Begin typing your search above and press return to search.

బాయ్ కాట్ జియో... ముంబై ఇండియన్స్ కి రోహిత్ ఎఫెక్ట్!

ముంబై ఇండియన్స్‌ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది

By:  Tupaki Desk   |   17 Dec 2023 6:10 AM GMT
బాయ్ కాట్ జియో... ముంబై ఇండియన్స్ కి రోహిత్ ఎఫెక్ట్!
X

ముంబై ఇండియన్స్‌ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది. గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా ఉన్న హార్దిక్‌ ను భారీ మొత్తం వెచ్చించి మరీ ముంబై ఇండియన్స్ టీం దక్కించుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ రోహిత్ ని ఎలా తప్పించగలిగింది అనే చర్చ ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తుంది.

ఈ సమయంలో తమ అభిమాన హిట్‌ మ్యాన్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడంపై అతడి ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ శర్మ లేని ముంబై ఇండియన్స్‌ టీం ని ఊహించలేమని సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్‌ ను అన్‌ ఫాలో చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అటు ఎక్స్ లోనూ, ఇటు ఇన్ స్టాలోనూ సుమారు నాలుగు లక్షల మందికిపైగా నెటిజన్లు అన్ ఫాలో చేయడం చర్చనీయాంశం అయ్యింది.

టీ20 ఫార్మాట్‌ కు కావాల్సిన దూకుడు రోహిత్ శర్మ సొంతమని.. అసలు అతడిని ముంబై ఇండియన్స్ ఎలా వదులుకుంటుందని ఆన్ లైన్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడే రోహిత్‌ ను.. ప్రపంచ క్రికెట్‌ లో అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్‌ ను ఎలా తప్పిస్తారంటూ తెగ కోప్పడిపోతున్నారు. మరికొందరు శాపనార్థాలు పెడుతున్నారు. ఈ సమయంలో ఆ ఎఫెక్ట్ జియోకి కూడా తగలడం గమనార్హం.

అవును.. ముంబై ఇండియన్స్ టీంని ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై అతడి ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈ సమయంలో ఆ కోపాన్ని జియోపైనా చూపిస్తూ అంబానీకి పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు. ఇందులో భాగంగా... జియో సిం లను విరగగొట్టి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివర నిలుస్తుందని, రిప్ ముంబై ఇండియన్స్ అని శాపనార్థాలు పెడుతున్నారు.

కాగా... ముంబై ఇండియన్స్‌ కి కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించడంతో ముంబై ఇండియన్స్ కు అటు ఎక్స్ (ట్విట్టర్) లోనూ, ఇటు ఇన్ స్టా లోనూ అన్ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రోహిత్ శర్మ కెప్టెన్‌ గా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ కి ఎక్స్‌ లో 8.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 8.2 మిలియన్లకు పడిపోయింది.

ఇదే సమయంలో ఇన్‌ స్టాలో 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 12.7 మిలియన్లకు చేరింది. దీంతో ఇదంతా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోపానికి సూచిక అని అంటున్నారు పరిశీలకులు. సో... ఈ ఎఫెక్ట్ మైదానంలో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది వేచి చూడాలి!