స్పెయిన్ బుల్ శకాంతం.. మళ్లీ పుడతాడా అలాంటివాడు?
అందుకే మళ్లీ పుడతాడా అలాంటివాడు? అనే ప్రశ్న వస్తోంది.
By: Tupaki Desk | 20 Nov 2024 8:23 AM GMT20 ఏళ్లు.. 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు.. మరీ ముఖ్యంగా మట్టి కోర్టు మహారాజు.. ఆటలో ఎంత దూకుడో.. మైదానం బయట అంత మంచి మనిషి.. కెరీర్ ఆసాంతం దిగ్గజాలతో ఆడుతూ 20 పైగా టైటిల్స్ కొట్టిన ఘనత.. 14 టైటిళ్లు కేవలం అత్యంత కఠినమైన ఫ్రెంచ్ ఓపెన్ వే అంటే మామూలు మాటలు కాదు.. ఇప్పుడు తెలిసే ఉంటుంది. ఇదంతా ఎవరి గురించో..? అలాంటి ఆటగాడు ఇక ఆట ముగించాడు.. మళ్లీ మైదానంలో కనిపించడు. అందుకే మళ్లీ పుడతాడా అలాంటివాడు? అనే ప్రశ్న వస్తోంది.
ఘనమైన కెరీర్..
స్పెయిన్ బుల్.. ఈ ఒక్క పదం చాలేమో అతడి గురించి చెప్పడానికి. రఫెల్ నాదల్ కు పర్యాయపదంగా మారిందీ బిరుదు. నాదల్ ఇకమీదట మనకు టెన్నిస్ లో కనిపించడు. అతడి తన కెరీర్ ను ముగించాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ టెన్నిస్ కు వీడ్కోలు పలికిన నాదల్.. డేవిస్ కప్ లో చివరిసారి ఆడతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సొంత దేశం స్పెయిన్ కు ప్రాతినిధ్యం వహించి దేశ భక్తి చాటుకున్నాడు. అయితే, డేవిస్ కప్ లో స్పెయిన్ పై నెదర్లాండ్స్ 2-1 తేడాతో నెగ్గింది. కాగా, మొదట స్పెయిన్ తరఫున సింగిల్స్ ఆడిన నాదల్ పరాజయం పాలయ్యాడు. మిగతా రౌండ్లలోనూ స్పెయిన్ గెలవలేదు. ఒకవేళ నెగ్గి ఉంటే నాదల్ కు మళ్లీ మైదానంలోకి దిగే చాన్స్ వచ్చేది.
10 వేల మంది మధ్యన
ఒకవేళ స్పెయిన్ రెండో మ్యాచ్ లోనూ నెగ్గి.. నాదల్ ను చివరిగా మైదానంలో చూద్దామన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. ఇక తన వీడ్కోలు గురించి చెబుతూ 22 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నాదల్ భావోద్వేగానికి గురయ్యాడు. 10 వేల మందికిపైగా అభిమానుల మధ్యన రఫా ఇక సెలవంటూ వీడ్కోలు పలికాడు.
ఆ ఇద్దరి మధ్యన..
ఆధునిక టెన్నిస్ లో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్, సెర్బియా యోధుడు జకోవిచ్, స్పెయిన్ బుల్ నాదల్ ముగ్గురూ ముగ్గురే. ఒక్కొక్కరు 20కి పైగా టైటిల్స్ కొట్టారు. ఈ ముగ్గురి మధ్య 20 ఏళ్లలో 80 గ్రాండ్ స్లామ్ లు జరగ్గా.. 66 వీరే కొట్టారు. దీన్నిబట్టే ఈ త్రయం ఎంతటి ముద్ర వేసిందో తెలుస్తుంది. కాగా, ఫెడరర్ (20 టైటిల్స్), జకోవిచ్ (24టైటిల్స్) కంటే ముందే 20 టైటిల్స్ మార్క్ దాటిన నాదల్ ను గాయాలు దెబ్బతీశాయి. కొన్నేళ్లు గాయాలతో సతమతం అవుతున్న అతడు.. ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ లకు గాను ఒకటే ఆడాడు. ప్యారిస్ ఒలింపిక్స్ లోనూ నిరాశపరిచాడు. ఇక నాదల్ 22 గ్రాండ్ స్లామ్ లలో 14 ఫ్రెంచ్ ఓపెన్, రెండు వింబుల్డన్, నాలుగు యూఎస్ ఓపెన్, రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి.
‘ఇదో అత్యంత భావోద్వేగ రోజు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో చివరి సింగిల్స్ మ్యాచ్ ఆడేశా. ఆ సమయంలో దేశ జాతీయ గీతం వస్తుంటే ప్రత్యేకంగా అనిపిస్తోంది. నేను సాధించిన టైటిళ్లే నన్ను గుర్తు పెట్టుకునేలా చేస్తాయి., చిన్న గ్రామం నుంచి వచ్చిన నన్ను ఓ మంచి వ్యక్తిగా గుర్తుపడితే చాలు. అంతకంటే ఆనందం వేరేది లేదు’ అని నాదల్ పేర్కొన్నాడు.