Begin typing your search above and press return to search.

టీమిండియా ప్రముఖ క్రికెటర్ కు మాజీ క్రికెటర్ కోటిన్నర టోకరా..

క్రికెట్ ను వదిలేసి మోసాలను ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. మైదానాన్ని వీడి అడ్డదారులు తొక్కాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రముఖ క్రికెటర్ కు రూ.కోటిన్నరకు పైగా టోకరా వేశాడు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 6:25 AM GMT
టీమిండియా ప్రముఖ క్రికెటర్ కు మాజీ క్రికెటర్ కోటిన్నర టోకరా..
X

అతడు అండర్ 19 స్థాయిలో రాష్ట్ర జట్టుకు ఆడాడు. ఇంకాస్త కష్టపడి ఉంటే రంజీల్లోకి వచ్చేవాడే.. ఆపై లక్ ఉంటే ఐపీఎల్ .. మరింత కాలం కలిసి వస్తే టీమిండియా తలుపుతట్టేవాడే. కానీ, లగ్జరీ లైఫ్‌ స్టయిల్ పట్ల ఆశపడ్డాడు. క్రికెట్ ను వదిలేసి మోసాలను ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. మైదానాన్ని వీడి అడ్డదారులు తొక్కాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రముఖ క్రికెటర్ కు రూ.కోటిన్నరకు పైగా టోకరా వేశాడు. తీరా చూస్తే అతడి వయసు 25 మాత్రమే. పాతికేళ్లకే ఆరితేరిన ఆర్థిక మోసగాడిగా మారిన హరియాణా మాజీ క్రికెటర్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు పట్టుబడ్డాడు.

ఢిల్లీ శివారులో ఉండే హరియాణ పట్టణం ఫరీదాబాద్ కు చెందిన మృణాంక్‌ సింగ్‌ ఆ రాష్ట్ర జట్టుకు అండర్ 19 వరకు ఆడాడు. ఆ తర్వాత మోసాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఖరీదైన జీవితం అతడి కల. వాస్తవానికి క్రికెటర్ గా కాస్త శ్రమించి ఉంటే ఆ కలను నెరవేర్చుకునేవాడే. కానీ, తప్పుడు మార్గంలో పొందాలనుకున్నాడు. ఐపీఎస్‌ అధికారినని, ఐపీఎల్‌ లో ముంబై జట్టు ప్లేయర్ నని చెప్పుకొంటూ మోసాలకు పాల్పడ్డాడు. లగ్జరీ హోటళ్లకు రూ.లక్షల్లో టోకరా వేశాడు. 2014-18 వరకు ముంబై జట్టుకు ఆడానంటూ పలువురు మహిళలు, అంతర్జాతీయ బ్రాండ్లను మోసం చేశాడు. ఇక 2022లో వారం పాటు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లో బస చేశాడు. పెద్ద క్రికెటర్‌ నంటూ పరిచయం చేసుకున్నాడు. హోటల్‌ బిల్లు రూ.5.53 లక్షలు చెల్లించకుండానే వెళ్లిపోయాడు. స్పాన్సర్‌ కంపెనీ చెల్లిస్తుందని చెప్పాడు. తర్వాత హోటల్ సిబ్బంది బ్యాంకు వివరాలను షేర్‌ చేయగా రూ.2 లక్షలు బదిలీ చేసినట్లు నకిలీ లావాదేవీ వివరాలను పంపించాడు. మోసపోయామని గ్రహించిన హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిరుడు ఆగస్టులో ఢిల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ ఇచ్చారు.

సోమవారం హాంకాంగ్‌కు వెళ్లేందుకు మృణాంక్‌ ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు రాగా.. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 25 ఏళ్ల వయసు వాడైనప్పటికీ సీనియర్‌ ఐపీఎస్‌ నంటూ బోల్తా కొట్టించబోయాడు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణంలో కర్ణాటక ఏడీజీపీ అధికారినంటూ హోటళ్లు, రిసార్టులను మృణాంక్‌ మోసం చేసినట్లు తెలిసింది.

పంత్ కూడా బాధితుడే..

లగ్జరీ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నానని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌, టీమిండియా క్రికెటర్ రిషభ్‌ పంత్‌ ను కూడా మృణాంక్‌ మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2020-21 మధ్య పంత్ నుంచి రూ.1.63 కోట్లు కాజేసినట్లు తెలిసింది. నిరుడు పంత్‌ అతడిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.