ఫైనల్ లో టీమిండియా ఓటమికి మోడీ సర్కారే కారణమట!
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఒక్కసారి కూడా టీమిండియా ఐసీసీ టైటిళ్లను సొంతం చేసుకోలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు
By: Tupaki Desk | 20 Nov 2023 4:46 AM GMTఆనందంలో ఉన్నప్పుడు పట్టించుకోని చాలా అంశాలు.. బాధలోనూ.. వేదనలోనూ బయటకు వచ్చేస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే ప్రపంచకప్ ఫైనల్ పోరులో టీమిండియా జట్టు ఓడిపోవటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది ఆశలు పెట్టుకున్న పోరులో టీమిండియా విజయం సాధించకపోవటానికి జట్టు ఆటకు మించి మరిన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి టీమిండియా ఓటమి మోడీసర్కారు ఖాతాలో వేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఒక్కసారి కూడా టీమిండియా ఐసీసీ టైటిళ్లను సొంతం చేసుకోలేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కారు దిగిపోతే తప్పించి టీమిండియా ఐసీసీ టోర్నీని గెలవలేదన్న కామెంట్లు వస్తున్నాయి. ఎందుకిలా? దీనికి కారణం ఏమిటంటే.. కొందరు వినిపిస్తున్న వాదన ఆసక్తికరంగా మారింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. 2015లో వన్డే ప్రపంచకప్ సెమీస్.. 2016లో టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్.. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్.. 2021 లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్.. 2021లో టీ20 ప్రపంచకప్ లీగ్ దశ.. 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్.. 2023 ప్రపంచపక్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరుతో పాటు తాజాగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ పోరులోనూ టీమిండియా ఓటమిపాలైంది.
లీగ్ దశ నుంచి ఫైనల్ కు చేరే వరకు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన టీమిండియా.. అనూహ్యంగా ఫైనల్ పోరులో మాత్రం దారుణంగా ఫెయిల్ కావటం తెలిసిందే. టీమిండియా ఓటమికి కేంద్రంలోని మోడీ సర్కారుకు లింకేమిటన్న వారి ప్రశ్నకు పలువురు నెటిజన్లు ఆసక్తికర రీతిలో బదులిస్తున్నారు. క్రీడలకు రాజకీయాలకు సంబంధం ఏమిటన్న వారు.. బీసీసీఐ సెక్రటరీ జైషా ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడే జైషా అని.. ఆయన కారణంగానే ఫైనల్ పోరును అహ్మదాబాద్ లో పెట్టారని మండిపడుతున్నారు.
అహ్మదాబాద్ ఎప్పుడూ అచ్చిరాదని.. ఈ తరహా సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ నిర్వహిస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. అహ్మదాబాద్ లో జరిగే.. ఏ కీలక మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించదన్న సెంటిమెంట్ తాజా ఓటమితో మరోసారి ఫ్రూవ్ అయినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే.. జైషా కానీ బీసీసీఐ సెక్రటరీ కాకుంటే.. కచ్ఛితంగా ఫైనల్ పోరు అహ్మదాబాద్ లో జరిగేదే కాదు. ఆయన తిప్పిన చక్రంతోనే తాజా ఫలితం ఏర్పడిందన్న వాదన పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.