టీమ్ ఇండియాలో హైదరాబాదీ పేసర్ కు డేంజర్ బెల్..
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలకు ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో చెప్పుకోదగ్గ అంశం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం.
By: Tupaki Desk | 19 Jan 2025 8:30 PM GMTఇంగ్లండ్ తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీలకు ఎంపిక చేసిన భారత క్రికెట్ జట్టులో చెప్పుకోదగ్గ అంశం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం. 2017లో టి20లు, 2019లో వన్డేలు, 2020లో టెస్టు జట్టులోకి వచ్చిన సిరాజ్ కు ఇప్పటివరకు వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. నిలకడగా రాణిస్తుండడంతో అటు సెలక్షన్ కమిటీ కూడా మూడు ఫార్మాట్లలో ఆడించింది. కాగా, ఇప్పుడు మాత్రం సిరాజ్ కు డేంజర్ బెల్ మోగింది.
తొలిసారి వేటు?
గత ఏడేనిమిదేళ్లలో సిరాజ్ ఒకటీ రెండుసార్లు టీమ్ ఇండియాకు దూరమైనా అది అతడికి విశ్రాంతి ఇవ్వడమే. నేరుగా మాత్రం వేటు వేయలేదు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్, చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం అంటే మాత్రం వేటు వేసినట్లుగానే లెక్క. పైగా సిరాజ్ స్థానంలో ఎడమచేతి వాటం పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను తీసుకున్నారు. ఇది ఒక రకంగా హైదరాబాదీకి హెచ్చరికనే. సిరాజ్ 2023 నుంచి 28 మ్యాచ్ లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 5.41. ఇది మంచి ఎకానమీనే.
పాత బంతితో పడగొట్టలేక..
సిరాజ్ కొత్త బంతితో మాత్రమే వికెట్లు తీస్తున్నాడని, పాత బంతితో తేలిపోతున్నాడని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అందుకనే వన్డేలకు పక్కనపెట్టినట్లు చెప్పాడు. టి20లతో పాటు, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో రాణించడం, ఎడమ చేతివాటం కావడంతో అర్షదీప్ కు అవకాశం దక్కింది.
ఇక షమీ తిరిగిరావడమూ సిరాజ్ స్థానానికి ఎసరు తెచ్చింది. షమీ కొత్త బంతితో చెలరేగుతాడు. అర్షదీప్ పాత బంతితో రాణించగలడు. అందుకనే సిరాజ్ ను ఎంపిక చేయలేదని రోహిత్ వివరణ ఇచ్చాడు.
ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితుల్లో సిరాజ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దీనికోసం రంజీలు ఆడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.