ధోనీ రెండేళ్లుగా దండగ.. రిటైర్ కావాల్సింది..: మాజీ క్రికెటర్, మంత్రి
ధోనీ బ్యాటింగ్ తీరు చెన్నై జట్టుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. దోంతోనే టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్ మన్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
By: Tupaki Desk | 6 April 2025 10:25 AMటీమ్ ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా ఎంత కాలం క్రికెట్ లో కొనసాగుతాడు..? శనివారం నాటి మ్యాచ్ లోనే వీడ్కోలు చెప్పేస్తాడని భావించినా, అతడి తల్లిదండ్రులు సైతం స్టేడియానికి వచ్చినా.. చెన్నై జట్టు మరోసారి ఓడిపోయినా ధోనీ మాత్రం ఆటను వీడడం లేదు. వికెట్ కీపింగ్ లో మెరుగ్గానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ లో టెయిలెండర్ కంటే ఘోరం అనే చెప్పాలి. శనివారం 26 బంతుల్లో 30 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఫోర్, ఒకే సిక్స్.. వాస్తవానికి ఈ మ్యాచ్ లో చెన్నై 25 పరుగుల తేడాతో ఓడింది. ధోనీ గనుక 26 బంతుల్లో 55 పరుగులు చేసి ఉంటే గెలిచేదేమో?
ధోనీ బ్యాటింగ్ తీరు చెన్నై జట్టుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. దోంతోనే టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్ మన్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోనీ రెండేళ్ల కిందటే అంటే 2023లోనే రిటైర్ కావాల్సిందని వ్యాఖ్యానించాడు. అప్పుడు అయితే అతడికి ఘనంగా వీడ్కోలు లభించి ఉండేదని పేర్కొన్నాడు.
తివారీ మాటల ప్రకారం చూస్తే ధోనీ జట్టుకు భారంగా మారానేది అతడి అభిప్రాయంగా కనిపిస్తోంది. ధోనీ బ్యాటింగ్ చెన్నై వీరాభిమానులకే నచ్చడం లేదన్నాడు. 2023లోనే రిటైర్ అయి ఉంటే ఘనంగా వీడ్కోలు దక్కదేమోనని మనోజ్ తివారీ పేర్కొన్నాడు.
తివారీ పశ్చిమ బెంగాల్ కు చెందినవాడు. ధోనీ సారథ్యంలోనే టీమ్ ఇండియాకు ఆడాడు. దేశవాళీల్లో అద్భుతంగా రాణించినా టీమ్ ఇండియా తరఫున అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. కొన్ని మ్యాచ్ లలో రాణించినా తర్వాత జట్టుకు దూరమయ్యాడు.
ఆపై రాజకీయాలు-క్రికెట్ రెండు పడవల ప్రయాణం చేసిన మనోజ్ తివారీ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశాడు. రెండేళ్ల కిందట రిటైర్మెంట్ ప్రకటించాడు. తరచూ తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు.