహ్యంగా గాయంతో ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత దూరమయ్యాడు. 15 నెలల అనంతరం ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.

మటన్ అంటే మహా ఇష్టం

షమీ మాంసాహారి. అందులోనూ మటన్ అంటే మహా ఇష్టం. అయితే, క్రికెట్ తో పాటు, గాయం కారణంగా అతడు ఆహార అలవాట్లను చాలావరకు కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రపంచ కప్ ఫైన‌ల్ అనంత‌రం చీలమండ‌ గాయానికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో చాలాకాలం పాటు ఫిట్‌ నెస్ కోసం శ్ర‌మించాడు. ఏడాది విరామం తర్వాత దేశ‌వాళీ క్రికెట్‌ లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌ తో సిరీస్‌ తో పాటు ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ట్టులోకి వ‌చ్చాడు.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శన చేయడంతో పాటు 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ త‌రువాత ష‌మీని టీమ్ ఇండియా మాజీ ఆట‌గాడు న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఇంటర్వ్యూ చేశాడు. ఫిట్‌ నెస్ ప్ర‌యాణం గురించి అందులో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇటీవలి కాలంలో 9 కిలోల బ‌రువు త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించాడు.

షమీ.. బిర్యానీ తిన‌డం లేదా? అంటూ సిద్ధూ అడగ్గా.. జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నప్పుడు 90 కిలోల బరువు ఉన్నట్లు చెప్పాడు. కోలుకుంటున్న‌ప్పుడు ఆహార‌ అల‌వాట్ల‌ను నియంత్రించుకోవడం స‌వాల్‌తో కూడుకున్న‌దని తెలిపాడు. అయినప్పటికీ త‌న‌కు రుచిక‌ర‌మైన ఆహారం తినాల‌నే కోరిక ఏమీ లేద‌న్నాడు. అలాగే స్వీట్లు కూడా ఎక్కువ‌గా తిన‌నని చెప్పాడు. బిర్యానీ గురించి బెంగ ఉండేదన్నాడు. చీట్ మీల్స్ తో అది పెద్ద స‌మ‌స్య కాలేదని తెలిపాడు.

2015 నుంచి ఒక పూట మాత్ర‌మే భోజ‌నం చేస్తున్నాన‌ని ష‌మీ తెలిపాడు. అదికూడా రాత్రిపూట మాత్ర‌మే తింటున్నట్లు వెల్ల‌డించాడు. ఇది కష్టమైనప్పటికీ ఒక్క‌సారి అల‌వాటైతే సులువు అవుతుందన్నాడు.