నిలువునా చీలిన ఐపీఎల్ రికార్డు చాంపియన్.. తెలుగోడిపై నిందలు
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్.
By: Tupaki Desk | 9 May 2024 11:30 PM GMT12 మ్యాచ్ లలో నాలుగే విజయాలు.. ఐపీఎల్ లీగ్ దశలో మొదట ఎలిమినేట్ అయిన జట్టు అదే.. ఇంకా 13 మ్యాచ్ లు ఉండగా.. ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. 9 జట్లూ రేసులో ఉన్నాయి. కానీ, ఐదుసార్లు చాంపియన్ అయిన ఆ జట్టు మాత్రం ఇప్పటికే ఇంటిముఖం పట్టింది అంటే దాని ప్రదర్శన ఎలా ఉందో తెలిసిపోతోంది. అలాంటి టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో జరుగుతోంది అనే అభిప్రాయాలు వస్తున్నాయి. వరుస ఓటముల నేపథ్యంలో ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే.. ఆ జట్టు వచ్చే సీజన్ కు సమూలంగా ప్రక్షాళన కావడం ఖాయం అని తెలుస్తోంది.
కెప్టెన్ మారాడు.. కానీ అలవాటు పడలే..
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పదేళ్లు కెప్టెన్ గా కొనసాగి 5 టైటిళ్లు కూడా అందించిన రోహిత్ ను కాదని ఈ ఏడాది అనూహ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకొచ్చి మరీ సారథిని చేశారు. ఈ ప్రయోగం తీవ్రంగా వికటించినట్లు స్పష్టం అవుతోంది. సీనియర్లు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, హార్దిక్ కెప్టెన్సీ లో ఎదురవుతున్న ఇబ్బందులను ఆటగాళ్లు కోచింగ్ సిబ్బందికి చెప్పారని ఇంగ్లిష్ మీడియా పేర్కొంటోంది.
ఇక్కడినుంచి వెళ్లినవాడే..
2021 వరకు హార్దిక్ ముంబైకి ఆడినవాడే. అక్కడినుంచే 2015-16లో జాతీయ జట్టుకూ ఎంపికయ్యాడు. కానీ, హార్దిక్ గతంలో ముంబైకి ప్లేయర్ మాత్రమే. ఇప్పుడు కెప్టెన్. అప్పటికి, ఇప్పటికి జట్టు చాలా మారింది. పొలార్డ్, మలింగ తదితర స్టార్లు లేరు. ఇక కెప్టెన్ గా
హార్దిక్ శైలికి ముంబై అలవాటు పడలేదని, డ్రెస్సింగ్ రూమ్‌లో గడబిడకు ఇదే కారణమని సీనియర్లు.. కోచింగ్ బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది.
తిలక్ ను తప్పుబట్టి విలువ తగ్గించుకుని..
మ్యాచ్ ముగిశాక కెప్టెన్లు.. జట్టు ఓటమిపై ప్రత్యేకించి ఆటగాళ్లను తప్పబట్టరు. జూనియర్లను అయితే మరీ వెనకేసుకొస్తారు. కానీ, హార్దిక్ మాత్రం హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మను నేరుగా తప్పుబట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ పై తిలక్ ఎదురుదాడి చేయకపోవడమే తమ ఓటమికి కారణమని వ్యాఖ్యానించాడు.
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో తిలక్ 32 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. హార్దిక్ రాణించిందే లేదు. అయినా ఓటమి మొత్తాన్ని తనపై మోపడంతో తిలక్ నొచ్చుకున్నాడని సమాచారం. దీనిపై డ్రెస్సింగ్ రూమ్‌లో హార్దిక్ ను అడిగినట్లు, ఇద్దరి మధ్య వాగ్వాదం సాగినట్లు ప్రచారం జరిగింది. కాగా, ముంబయి జట్టుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఆట చూస్తుంటే జట్టు రెండు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తోందన్నాడు.